ఏడాది చివరిలో జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు
close

Published : 23/06/2021 02:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏడాది చివరిలో జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు

 జలాన్‌ కల్రాక్‌ పరిష్కార ప్రణాళికకు ఆమోదం
అమలుకు 90 రోజుల గడువు: ఎన్‌సీఎల్‌టీ

జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు ఈ ఏడాది చివరిలో మళ్లీ కార్యకాపాలు సాగించే అవకాశముంది. దివాలా తీసిన ఈ కంపెనీని బయటపడేయడానికి జలాన్‌ కల్రాక్‌ కన్సార్షియం ప్రతిపాదించిన పరిష్కార ప్రణాళికకు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) మంగళవారం ఆమోద ముద్ర వేయడం ఇందుకు నేపథ్యం. ఏప్రిల్‌ 17, 2019న కార్యకలాపాలను నిలిపేసిన జెట్‌ ఎయిర్‌వేస్‌ నుంచి రూ.8,000 కోట్లకు పైగా బకాయిలను రాబట్టుకోవడం కోసం అదే ఏడాది జూన్‌లో ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని రుణదాతలు దివాలా పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణ పరిష్కార ప్రణాళికకు మొహమ్మద్‌ అజ్మల్‌, వి నల్లసేనాపతి ఆధ్వర్యంలోని ఎన్‌ఎసీఎల్‌టీ ముంబయి ధర్మాసనం  ఆమోదం తెలిపింది. జూన్‌ 22 నుంచి 90 రోజుల్లోగా ఈ ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించింది. ఒక వేళ గడువు పొడిగించుకోవాలనుకుంటే తిరిగి ధర్మాసనాన్ని కోరవచ్చని దరఖాస్తుదారు (జలాన్‌ కల్రాక్‌ కన్సార్షియం)కు మౌఖిక ఆదేశాలు ఇచ్చింది.

స్లాట్ల విషయం ప్రభుత్వమే తేలుస్తుంది

జెట్‌ ఎయిర్‌వేస్‌కు గతంలో ఉన్న స్లాట్ల ఆధారంగా మళ్లీ కేటాయించాలనే ఆదేశాలు జారీ చేయడం లేదని ట్రైబ్యునల్‌ పేర్కొంది. ఆ విషయంలో ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. కార్యకలాపాలు నిలవడానికి ముందు వివిధ విమానాశ్రయాల్లో ఈ సంస్థకున్న స్లాట్లను ఇతర విమానయాన సంస్థలకు కేటాయించారు.

రెండేళ్లుగా పరిష్కార ప్రక్రియలో

ఎస్‌బీఐ కన్సార్షియం దివాలా పిటిషన్‌ దాఖలు చేసినప్పటి నుంచి జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవహారాలను పరిష్కార వృత్తినిపుణుడైన ఆశిష్‌ చావ్‌చారియాచూశారు. బ్రిటన్‌కు చెందిన కల్రాక్‌ క్యాపిటల్‌, యూఏఈకి చెందిన మురారి లాల్‌ జలాన్‌ ఆధ్వర్యంలోని కన్సార్షియం సమర్పించిన పరిష్కార ప్రణాళికకు ఆ సంస్థకు రుణాలిచ్చిన సంస్థలు (సీఓసీ) అక్టోబరు 2020లో ఆమోదం తెలిపాయి. తదుపరి స్లాట్లే ఈ ప్రణాళికలో కీలకమని వృత్తినిపుణుడు ఎన్‌సీఎల్‌టీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే పాత స్లాట్ల పొందే వీలు కంపెనీకి లేదని పేర్కొంటూ డీజీసీఏ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు  అఫిడవిట్‌ సమర్పించాయి. ‘తాజా ఆదేశాలపై సంతోషంగా ఉన్నాం. కచ్చితంగా కంపెనీ పునరుజ్జీవం జరుగుతుంది. అన్నీ సరిగ్గా జరిగితే ఈ ఏడాది చివరికే జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాల్లో కొన్ని ఆకాశానికి ఎగురుతాయ’ని వృత్తినిపుణుడు ఆశిష్‌ పేర్కొన్నారు.

రూ.240 షేరు కాస్తా.. రూ.99కి

జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు విలువ గత రెండేళ్లలో సగానికి పైగా క్షీణించింది. సంస్థ కార్యకలాపాలు నిలపడానికి ఒక రోజు ముందు (ఏప్రిల్‌ 16, 2019) బీఎస్‌ఈలో రూ.241.85 వద్ద షేరు స్థిరపడింది.  మంగళవారం 5శాతం లాభపడినా కూడా, ఇప్పటివరకు 58.87 శాతం నష్టపోయి రూ.99.45కు చేరింది. మార్కెట్‌ విలువ రూ.1617.27 కోట్లు తగ్గి, రూ.1129.73 కోట్లకు పరిమితమైంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని