జొమాటో @ 1,00,000 కోట్లు
close

Updated : 24/07/2021 04:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జొమాటో @ 1,00,000 కోట్లు

తొలి రోజే రికార్డు మైలురాయికి మార్కెట్‌ విలువ
మదుపర్లకు 66% ప్రతిఫలం

జొమాటో.. జొమాటో పబ్లిక్‌ ఇష్యూకు వస్తున్నామని కంపెనీ వెల్లడించినప్పటి నుంచి.. శుక్రవారం ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యే వరకు ఓ మంత్రంలా మార్కెట్‌ వర్గాలు ఈ పేరును జపించాయి.. మదుపర్లూ అంతే ఆసక్తి కనబరుస్తూ వచ్చారు.. పుష్కరకాలం క్రితం ఆవిర్భవించిన ఒక ఇంటర్నెట్‌  ఆధారిత కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు ఇంతటి ఆదరణ లభించడం విశ్లేషకులనే ఆశ్చర్యచకితులను చేసింది.. మదుపర్ల అంచనాలకు తగ్గట్లుగానే పబ్లిక్‌ ఇష్యూ హిట్‌ అయ్యింది. షేర్లు నమోదైన తొలిరోజే 66% ప్రతిఫలాన్ని పంచడమే కాక, కంపెనీ మార్కెట్‌ విలువ రూ.లక్ష కోట్ల మైలురాయిని తాకింది.

ఆన్‌లైన్‌లో ఆర్డరిస్తే ఆహార పదార్థాలను ఇంటికి సరఫరా చేసినట్లుగానే.. మదుపర్లు ఆర్డరిచ్చిన షేర్లపై ఒక్క రోజులోనే 66 శాతం ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టింది జొమాటో. ఇష్యూ ధరైన రూ.76కు 51.31 శాతం అధికంగా రూ.115 వద్ద షేర్లు బీఎస్‌ఈలో నమోదయ్యాయి. ఆ తర్వాత 81.57 శాతం రాణించి, రూ.138.90ని తాకింది. ఫలితంగా కంపెనీ మార్కెట్‌ విలువ రూ.లక్ష కోట్లను మించింది. చివరకు 65.59% లాభంతో రూ.125.85 వద్ద ముగియడంతో, మార్కెట్‌ విలువ రూ.98,731.59 కోట్లుగా నమోదైంది. ఎన్‌ఎస్‌ఈలోనూ షేర్లు 52.63 శాతం అధికంగా రూ.116 వద్ద నమోదయ్యాయి. చివరకు 64.86% లాభంతో 125.30 వద్ద ముగిశాయి. బీఎస్‌ఈలో 451.71 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 69.48 కోట్ల షేర్లు చేతులు మారాయి.

సగానికి పైగా పెట్టుబడి.. లాభంగా..: జొమాటో పబ్లిక్‌ ఇష్యూలో ఒక లాట్‌కు 195 షేర్లను నిర్ణయించారు. ఒక లాట్‌కు  పెట్టుబడి రూ.14,820 అవుతుంది. బీఎస్‌ఈలో నమోదు ధర ప్రకారం ఈ పెట్టుబడి విలువ రూ.22,425కి పెరిగింది. అంటే రూ.7,605 లాభం వచ్చింది. ముగింపు ధర ప్రకారం పెట్టుబడి విలువ రూ.24,540కి పెరిగింది.. లాభం రూ.9,720. అంటే మదుపర్లు పెట్టిన పెట్టుబడిలో తొలిరోజే సగానికి పైగా లాభం లభించింది.

మాకు ఇదో గొప్ప రోజు: గోయల్‌

స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదైన రోజే జొమాటో షేర్లు అద్భుత ప్రదర్శన కనబర్చడం వల్ల, కంపెనీకి ఇదో గొప్ప రోజు అని జొమాటో వ్యవస్థాప కుడు, సీఈఓ దీపిందర్‌ గోయల్‌ అన్నారు. సున్నా నుంచి మొదలైన కొత్త రోజుగా ఆయన చెప్పారు. భారతీయ ఇంటర్నెట్‌ వ్యవస్థ అసాధారణ కృషి లేకుంటే తమకు ఇది సాధ్యమయ్యేదే కాదని తెలిపారు. అపార అవకాశాలు లభిస్తాయని తాను గట్టిగా విశ్వసిస్తున్నానని గోయల్‌ పేర్కొన్నారు. ‘భారత్‌లో ఈ తరహా కార్యాకలాపాలు నిర్వహించడం కష్టమైన పనే. అయితే ఒక్కసారి విజయవంతం అయితే మళ్లీ వెనక్కి తిరిగి చూసుకునే పనుండద’ని వివరించారు. జొమాటో పదేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటూ ఇక్కడ వరకు వచ్చామని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి సేవలను వినియోగదార్లకు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని