రూ.75 లక్షల కోట్లకు స్థిరాస్తి విపణి
close

Updated : 22/07/2021 16:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.75 లక్షల కోట్లకు స్థిరాస్తి విపణి

2030కు చేరొచ్చు - గృహ కార్యదర్శి దుర్గాశంకర్‌

దిల్లీ: భారత స్థిరాస్తి విపణి 2030 నాటికి లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ.75 లక్షల కోట్ల)కు చేరొచ్చని గృహ, పట్టణ వ్యవహారాల కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా వెల్లడించారు. గిరాకీ పెరగడం, గత ఏడేళ్లలో కొత్తగా తీసుకొచ్చిన రెరా చట్టం వంటి సంస్కరణలు ఇందుకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో ఉపాధి పొందే వారి సంఖ్య 2019లో 5.5 కోట్లుగా ఉండగా.. రాబోయే సంవత్సరాల్లో 7 కోట్లకు పెరగొచ్చని అంచనా వేశారు. స్థిరాస్తి రంగంపై సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జూన్‌లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కిరాయిదారుల చట్టాన్ని త్వరగా అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలను కోరినట్లు వెల్లడించారు. కొత్త చట్టాన్ని రాష్ట్రాలు అమలు చేసినప్పటికీ.. ఇప్పటివరకు అద్దె ఒప్పందాలకు సంబంధించిన అన్ని వివాదాలు రాష్ట్రాల పాత చట్టాలకు లోబడే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కొవిడ్‌-19 మొదటి, రెండో దశ ఉద్ధృతి వల్ల స్థిరాస్తి రంగం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొందని, అయితే గృహాలకు గిరాకీ మళ్లీ పుంజుకుందని మిశ్రా పేర్కొన్నారు. ‘2-3 ఏళ్లక్రితం కింద దేశీయ స్థిరాస్తి రంగ విపణి విలువ 200 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.15 లక్షల కోట్లు)గా ఉంది. 2030కి ఇది లక్ష కోట్ల డాలర్లకు చేరొచ్చు. వచ్చే 7-8 ఏళ్లలో ఇది సాధ్యపడుతుందని ప్రస్తుత ధోరణులు స్పష్టం చేస్తున్నాయి’ అని అన్నారు. 

సిమెంట్, ఉక్కు సహా 270 ఇతర పరిశ్రమలకు స్థిరాస్తి రంగం గిరాకీ సృష్టిస్తోందని, భారత ఆర్థిక వ్యవస్థలో ఇది చాలా కీలక రంగంగా మారిందనడంలో సందేహం లేదని మిశ్రా తెలిపారు. గత ఏడేళ్లుగా స్థిరాస్తి రంగంపై ప్రభుత్వం చాలా దృష్టి పెట్టిందని, ప్రతి బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు చేపట్టినట్లు వివరించారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో 46 కోట్ల మంది నివసిస్తుంటే.. 2051కి ఈ సంఖ్య 88 కోట్లకు చేరొచ్చని, స్థిరాస్తి రంగ అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. రెరా చట్ట అమలుతో వినియోగదారులకు తమ పెట్టుబడులు సురక్షితం అన్న ధీమా పెరిగిందన్నారు. 


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని