కాగ్నిజెంట్‌లో 1.30లక్షల ఉద్యోగాలు
close

Published : 30/07/2021 04:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాగ్నిజెంట్‌లో 1.30లక్షల ఉద్యోగాలు

ఈ ఏడాదిలోనే లక్ష మంది అనుభవజ్ఞులకు..

మరో 30,000 మంది ఫ్రెషర్లకు కూడా

2022 కోసం 45,000 ఆఫర్లు

జూన్‌ త్రైమాసికంలో 512 మిలియన్‌ డాలర్ల లాభం

దిల్లీ: బహుళజాతి ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు, అనుభవజ్ఞులకు శుభవార్త అందించింది. ఈ ఏడాది ఏకంగా లక్ష మంది అనుభవజ్ఞులను నియమించుకుంటామని తెలిపింది. మరో 30,000 మంది తాజా గ్రాడ్యుయేట్లకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. అలాగే 2022లో ఉద్యోగంలో చేరేలా 45,000 మంది ఫ్రెషర్లకు ఈ ఏడాదే ఆఫర్‌ లెటర్లు భారత్‌లో ఇస్తామని వెల్లడించింది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ జూన్‌ త్రైమాసికంలో 512 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3,800 కోట్లు) నికర లాభాన్ని నమోదు చేసింది. 2020 ఇదే త్రైమాసికంలో ఆర్జించిన 361 మి.డాలర్ల నికర లాభంతో పోలిస్తే ఇది 41.8 శాతం ఎక్కువ. కంపెనీ ఆదాయం 400 కోట్ల డాలర్ల నుంచి 14.6 శాతం వృద్ధి చెంది 460 కోట్ల డాలర్లకు చేరింది. సమీక్షా త్రైమాసికానికి ఆదాయ వృద్ధి అంచనాల (10.5-11.5 శాతం)ను మించి కంపెనీ నమోదు చేసింది. భారత్‌లో కాగ్నిజెంట్‌కు 2 లక్షల మంది ఉద్యోగులున్నారు. జనవరి-డిసెంబరు కాలాన్ని కంపెనీ ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. ‘జూన్‌ త్రైమాసికాన్ని బలమైన ఆర్థిక ఫలితాలతో ముగించాం. లక్ష్యిత పెట్టుబడులు, వేగంగా వృద్ధి చెందుతున్న విపణుల్లోకి మా పోర్ట్‌ఫోలియోను మార్చుకోవడంతో ఇది సాధ్యమైంది. అలాగే మా సామర్థ్యం పెంచుకోవడం ద్వారా భాగస్వాములు, క్లయింట్లకు ఆధునిక వ్యాపారాల్ని నిర్మించుకునేందుకు సాయం చేయగలిగాం. ఇది భవిష్యత్‌లోనూ ఇలాగే కొనసాగే అవకాశం ఉంద’ని కాగ్నిజెంట్‌ సీఈఓ బ్రియాన్‌ హంఫ్రీస్‌ వెల్లడించారు.

* జులై-సెప్టెంబరు త్రైమాసికంలో 4.69-4.74 బి.డాలర్ల ఆదాయం (10.6-11.6 శాతం వృద్ధి) ఆర్జించొచ్చని కంపెనీ అంచనాలు ప్రకటించింది.

* 2021 పూర్తి ఏడాదికి ఆదాయం 18.4-18.5 బి.డాలర్లు నమోదు కావొచ్చని, 2020తో పోలిస్తే ఇది 10.2-11.2 శాతం అధికమని పేర్కొంది. గతంలో అంచనా వేసిన 17.8-18.1 బి.డాలర్లతో (7-9 శాతం) పోలిస్తే ఇది అధికం.

* కంపెనీలో వలసల రేటు జూన్‌ త్రైమాసికంలో 29 శాతానికి చేరింది. 12 నెలల కాలానికి ఇది 18 శాతంగా నమోదైంది. సంస్థ మొత్తంగా చూస్తే జూనియర్‌ స్థాయి ఉద్యోగుల్లో, భారత్‌లో చూస్తే మధ్య స్థాయి ఉద్యోగుల్లో వలసల శాతం అధిక ఉంది. దీన్ని కట్టడి చేసేందుకు వేతన పెంపు, పదోన్నతులు ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. అక్టోబరు 1 నుంచి వేతన పెంపు అమల్లోకి రానుందని పేర్కొంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని