ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌దారులకు భరోసా
close

Updated : 29/07/2021 09:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌దారులకు భరోసా

రూ.5 లక్షల వరకు బీమాః బ్యాంకు మారటోరియంకు వెళ్లిన 90 రోజుల్లోపు చెల్లింపు

డీఐసీజీసీ చట్ట సవరణకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం

ఈనాడు - హైదరాబాద్‌

దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులు, విదేశీ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసే ఖాతాదారులకు భరోసా లభించనుంది. ఇప్పటివరకు లైసెన్సులు రద్దయి, బ్యాంకు లిక్విడేషన్‌లోకి వెళ్లినప్పుడే లభించే బీమా రక్షణ.. ఇక నుంచి మారటోరియం విధించిన బ్యాంకులకూ వర్తించనుంది. ఈ మేరకు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) 1961 చట్ట సవరణకు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. గత ఏడాది వరకు రూ.లక్షగా ఉన్న డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ మొత్తాన్ని 2020లో రూ.5లక్షలకు పెంచారు. అయితే, ఇది బ్యాంకులు పూర్తిగా లిక్విడేషన్‌ ప్రక్రియలోకి వెళ్లినప్పుడే వర్తిస్తుంది. ఇటీవల పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ (పీఎంసీ), యెస్‌ బ్యాంక్‌, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌లాంటివి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో వీటిపై ఆర్‌బీఐ పాక్షికంగా మారటోరియం విధించడంతో డిపాజిట్‌దారులు తీవ్ర ఆందోళన చెందారు. తాజా నిర్ణయంతో ఇలాంటి సందర్భాల్లోనూ భరోసా లభిస్తుంది. 

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) యాజమాన్యంలో పనిచేసే డీఐసీజీసీ. అన్ని వాణిజ్య, ఇక్కడ శాఖలున్న విదేశీ బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, కరెంట్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లలో ఉన్న మొత్తాలకు ఈ సంస్థ బీమా రక్షణ కల్పిస్తుంది. ఈ డిపాజిట్ల అసలు, వడ్డీ రూ.5లక్షల లోపు ఉన్నప్పుడు దీని కింద డిపాజిట్‌దారుడికి ఆ మొత్తం పరిహారంగా చెల్లిస్తారు. అంటే ఏదేని బ్యాంకుకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తి, మారటోరియంలోకి వెళ్లినా.. రూ.5లక్షల లోపు డిపాజిట్లు ఉన్నవారికి ఏ ఇబ్బందీ ఉండదు.

45 రోజుల్లోగా వివరాల సేకరణ

బ్యాంకుపై ఆర్‌బీఐ మారటోరియం విధించిన 45 రోజుల్లోగా అన్ని డిపాజిట్ల వివరాలూ సేకరించి, క్లెయింకి అర్హత పొందిన వాటిని గుర్తించాలి. ఆ తర్వాత అదంతా డీఐసీజీసీ పరిధిలోకి వెళ్తుంది. అక్కడి నుంచి 45 రోజుల్లోగా రూ.5 లక్షలలోపు డిపాజిట్‌ ఉన్నవారిని గుర్తించి, వారికి చెల్లింపులు చేయాల్సిన బాధ్యత కార్పొరేషన్‌దే. అంటే మొత్తం 90 రోజుల్లో డిపాజిట్‌దారులకు చెల్లింపులు పూర్తి కావాలి. ఇప్పటివరకు ఈ ప్రక్రియ పూర్తికి 8-10 ఏళ్లు పట్టేది. ఈ నిర్ణయం వల్ల బ్యాంకు ప్రస్తుత ఖాతాదారుల్లో 98.3 శాతం, డిపాజిట్ల విలువలో 50.9 శాతానికి పైగానే ఈ చట్ట పరిధిలోకి వస్తాయని మంత్రి తెలిపారు. ఇప్పటికే మారటోరియం విధించిన బ్యాంకులకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నారు.

ఇప్పటి వరకు బ్యాంకులు ఈ డిపాజిట్‌ బీమా కోసం ప్రతి రూ.100 డిపాజిట్‌పై ప్రీమియంగా 10 పైసలు చెల్లించేవి. ఇక నుంచి ఇది 12పైసలు కానుంది. ఇది 15 పైసలకు మించకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నట్లు ఆర్థికమంత్రి వెల్లడించారు.Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని