బ్యాంకులకు రూ.9000 కోట్లు
close

Published : 24/06/2021 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాంకులకు రూ.9000 కోట్లు

నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సి, మాల్యా కేసుల్లో రికవరీ చేశాం: ఈడీ
దిల్లీ

నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సి, విజయ్‌ మాల్యా వ్యవహారాల్లో బ్యాంకులకు వాటిల్లిన మొత్తం నష్టంలో ఇప్పటివరకు 40 శాతాన్ని తిరిగి వసూలు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం వెల్లడించింది. జప్తు (అటాచ్‌) చేసిన షేర్లను బుధవారం విక్రయించడం ద్వారా రూ.5,800 కోట్లు రాబట్టామని పేర్కొంది. తాజా షేర్ల విక్రయం అనంతరం మొత్తం రికవరీ విలువ రూ.9,041.50 కోట్లకు చేరిందని.. పై ముగ్గురు బ్యాంకులను మోసం చేసిన రూ.22,000 కోట్ల విలువలో ఇది 40 శాతమని ఈడీ వెల్లడించింది. తాజా పరిణామంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందిస్తూ.. ‘ఆర్థిక నేరగాళ్లు బ్యాంకులకు చేసిన నష్టాన్ని వసూలు చేసే వరకు, వారిని వెంటాడుతూనే ఉంటాం. వాళ్ల ఆస్తులను జప్తు చేసి, బకాయిలను వసూలు చేశామ’ని అన్నారు. బ్యాంకులను మోసం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సి, విజయ్‌మాల్యా విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సి, మరికొందరు కలిసి ముంబయిలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ బ్రాడీ హౌస్‌ శాఖలో రూ.13,000 కోట్ల మోసానికి పాల్పడిన ఆరోపణలపై ఈడీ, సీబీఐలు దర్యాప్తు చేస్తున్నాయి. అలాగే బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగ్గొట్టిన కేసులో విజయ్‌ మాల్యాపై దర్యాప్తు జరుగుతోంది. ఈ రెండు మోసపూరిత కేసుల్లో బ్యాంకులకు రూ.22,585.83 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించింది.

జప్తు చేసిన మొత్తం ఆస్తులతో 80 శాతం వసూలు..: మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈ రెండు కేసుల్లో రూ.18,170.02 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశామని, ఇందులో విదేశాల్లోని రూ.969 కోట్లు విలువైన ఆస్తులు కూడా ఉన్నాయని పేర్కొంది. జప్తు, స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ బ్యాంకులకు వాటిల్లిన నష్టంలో 80.45 శాతం వరకు ఉంటుందని ఈడీ వెల్లడించింది. ఈ జప్తు చేసిన ఆస్తుల నుంచి రూ.5,8240.50 కోట్ల విలువైన యునైటెడ్‌ బ్రూవరీస్‌ షేర్లను ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల బృందం తరపున బుధవారం రుణ వసూలు ట్రైబ్యునల్‌ (డీఆర్‌టీ) విక్రయించిందని తెలిపింది. షేర్ల విక్రయం ద్వారా మరో రూ.880 కోట్లు జూన్‌ 25న వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. మాల్యా, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కేసుల వ్యవహారంలో గతంలోనూ షేర్ల విక్రయం ద్వారా రూ.1,357 కోట్లను బ్యాంకులు వసూలు చేశాయని ఈడీ వెల్లడించింది. అలాగే నీరవ్‌ మోదీ కేసు దర్యాప్తులోనూ రూ.1,060 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులకు అప్పగించామని తెలిపింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు రూ.9,041.50 కోట్ల విలువైన ఆస్తులను అప్పగించినట్లయ్యిందని.. బ్యాంకులకు వాటిల్లిన మొత్తం ఆస్తుల్లో ఇది 40 శాతానికి సమానమని ఈడీ వివరించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని