విక్రయాల ఒత్తిడికి అవకాశం
close

Published : 21/06/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విక్రయాల ఒత్తిడికి అవకాశం

డెరివేటివ్‌ గడువు నేపథ్యంలో ఊగిసలాటలు

రిలయన్స్‌ ఏజీఎమ్‌పై మదుపర్ల దృష్టి

ఆర్థిక ఫలితాలు, టీకా వార్తలూ కీలకం

విశ్లేషకుల అంచనాలు

స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం

బ్యాంకింగ్‌ షేర్లలో బలహీనతలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ వారం సూచీలకు విక్రయాల ఒత్తిడి ఎదురవ్వచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జూన్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ఈ వారమే ముగుస్తున్నందున భారీ ఊగిసలాట చోటుచేసుకోవచ్చని అంటున్నారు. నిఫ్టీ-50కి 15,800 వద్ద బలమైన నిరోధం ఎదురుకావొచ్చని.. 15,400 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరుగుతాయన్న ఆర్‌బీఐ ఎమ్‌పీసీ అంచనాల నేపథ్యంలో కీలకరేట్ల కోతకు ఈ ఏడాది అవకాశాలు కనిపించడం లేదు.  ఈనెల 24న జరగబోయే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్‌)పై మదుపర్లు ఆసక్తి చూపుతారు. టీకా-రుతు పవనాల వార్తలు, ఈ వారం వెలువడే ఆర్థిక ఫలితాలు సైతం మార్కెట్‌పై ప్రభావం చూపొచ్చు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

* బ్యాంకు షేర్లు ప్రతికూల ధోరణితో కదలాడొచ్చు. నిఫ్టీ బ్యాంకుకు 34,000 వద్ద మద్దతు లభించవచ్చు. ఆ స్థాయిని కోల్పోతే 33,500కు డీలా పడొచ్చు. బలమైన బ్యాలెన్స్‌ షీట్ల నేపథ్యంలో ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకులపై సానుకూలంగా ఉన్నారు.

* చమురు షేర్లకు గురువారం జరగనున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) వార్షిక సాధారణ సమావేశం కీలకం కానుంది. సౌదీ ఆరామ్‌కో ఛైర్మన్‌ యాసిర్‌ అల్‌ రుమయ్యన్‌ ఆర్‌ఐఎల్‌ బోర్డులోకి రావొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఆర్‌ఐఎల్‌కు అత్యంత సానుకూలతలు కనిపించవచ్చు. ఫలితాలను ప్రకటించనున్న ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాలూ వెలుగులోకి రావొచ్చు.

* టెలికాంలో చూస్తే గూగుల్‌తో కలిసి కొత్త స్మార్ట్‌ఫోన్‌, లాప్‌టాప్‌లను జియో ఆవిష్కరించనుందన్న వార్తలపై మదుపర్లు కన్నేయవచ్చు.

* వాహన రంగానికి సంబంధించి ఎటువంటి వార్తలూ లేనందున మార్కెట్‌తో పాటే కదలాడొచ్చు. 

* యంత్ర పరికరాల షేర్లు నష్టాల పాలుకావొచ్చు. సమీప భవిష్యత్తులో స్తబ్దుగా ఉండొచ్చన్న అంచనాలతో భెల్‌ షేర్లు బలహీనంగా ట్రేడవవచ్చు. 

* వచ్చే కొన్నేళ్ల పాటు ద్రవ్యోల్బణం పెరగొచ్చన్న అంతర్జాతీయ ఆందోళనల నేపథ్యంలో, రక్షణాత్మక రంగమైన ఔషధ షేర్లు రాణించే అవకాశం ఉంది. స్పెషాలిటీ ఔషధాలు, టీకాలను తయారు చేసే కంపెనీలపై మదుపర్లు దృష్టి సారించొచ్చు.

* వర్షాకాలం నేపథ్యంలో నిర్మాణ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతున్నందున సిమెంటు కంపెనీల షేర్లు ఒక శ్రేణికి లోబడి చలించొచ్చు. అంతర్లీనంగా సెంటిమెంటు సానుకూలంగా ఉన్నా, రుతుపవనాల కారణంగా కంపెనీలు ధరలు తగ్గించే అవకాశం ఉంది.

* లోహ, గనుల కంపెనీల షేర్లు స్తబ్దుగా కనిపించొచ్చు. ఉక్కు షేర్లు గత వారం బాగా తగ్గినందున తక్కువ స్థాయిల్లో కొనుగోలు చేయొచ్చని అంటున్నారు.

* గిరాకీపై ఆందోళన నేపథ్యంలో ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు నష్టాల పాలుకావొచ్చు. పెరిగిన ముడి పదార్థాల ధరలు సైతం ఈ రంగ కంపెనీలకు సవాళ్లు విసురుతున్నాయి.

* ఐటీ కంపెనీల షేర్లు లాభాలను కొనసాగించవచ్చు. ఉద్యోగ నియామకాలపై ఇన్ఫోసిస్‌ చేసిన ప్రకటన ఆ కంపెనీ షేర్లపై ప్రభావం చూపొచ్చు. 

 


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని