ఫార్మసీ వ్యాపారం విభజన
close

Published : 25/06/2021 04:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫార్మసీ వ్యాపారం విభజన

వ్యూహాత్మక పెట్టుబడి కోసం అపోలో హాస్పిటల్స్‌ అన్వేషణ

ఈనాడు - హైదరాబాద్‌

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ఫార్మసీ వ్యాపార కార్యకలాపాలను అపోలో హెల్త్‌కో లిమిటెడ్‌ అనే నూతన అనుబంధ కంపెనీ కిందకు తీసుకురావాలని అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ నిర్ణయించింది. తద్వారా  నూతన వైద్యసేవల విభాగాన్ని రూపుదిద్దినట్లు అవుతుందని భావిస్తోంది. దీని ప్రకారం అపోలో ఆసుపత్రులలో ఉన్న రిటైల్‌ ఫార్మసీ స్టోర్లను మినహాయించి, మిగిలిన అపోలో 24/7 స్టోర్లు, అపోలో ఫార్మసీ బ్రాండ్లు, ప్రైవేట్‌ లేబుల్‌ బ్రాండ్లను ఈ అనుబంధ కంపెనీకి రూ.1,210 కోట్లకు ‘స్లంప్‌ సేల్‌’ పద్ధతిలో విక్రయిస్తారు. అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ గత ఆర్థిక సంవత్సరంలో నమోదు చేసిన టర్నోవర్‌లో ఈ వ్యాపారం వాటా 54.2 శాతం ఉంది. ప్రతిపాదిత పునర్‌వ్యవస్థీకరణ వల్ల డిజిటల్‌ పద్ధతిలో ఫార్మసీ వ్యాపార కార్యకలాపాలను బహుముఖంగా విస్తరించేందుకు వీలు కలుగుతుందని, అదే సమయంలో వ్యూహాత్మక పెట్టుబడిదార్లను ఆకర్షించే వీలుంటుందని అపోలో యాజమాన్యం భావిస్తోంది. ఫార్మసీ వ్యాపార సంస్థలో మైనార్టీ వాటా విక్రయించాలనే ఆలోచన అపోలో యాజమాన్యానికి ఉందని, దీనికి సంబంధించి ఇప్పటికే వ్యూహాత్మక ఇన్వెస్టర్లను గుర్తించే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు.

తగ్గిన నికరలాభం

జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.2,868 కోట్ల ఆదాయాన్ని, రూ.167.8 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2019-20 ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.2,922.4 కోట్లు, నికరలాభం రూ.219.3 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఆదాయం 1.9 శాతం, నికరలాభం 23.5 శాతం తగ్గినట్లు అవుతోంది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) పూర్తికాలానికి అపోలో హాస్పిటల్స్‌ రూ.10,560 కోట్ల ఆదాయాన్ని, రూ.150.4 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2019-20లో ఆదాయం రూ.11,246.8 కోట్లు, నికరలాభం రూ.454.9 కోట్లు ఉన్నాయి. వాటాదార్లకు ఒక్కో షేరుకు రూ.3 చొప్పున డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ యాజమాన్యం ప్రతిపాదించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని