మొండి బాకీల్లో వసూలయ్యేది ఎంత?
close

Published : 07/07/2021 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మొండి బాకీల్లో వసూలయ్యేది ఎంత?

90 శాతానికి పైగా ‘హెయిర్‌కట్‌’ తప్పని పరిస్థితి
బ్యాంకులకు భారీగా నష్టం  
‘ఐబీసీ’ కింద కేసుల పరిష్కారం తీరుతెన్నులు

దివాలా పరిష్కార స్మృతి (ఐబీసీ- ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్ట్సీ కోడ్‌)ని అయిదేళ్ల కింద కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. అప్పులు తీసుకుని, తిరిగి చెల్లించని వ్యాపార సంస్థల నుంచి ఎంతో కొంత మొత్తాన్ని వసూలు చేయడం, రుణాలు ఎగవేసిన సంస్థలను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నవారికి అప్పగించడం, తద్వారా బ్యాంకులకు మొండి బాకీల భారాన్ని తగ్గించడం.. ఈ స్మృతి ప్రధానోద్దేశం.

దీని కింద దేశవ్యాప్తంగా ఎన్‌సీఎల్‌టీ (జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌) బెంచ్‌లు ఏర్పాటయ్యాయి. ఈ అయిదేళ్ల అనుభవాలను పరిశీలిస్తే వివిధ వ్యాపార సంస్థల నుంచి బ్యాంకులకు దివాలా పరిష్కారం కింద రావలసిన బకాయిల్లో 98 శాతం వరకు వదులుకోవాల్సి వచ్చినట్లు ‘రెడ్‌  ఇంటెలిజెన్స్‌’ అనే అంతర్జాతీయ పరిశోధనా సేవల సంస్థ వెల్లడించింది. ఐబీసీ కింద దాదాపు 4,300 కంపెనీల కేసులను ఎన్‌సీఎల్‌టీ పరిష్కరించినట్లు, ఇందులో 48 శాతం కంపెనీలు ‘లిక్విడేషన్‌’ బాట పట్టినట్లు పేర్కొంది. ఒక ఏడాది వ్యవధిలోనే ఎన్నో కేసులు పరిష్కారమైనట్లు వివరించింది. మంచి వ్యాపార ఆస్తులు, స్థిరాస్తులు ఉన్న కంపెనీలను ఎన్‌సీఎల్‌టీ ద్వారా చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియలో కొనుగోలు చేసేందుకు వివిధ సంస్థలతో పాటు వ్యాపారవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. కానీ ఆందోళనకర విషయం ఏమిటంటే.. ఆయా సంస్థలు చెల్లించాల్సిన అప్పుల్లో 90 నుంచి 95 శాతానికి పైగా హెయిర్‌కట్‌ (కోత) అడుగుతూ ఉండటం గమనార్హం. దివాలా ప్రక్రియ ముంగిట నిలిచిన కంపెనీలను, పెద్దపెద్ద వ్యాపార సంస్థలు కూడా అత్యంత చౌకగా.. నామమాత్రపు ధరకు సొంతం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ధోరణి ప్రధానంగా బ్యాంకులను నష్టం చేస్తోంది. చేసేది లేక బ్యాంకులు ఎంత వస్తే, అంత తీసుకోవటానికి అధిక సందర్భాల్లో సిద్ధపడక తప్పడం లేదు.

ఎన్నో ఉదాహరణలు

బ్యాంకులు తమకు రావలసిన మొత్తాల్లో సింహ భాగాన్ని వదులుకుని, నామమాత్రపు సొమ్ముతో సరిపెట్టుకుంటున్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌, శివ ఇండస్ట్రీస్‌ అండ్‌ హోల్డింగ్స్‌, రుచి సోయా, జెట్‌ ఎయిర్‌వేస్‌.. వంటివి ఇలా.

వీడియోకాన్‌ గ్రూప్‌ను దానికి ఉన్న అప్పుల్లో నూటికి 4 పైసలు మాత్రమే ఇచ్చి సొంతం చేసుకోడానికి వేదాంతా గ్రూపు ముందుకు వచ్చింది.

శివ ఇండస్ట్రీస్‌ అండ్‌ హోల్డింగ్స్‌కు బ్యాంకులు ఇచ్చిన అప్పులు, దానిపై వడ్డీ మొత్తం కలిసి.. రూ.5,000 కోట్లు ఉండగా, అందులో 93.5 శాతం తగ్గిస్తే కానీ ఆ కంపెనీని తీసుకోడానికి కొనుగోలుదార్లు సిద్ధం కాలేదు.

జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలా పరిష్కార వ్యవహారం కూడా ఇలాంటిదే. ఈ కంపెనీ నుంచి బ్యాంకులు తమకు రావలసిన సొమ్ములో 90 శాతానికి పైగా వదులుకోవాల్సి వస్తోంది.

ప్రభుత్వ బ్యాంకులకు ఎక్కువ కష్టం

ఈ పరిస్థితి బ్యాంకులను కుంగదీస్తోందనటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు అధికంగా నష్టపోతున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకులు ప్రధానంగా ‘రిటైల్‌ క్రెడిట్‌’ మీద దృష్టి సారించి, టెర్మ్‌ రుణాలు, వర్కింగ్‌ కేపిటల్‌ రుణాలు తక్కువగా ఇస్తున్నాయి. టెర్మ్‌ రుణాలు అధికంగా ఇచ్చే ప్రభుత్వ బ్యాంకుల మీదే మొండిబాకీల భారం అధికంగా ఉంది. దేశంలోని రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు గత రెండు మూడేళ్లుగా మొండిబాకీల భారంతో సతమతం అవుతోంది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలకు కూడా మొండిబాకీల భారం అధికంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో కొత్తగా రుణాలు జారీ చేసేందుకు బ్యాంకులు వెనకాడే పరిస్థితి ఏర్పడింది.

మార్పులు అవసరం  

దివాలా స్మృతిని సమర్థించే వారు లేకపోలేదు. బ్యాంకులు మొండి బకాయిల సమస్యను ఎంతోకొంత మేరకు పరిష్కరించుకోడానికి ఈ ప్రక్రియ దోహదపడుతున్నట్లు, అదేవిధంగా రుణగ్రస్తులు కూడా అప్పుల పాలైన తమ సంస్థలను సమర్థమైన యాజమాన్యాల చేతికి అప్పగించి బయటపడిపోయే సానుకూలత ఏర్పడుతున్నట్లు సంబంధిత వర్గాలు కొన్ని పేర్కొంటున్నాయి. ఇటువంటి ఏర్పాటు లేని పక్షంలో ఎప్పటికీ మొండి బకాయిల ఖాతాలు పరిష్కారం కావని, అవి బ్యాంకులకు తలనొప్పిగా మారతాయని వివరిస్తున్నారు. కాకపోతే గత అయిదేళ్ల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఐబీసీలో అవసరమైన మార్పులు, ఎన్‌సీఎల్‌టీ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తద్వారా మెరుగైన ఫలితాలు రావచ్చని అంటున్నాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని