రెండు దశల్లో ఎల్‌ఐసీ ఐపీఓ!
close

Published : 25/07/2021 06:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండు దశల్లో ఎల్‌ఐసీ ఐపీఓ!

తొలివిడతలో 5-6 శాతం వాటా విక్రయం

ప్రైవేటు సంస్థలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకే

త్వరలోనే పబ్లిక్‌ ఇష్యూకి (ఐపీఓ) రానున్న భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)లో ఒకేసారి 10శాతం వాటా కాకుండా.. రెండు దశల్లో పెట్టుబడిని ఉపసంహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ సంస్థల నుంచి రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో ఎల్‌ఐసీ ఐపీఓ ఎంతో కీలకం. అయితే, ఎల్‌ఐసీ విలువ రూ.12-15 లక్షల కోట్ల మేరకు ఉంది.ముందే అనుకున్నట్లు 10 శాతం వాటాను విక్రయించేందుకు షేర్లను జారీ చేస్తే.. దాదాపు రూ.1.2-1.5 లక్షల కోట్ల మేరకు ఉంటుంది. ఇంత మొత్తాన్ని ఒకేసారి సమీకరిస్తే.. పబ్లిక్‌ ఇష్యూకి రావాలనుకున్న ఇతర ప్రైవేటు సంస్థలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తాజాగా అంకుర సంస్థ జొమాటో దాదాపు రూ.9,375 కోట్ల ఐపీఓకి వచ్చింది. దీనికి 40 రెట్లకు పైగా స్పందన రావడంతోపాటు.. తొలి రోజే మార్కెట్లో దూకుడుగా నమోదైంది. గత ఏడాది నుంచి షేరు మార్కెట్‌ పనితీరు బాగుండటంతో పేటీఎం, పాలసీబజార్‌, మొబిక్విక్‌, ఫ్లిప్‌కార్ట్‌, నైకా వంటి సంస్థలూ ఐపీఓకి సన్నాహాలు చేసుకుంటున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్‌ఐసీ ఐపీఓకి వస్తే.. భారీ స్పందన కచ్చితంగా ఉంటుంది. సంస్థాగత మదుపరులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ప్రజల్లోనూ ఈ సంస్థపై విశ్వాసం ఎక్కువే. ఐపీఓకి దరఖాస్తు చేయడం కోసం మార్కెట్లో ఇతర కంపెనీల షేర్లలో ఉన్న డబ్బు ఉపసంహరించుకుని, ఎల్‌ఐసీ ఇష్యూకు దరఖాస్తుకు కేటాయించే అవకాశాలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఐపీఓకి రావాలనుకున్న సంస్థలకు.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న కొన్ని చిన్న సంస్థల షేర్లకూ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీన్ని నివారించేందుకు తొలుత ఎల్‌ఐసీలో 5-6శాతం వాటాను మాత్రమే మార్కెట్లో నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు మరోదశ పబ్లిక్‌ ఇష్యూకి (ఫాలోఆన్‌) రావడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని చెబుతున్నాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలోనే
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంటులో ఈ ఆర్థిక సంవత్సరంలోనే  ఎల్‌ఐసీ ఐపీఓ పూర్తవుతుందని చెప్పారు. అందువల్ల ఎల్‌ఐసీని మార్కెట్లో నమోదు చేసేందుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోందనే భావించాలని మార్కెట్‌ వర్గాల అంచనా. సెబీ ఇటీవలే జారీ చేసిన నిబంధనల ప్రకారం.. రూ.లక్ష కోట్ల విలువకు మించిన కంపెనీలు రెండేళ్లలో 10శాతం మేరకు, ఆ తర్వాత అయిదేళ్లలో 25శాతం వరకూ స్టాక్‌ మార్కెట్లో షేర్లను జారీ చేయాలి. ఈ నిబంధనలన్నీ ఎల్‌ఐసీకి అనుకూలంగానే ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని