వినాయక చవితికి జియోఫోన్‌ నెక్ట్స్‌ 
close

Updated : 25/06/2021 09:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వినాయక చవితికి జియోఫోన్‌ నెక్ట్స్‌ 

అత్యంత అందుబాటు ధర 4జీ స్మార్ట్‌ఫోన్‌

రిలయన్స్‌ బోర్డులోకి ఆరామ్‌కో ఛైర్మన్‌

రూ.75,000 కోట్లతో ధీరూభాయ్‌ అంబానీ గ్రీన్‌ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌

3-5 ఏళ్లలో రిటైల్‌లో మూడింతల వృద్ధి : ఆర్‌ఐఎల్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 44వ వార్షిక సాధారణ సమావేశం

దిల్లీ

జియో, గూగుల్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన స్మార్ట్‌ఫోన్‌ ‘జియోఫోన్‌ నెక్స్ట్‌’ వచ్చే వినాయక చవితి రోజున అంటే సెప్టెంబరు 10 నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోనే అత్యంత అందుబాటు ధరలో లభించే 4జీ స్మార్ట్‌ఫోన్‌గా ఇది ఉండబోతోందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. గురువారం దృశ్యమాధ్యమ పద్ధతిలో జరిగిన కంపెనీ 44వ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్‌)లో కొత్త స్మార్ట్‌ఫోన్‌, 5జీ సేవలు, రిలయన్స్‌ రిటైల్‌, ఇంధన వ్యాపారంలో పెట్టుబడుల వంటి ప్రణాళికలపై వాటాదార్లకు వివరించారు. ఈ సమావేంలో ఆయన ఏమన్నారంటే..


2జీ విముక్త దేశంగా మార్చాలంటే

దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది 2జీ సేవలు వినియోగిస్తున్నారు. అధిక ఛార్జీలకు కారణమవుతున్న 2జీ విముక్త దేశంగా భారత్‌ను మార్చాలంటే అత్యంత చౌక 4జీ స్మార్ట్‌ఫోన్‌ అవసరం. ఇందుకోసమే గూగుల్‌తో కలిసి ‘జియో ఫోన్‌ నెక్స్ట్‌’ను తీసుకొస్తున్నాం. ఇది ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఆప్టిమైజ్డ్‌ వర్షన్‌)పై పనిచేస్తుంది. వాయిస్‌ అసిస్టెంట్‌, భాష అనువాదం, తెర మీద ఉన్న అక్షరాలను ఆటోమేటిక్‌గా చదవడం, స్మార్ట్‌ కెమేరా వంటివి ఈ ఫోన్‌లో ఉంటాయి. ఒక అంతర్జాతీయ దిగ్గజం, దేశీయ సాంకేతిక కంపెనీ కలిసి తీసుకొస్తున్న ఈ ఫోన్‌ను తొలుత భారత్‌లో,  తదుపరి మిగతా ప్రపంచానికి అందజేస్తాం. (ఫోన్‌ ధరను మాత్రం వెల్లడించలేదు.)


గూగుల్‌ సీఈఓతో మాట్లాడాకే..

2జీ వినియోగదార్లకు అనువైన ధరలో, వేగవంతమైన ఇంటర్నెట్‌ సదుపాయం లభించేలా, గూగుల్‌, జియో కలిసి అభివృద్ధి చేసే తదుపరి తరం ఫోన్‌ ఉండాలని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌, నేను నిర్ణయించుకున్నాం. ఈ ఫోన్‌ కోసమే ప్రత్యేకంగా ఆప్టిమైజ్డ్‌ వర్షన్‌ యాండ్రాయిడ్‌ ఓఎస్‌ను తయారు చేసినట్లు పిచాయ్‌ తెలిపారు.


తొలి 5జీ సేవలు మేమే అందిస్తాం

దేశంలో పూర్తి స్థాయి 5జీ సేవలను తొలుత మేమే అందిస్తాం. ఇప్పటికే 1 జీబీపీఎస్‌కు పైగా వేగంతో పరీక్షలు విజయవంతమయ్యాయి. 100 శాతం ‘భారత్‌ తయారీ’ 5జీ సేవలను జియో ఇంజినీర్లు అభివృద్ధి చేశారు. ఇందుకు సంబంధించిన నియంత్రణపరమైన అనుమతులన్నీ లభించాయి. 30 లక్షల గృహ, వ్యాపార వినియోగదార్లతో జియో ఫైబర్‌ దేశంలోనే అతిపెద్ద, వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాడ్‌బ్యాండ్‌ ఆపరేటరుగా మారింది.


వ్యూహాత్మక భాగస్వామి ఆరామ్‌కో

సౌదీ ఆరామ్‌కో ఛైర్మన్‌, పీఐఎఫ్‌ అధిపతి యాసిర్‌ ఓత్‌మాన్‌ అల్‌ రుమయ్యన్‌ రిలయన్స్‌ బోర్డులోకి రానున్నారు. బోర్డులో యోగేంద్ర పి త్రివేది(92) తనకు తానుగా పదవీ విరమణ చేస్తుండడంతో ఆ స్థానంలో రుమయ్యన్‌(51) చేరతారు. మా ఓ2సీ వ్యాపారంలోకి సౌదీ ఆరామ్‌కోను ఒక వ్యూహాత్మక భాగస్వామిగా ఆహ్వానిస్తున్నాం. 15 బిలియన్‌ డాలర్ల విలువైన 20 శాతం వాటాను సౌదీ ఆరామ్‌కోకు విక్రయించే ఒప్పందం ఈ ఏడాదిలోనే పూర్తవుతుంది. ఆగస్టు 2019లోనే ప్రతిపాదన వచ్చినా, కరోనా పరిణామాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఆర్‌ఐఎల్‌కు చెందిన జియో, రిటైల్‌ వెంచర్‌, ఇన్విట్‌, డిజిటల్‌ ఫైబర్‌ ఇన్‌ఫ్రా ట్రస్ట్‌లలో పీఐఎఫ్‌ దాదాపు రూ.25,000 కోట్ల పెట్టుబడులు పెట్టింది.


రిలయన్స్‌ రిటైల్‌లో 10 లక్షల ఉద్యోగాలు

మూడు నుంచి అయిదేళ్లలో రిలయన్స్‌ రిటైల్‌ వ్యాపారం కనీసం మూడింతలు వృద్ధి చెందుతుంది. వచ్చే మూడేళ్లలో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తాం. పలు ఇతర రిటైల్‌ వ్యాపారాల కొనుగోలును కొనసాగిస్తాం. ఇప్పటికే కంపెనీ నెట్‌మెడ్స్‌, అర్బన్‌ ల్యాడర్‌, జివామే వంటి వాటిని కొనుగోలు చేసింది కూడా. వచ్చే మూడేళ్లలో ఇ-కామర్స్‌ వెంచర్‌ అయిన జియోమార్ట్‌లోకి కోటి మందికి పైగా వ్యాపార భాగస్వాములు వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నాం. విక్రయశాలల సంఖ్యనూ భారీగా పెంచుతున్నాం.

* 2020-21లో నెలకొల్పిన 1500 తో కలిపి మొత్తం స్టోర్ల సంఖ్య 12,711కు చేరింది.

* గతేడాదిలో రిలయన్స్‌ 75000 ఉద్యోగాలిచ్చింది. అత్యధిక ఎగుమతులు చేస్తూ, ప్రైవేటు రంగంలో కస్టమ్స్‌-ఎక్సైజ్‌ సుంకాలు ఎక్కువగా చెల్లించే సంస్థగా కొనసాగుతోంది.

* జియోమార్ట్‌, వాట్సాప్‌ అనుసంధాన పథకానికి స్పందన బాగుంది. పూర్తిస్థాయి వాణిజ్య సొల్యూషన్‌ త్వరలో ప్రారంభిస్తాం.

* మైక్రోసాఫ్ట్‌ అజూర్‌క్లౌడ్‌ భాగస్వామ్యంతో జియో డేటా సెంటర్లు నెలకొల్పి, ఎస్‌ఎంఈలకు సహకరిస్తాం.


5000 ఎకరాల్లో 4 గిగా ప్రాజెక్టులు

పర్యావరణ అనుకూల కొత్త ఇంధన వ్యాపారంలో రూ.75,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. సోలార్‌ తయారీ యూనిట్లు, ఇంధన నిల్వ కోసం బ్యాటరీ ఫాక్టరీ, ఫ్యూయల్‌ సెల్‌ తయారీ ప్లాంటు, హరిత హైడ్రోజన్‌ (వాహనాలకు ఉపయోగించేలా) తయారీ కోసం ఎలక్ట్రోలైజర్‌ యూనిట్‌ ఏర్పాటు చేయనున్నాం. 2030 కల్లా 100 గిగావాట్ల(జీడబ్ల్యూ) సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యంతో ప్లాంటు ఏర్పాటు చేయడంతో పాటు; కార్బన్‌ ఫైబర్‌ ప్లాంటులోనూ పెట్టుబడులను పెట్టనున్నాం. హైడ్రోకార్బన్‌ ఇంధన ఆధారిత కార్యకలాపాల ద్వారా 60 శాతం ఆదాయాలను పొందుతున్న ఈ కంపెనీ 2035 కల్లా నికర సున్నా కర్బన కంపెనీగా మారాలని గతేడాది లక్ష్యంగా పెట్టుకుంది.

* నాలుగు గిగా ఫ్యాక్టరీలను వచ్చే మూడేళ్లలో ఏర్పాటు చేసేందుకు రూ.60,000 కోట్లు.. ఆ ఫ్యాక్టరీలకు మౌలిక వసతుల కోసం  రూ.15,000 కోట్ల (మొత్తం రూ.75,000 కోట్లు)  పెట్టుబడులను మూడేళ్లలోనే పెట్టనున్నారు. ఇప్పటికే జామ్‌నగర్‌లో 5000 ఎకరాల్లో ధీరూభాయ్‌ అంబానీ గ్రీన్‌ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేసే పనులు మొదలయ్యాయి.


100 కోట్ల మందికి శరవేగంగా డేటా: సుందర్‌ పిచాయ్‌

‘గూగుల్‌ క్లౌడ్‌, జియోల మధ్య కుదిరిన 5జీ భాగస్వామ్యంతో, వంద కోట్ల మందికి పైగా భారతీయులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ చేరువవడంతో పాటు వ్యాపారాల డిజిటలీకరణకు  వీలవుతుంది. తదుపరి దశ డిజిటైజేషన్‌లోకి భారత్‌ మారడానికి ఇది పునాది వేస్తుంద’ని పిచాయ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతేడాది జియో ప్లాట్‌ఫామ్స్‌లో గూగుల్‌ రూ.33,737 కోట్ల పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. గూగుల్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం.. రిలయన్స్‌ రిటైల్‌ వ్యాపారాల్లో గూగుల్‌ క్లౌడ్‌ మౌలిక వసతులను వినియోగిస్తారు.


కొవిడ్‌పై పోరులో ముందున్నాం: నీతా అంబానీ

కొవిడ్‌-19 సంక్షోభ సమయంలో ఉద్యోగుల వేతనాలు, బోనస్‌లు లేదా ఏ ఇతర పరిహారాల్లో ఆర్‌ఐఎల్‌ కోత విధించలేదని రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ పేర్కొన్నారు. కొవిడ్‌-19 సంక్షోభం మానవత్వానికి పరీక్షగా నిలిచిందని.. ఈ కష్టకాలంలో స్ఫూర్తిదాయకంగా వ్యవహరించి, తామందరం కలిసికట్టుగా పోరాడమని ఏజీఎంలో ఆమె వెల్లడించారు. కొవిడ్‌పై భారత్‌ చేసిన పోరులో రిలయన్స్‌ తోడ్పాటును ఆమె వివరించారు. కొరత రాగానే మెడికల్‌ గ్రేడ్‌ లిక్విడ్‌ ఆక్సిజన్‌ను రిలయన్స్‌ భారీగా ఉత్పత్తి చేసి, ఆసుపత్రులకు సరఫరా చేసినట్లు గుర్తు చేశారు. కంపెనీలో ఇప్పటివరకు చేయకున్నా, అవసరమైన రోజుల వ్యవధిలోనే జామ్‌నగర్‌ రిఫైనరీలో ఉత్పత్తి చేయగలిగినట్లు తెలిపారు. రెండువారాల్లోనే రోజుకు 1100 మెట్రిక్‌ టన్నుల మేర ఉత్పత్తి పెంచినట్లు వెల్లడించారు. 20 లక్షల మంది ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు టీకాలు అందించనున్నట్లు స్పష్టం చేశారు. జియో ఇన్‌స్టిట్యూట్‌ విద్యా కోర్సులు ఈ ఏడాది ప్రారంభమవుతాయని చెప్పారు.


 Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని