53,130 ఎగువన లాభాలు!
close

Published : 26/07/2021 02:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

53,130 ఎగువన లాభాలు!

సమీక్ష: అంతర్జాతీయంగా కొవిడ్‌-19 కేసులు మళ్లీ పెరగడం, అమెరికా వృద్ధిపై భయాలతో గత వారం మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. వారం ప్రారంభంలో లాభాల స్వీకరణ ఎదురైనప్పటికీ.. అనంతరం అమెరికా, ఐరోపా మార్కెట్ల రికవరీతో మార్కెట్‌ సెంటిమెంట్‌ మెరుగుపడింది. కంపెనీలు మెరుగైన త్రైమాసిక ఫలితాలు ప్రకటించడం, ఐటీ సంస్థల సానుకూల వ్యాఖ్యలు సైతం కలిసొచ్చాయి.  చమురు ధరలు మళ్లీ పుంజుకున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 74.4 వద్ద ముగిసింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 0.3 శాతం నష్టంతో 52,976 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 0.45 శాతం తగ్గి 15,856 పాయింట్ల దగ్గర స్థిరపడింది. బ్యాంకింగ్‌, విద్యుత్‌, వాహన షేర్లు నీరసపడ్డాయి. ఐటీ, స్థిరాస్తి, ఎఫ్‌ఎమ్‌సీజీ స్క్రిప్‌లు రాణించాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.5445 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.5,051 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. 

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 9:10గా నమోదు కావడం..

కొన్ని పెద్ద షేర్లలో లాభాల స్వీకరణను సూచిస్తోంది.

ఈవారంపై అంచనా: వరుసగా ఏడో వారం 51,600- 53,000 పాయింట్ల శ్రేణిలో స్థిరీకరణ కొనసాగడంతో సెన్సెక్స్‌ స్వల్పంగా నష్టపోయింది. ఈ శ్రేణి నుంచి బయటపడితేనే.. స్వల్పకాలంలో సరైన సంకేతాలు లభిస్తాయి. 51,130 పాయింట్ల ఎగువన ముగిస్తే.. మరిన్ని లాభాలకు అవకాశం ఉంటుంది.

ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే సంకేతాల అనుగుణంగా దేశీయ సూచీలు కదలాడొచ్చు. జులై డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ఒడుదొడుకులకు ఆస్కారం ఉంది. కంపెనీల ఫలితాల ప్రకటనలతో షేరు ఆధారిత కదలికలు చోటుచేసుకోవచ్చు. డెల్టా కేసుల వ్యాప్తి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, రుతుపవనాల పురోగతి వార్తలపై మదుపర్లు దృష్టి పెట్టొచ్చు. పార్లమెంట్‌ వర్షకాల సమావేశాల నుంచి వచ్చే సంకేతాలు సైతం కీలకం కానున్నాయి. దేశీయంగా చూస్తే మౌలిక రంగం, ద్రవ్య లోటు, బ్యాంక్‌ రుణాల వృద్ధి గణాంకాలపై ఓ కన్నేయొచ్చు. ఈ వారం యాక్సిస్‌ బ్యాంక్‌, డీఎల్‌ఎఫ్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, టాటా మోటార్స్‌, వేదాంతా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, నెస్లే, కంటైనర్‌ కార్పొరేషన్‌, ఇండస్‌ టవర్స్‌, టెక్‌ మహీంద్రా, ఇండియన్‌ ఆయిల్‌, సన్‌ఫార్మా, మారికో వంటి కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి. కార్పొరేట్‌ ప్రకటనలు, ఏజీఎంల్లో కంపెనీల వ్యాఖ్యలు ప్రభావం చూపనున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా దిగ్గజ కంపెనీల ఫలితాలు ప్రకటించనున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వు సమావేశాలపై దృష్టి పెట్టొచ్చు. చైనా పారిశ్రామిక లాభం, జపాన్‌ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, ముడిచమురు ధరలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడుల నుంచి కూడా సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. 

తక్షణ మద్దతు స్థాయులు: 52,465, 52,000, 51,450
తక్షణ నిరోధ స్థాయులు: 53,450, 54,050, 54,600
సెన్సెక్స్‌ 53130 ఎగువన ముగిస్తే మరింత లాభపడొచ్చు.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని