డిపాజిట్‌ రేట్లను తగ్గిస్తున్నాయ్‌
close

Published : 20/06/2021 02:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డిపాజిట్‌ రేట్లను తగ్గిస్తున్నాయ్‌

స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల తీరిదీ

హైదరాబాద్‌: సూక్ష్మ రుణ సంస్థలుగా ప్రస్థానం ప్రారంభించి.. బ్యాంకులుగా మారిన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లు డిపాజిట్‌ రేట్లను క్రమంగా తగ్గించేస్తున్నాయి. ఆరేళ్ల నుంచీ ఆర్‌బీఐ ఈ సూక్ష్మ రుణ సంస్థలకు బ్యాంకులుగా లైసెన్సులు ఇవ్వడం ప్రారంభించాక, డిపాజిట్లు స్వీకరించేందుకు ఇవి పోటీ పడ్డాయి. మదుపుదార్లను ఆకర్షించేందుకు వాణిజ్య బ్యాంకుల కన్నా డిపాజిట్లపై 1-2 శాతం ఎక్కువ వడ్డీ రేట్లను ఈ బ్యాంకులు అందించాయి. అయితే, ఇప్పటికే ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించడంతో బ్యాంకులు తక్కువ వడ్డీ శాతానికే రుణం ఇస్తున్నాయి. ఇక స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు సాధారణంగా రిస్క్‌ ఎక్కువగా ఉన్న వారికే రుణాలు అందిస్తుంటాయి. కొవిడ్‌-19 తర్వాత ఈ తరహా రుణాల్లో నష్టభయం మరింత పెరిగింది. అదే సమయంలో చాలామంది డిపాజిట్లపై అధిక వడ్డీ కోసం ఈ చిన్న బ్యాంకులను ఆశ్రయించడం ప్రారంభించారు. ఫలితంగా అటు డిపాజిట్‌దారులకు అధిక వడ్డీ చెల్లించడం, రుణాల్లో ఆశించిన మేరకు పెరుగుదల లేకపోవడం, సరిగ్గా వసూలు కాకపోవడం ఈ బ్యాంకులకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడం మొదలు పెట్టాయి.

సూర్యోదయ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ జూన్‌ 21 నుంచి వివిధ వ్యవధుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 25 నుంచి 100 బేసిస్‌ పాయింట్ల మేరకు వడ్డీ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఐదేళ్ల ఎఫ్‌డీపై ఇప్పటివరకు 7.25 శాతం వడ్డీ ఉండగా.. ఇది 6.25 శాతానికి చేరనుంది. ఏడాది-రెండేళ్ల కాలానికి వర్తించే వడ్డీ రేటు 6.50శాతంగా మారనుంది.క్యాపిటల్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లు కూడా డిపాజిట్‌ రేట్లను తగ్గించాయి. ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌, జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లూ గత నెలలోనే డిపాజిట్లపై వడ్డీ రేటును కోత కోశాయి. ఇప్పటికీ కాస్త అధిక వడ్డీ రేటు 7% అందిస్తున్న వాటిల్లో ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, నార్త్‌ ఈస్ట్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లు ఉన్నాయి.

రూ.5 లక్షల వరకు ఇబ్బంది ఉండదు
స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేటప్పుడు ఖాతాదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారిపై కొవిడ్‌ పరిణామాల ప్రభావం ఎక్కువగా ఉంటే, వసూళ్లు కష్టమవుతాయి. అందువల్ల దీర్ఘకాలం కంటే తక్కువ కాలావధికి అయితే డిపాజిట్లకు అయితే మేలని సూచిస్తున్నారు. అయితే ఈ బ్యాంకుల డిపాజిట్లకూ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ కింద బీమా సౌకర్యం ఉంటుంది. కాబట్టి, రూ.5 లక్షల వరకు డిపాజిట్లకు ఇబ్బందేమీ ఉండదు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని