51179 వద్ద మద్దతు!
close

Published : 21/06/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

51179 వద్ద మద్దతు!

సమీక్ష: దేశీయంగా కొవిడ్‌ ఉద్ధృతి మరింత తగ్గడంతో మార్కెట్లు తాజా రికార్డు గరిష్ఠాలకు చేరాయి. అనంతరం లాభాల స్వీకరణతో మళ్లీ వెనక్కి వచ్చాయి. ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాలకు తోడు కంపెనీలు రికవరీ సంకేతాలు ఇవ్వడం, సానుకూల ఆర్థిక గణాంకాలు అండగా నిలిచాయి. కొవిడ్‌ మూడో దశపై ఆందోళనలు, అధిక ద్రవ్యోల్బణం, ఫెడ్‌ నిర్ణయాలు మదుపర్ల అప్రమత్తతకు కారణమయ్యాయి. మేలో టోకు ద్రవ్యోల్బణం 12.94 శాతం, రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.3 శాతానికి పెరిగాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ అంచనాల కంటే వేగంగా రేట్ల పెంపునకు సంకేతాలివ్వడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బ్యారల్‌ ముడిచమురు ధర 1.3 శాతం పెరిగి 73.6 డాలర్లకు చేరగా, డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.9కు బలహీనపడింది.  అంతర్జాతీయంగా చూస్తే.. జపాన్‌ ఎగుమతులు 1980 తర్వాత అత్యంత వేగవంతమైన వృద్ధి సాధించాయి. చైనా పారిశ్రామికోత్పత్తి మేలో 8.8 శాతం పెరిగింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 0.2 శాతం లాభంతో 52,344 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 0.7 శాతం పెరిగి 15,683 పాయింట్ల దగ్గర స్థిరపడింది. ఎఫ్‌ఐఐలు నికరంగా రూ.1061 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా, డీఐఐలు రూ.488 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. జూన్‌లో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు నికరంగా రూ.13,667 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 1:2గా నమోదు కావడం..

మార్కెట్‌లో లాభాల స్వీకరణను సూచిస్తోంది.

ఈవారంపై అంచనా : వరుసగా నాలుగు వారాల లాభాల తర్వాత.. గత వారం సెన్సెక్స్‌ నష్టపోయింది. స్వల్పకాలంలో సెన్సెక్స్‌కు 51179 పాయింట్ల వద్ద బలమైన మద్దతు లభించవచ్చు. ఈ స్థాయి దిగువన ముగిస్తే బలహీనపడే అవకాశం ఉంది. మార్కెట్‌లో స్థిరీకరణ కొనసాగొచ్చు.

ప్రభావిత అంశాలు : అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే సంకేతాలకు అనుగుణంగా దేశీయ సూచీలు కదలాడొచ్చు. కొవిడ్‌ రెండో దశ నుంచి కోలుకోవడం, టీకా ప్రక్రియ పుంజుకోవడం, రుతుపవనాల పురోగతి దిగువ స్థాయుల్లో మార్కెట్‌కు మద్దతు ఇవ్వొచ్చు. ఈ వారం ఎస్‌బీఐ, డిష్‌ టీవీ, హిందుస్థాన్‌ కాపర్‌ వంటి సంస్థల బోర్డు సమావేశాలున్నాయి. అశోక్‌ లేలాండ్‌, అపోలో, ఓఎన్‌జీసీ, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎన్‌ఎమ్‌డీసీ, మిధానీ, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ సంస్థలు ఫలితాలు వెలువరించనున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే.. చైనా, బ్రిటన్‌ కేంద్ర బ్యాంకుల పరపతి సమావేశాలు, అమెరికా గృహ విక్రయాలు, బ్యాంక్‌ జపాన్‌ సమావేశ నిర్ణయాలు, అమెరికా పీఎంఐ, జీడీపీ కీలకం కానున్నాయి.

తక్షణ మద్దతు స్థాయులు: 51,601, 51,179, 50,891

తక్షణ నిరోధ స్థాయులు: 52,816, 53,270, 54,000

మార్కెట్‌కు దిగువ స్థాయుల్లో మద్దతు లభించొచ్చు.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

 

 


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని