ఐఓసీ లాభం మూడింతలు
close

Published : 31/07/2021 04:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐఓసీ లాభం మూడింతలు

ఏప్రిల్‌- జూన్‌లో  రూ.5,941.37 కోట్లు
గణీయంగా పెరిగిన స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌
నిల్వలపై లాభమూ కలిసొచ్చింది

దిల్లీ: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి స్టాండలోన్‌ పద్ధతిలో రూ.5,941.37 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.1,910.84 కోట్లతో పోలిస్తే ఈసారి మూడు రెట్లు పెరగడం గమనార్హం. గతేడాది దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఆంక్షలతో  గిరాకీ బాగా తగ్గింది. ఈ ఏడాది జనవరి- మార్చితో పోలిస్తే సమీక్షా త్రైమాసికంలో లాభం 32 శాతం క్షీణించింది. కొవిడ్‌-19 రెండో దశ పరిణామాలు ఇందుకు కారణమని కంపెనీ పేర్కొంది. ఏప్రిల్‌- జూన్‌లో ఒక బ్యారల్‌ ముడి చమురును ఇంధనంగా (స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌) మార్చడం ద్వారా 6.58 డాలర్ల లాభాన్ని ఆర్జించినట్లు ఫలితాలను వెల్లడిస్తూ ఐఓసీ ఛైర్మన్‌ శ్రీకాంత్‌ మాధవ్‌ విద్యా విలేకరులకు తెలిపారు. ఏడాది క్రితం ఒక్కో బ్యారల్‌పై 1.98 డాలర్ల నష్టాన్ని కంపెనీ చవిచూసింది.  స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌లో నిల్వలపై వచ్చిన లాభం కూడా కలిపి ఉందని ఐఓసీ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) సందీప్‌ గుప్తా తెలిపారు. ‘ముడి చమురును ఒక ధరకు కొన్నాక, దేశంలోకి దిగుమతి చేసుకుని, ఇంధనంగా మార్చే సమయానికి ధర పెరిగితే వచ్చేది నిల్వలపై లాభం’గా పరిగణిస్తారు. నిల్వలపై లాభాన్ని మినహాయిస్తే స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌ బ్యారల్‌కు 2.24 డాలర్లుగా నమోదైంది. కార్యకలాపాల ద్వారా ఆదాయం 74 శాతం వృద్ధితో రూ.1.55 లక్షల కోట్లకు చేరింది. దేశీయంగా మొత్తం రిఫైనింగ్‌ సామర్థ్యం 250 మిలియన్‌ టన్నులుండగా, ఇందులో మూడోవంతు వాటా ఐఓసీ, దాని అనుబంధ విభాగమైన చెన్నై పెట్రోలియమ్‌లదే.

కొవిడ్‌-19 ముందు స్థాయికి పెట్రోలు వినియోగం

‘పెట్రోలు వినియోగం జులై మొదటి వారంలో కొవిడ్‌-19 ముందు స్థాయికి చేరినా, డీజిల్‌ వినియోగం  88 శాతంగా ఉంది. కొవిడ్‌-19 మూడోదశ లేకుంటే, దీపావళి కల్లా డీజిల్‌ వినియోగం కూడా కొవిడ్‌-19 ముందు స్థాయికి చేరుతుంది. విమాన ఇంధన (ఏటీఎఫ్‌) వినియోగం ప్రస్తుతం 50 శాతంగా ఉందని, వచ్చే మార్చి కల్లా కొవిడ్‌ ముందు స్థాయికి చేరొచ్చ’ని శ్రీకాంత్‌ మాధవ్‌ విద్యా అన్నారు. వినియోగదారుల నుంచి గిరాకీ తక్కువగా ఉండటంతో ఏప్రిల్‌- జూన్‌లో రిఫైనరీలు 88.5 శాతం సామర్థ్యంతో పనిచేశాయని, ఈ నెలలో ఇది 90 శాతానికి పెరిగిందని తెలిపారు. పెట్రోలు అమ్మకాలు 32 శాతం వృద్ధితో 2.7 మిలియన్‌ టన్నులకు, డీజిల్‌ అమ్మకాలు 22 శాతం పెరిగి 7.8 మిలియన్‌ టన్నులకు చేరాయి. వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) అమ్మకాలు 1.8 శాతం తగ్గి 3 మిలియన్‌ టన్నులకు పరిమితమయ్యాయి.

మూలధన వ్యయాల కోసం రూ.28,500 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి (2022 మార్చి 31) మూలధన వ్యయం కింద రూ.28,500 కోట్లు ఖర్చు పెట్టాలని ఐఓసీ నిర్దేశించుకుంది. ఇందులో రూ.4,000 కోట్లను తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌- జూన్‌) వెచ్చించింది.

మలేసియా సంస్థ పెట్రోనాస్‌తో కలిసి సహజవాయువు, ఇంధన విక్రయాలు

సహజ వాయువు, రవాణా ఇంధనాల విక్రయ వ్యాపార నిమిత్తం మలేసియా సంస్థ పెట్రోనాస్‌తో ఐఓసీ జట్టు కట్టింది. ఎల్‌పీజీ దిగుమతుల కోసం ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోనస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఐపీపీఎల్‌) పేరుతో ఇరుసంస్థలకు 50:50 నిష్పత్తిలో ఓ సంయుక్త సంస్థ ఉంది. వాణిజ్య వినియోగదారులకే ఈ సంస్థ ఎల్‌పీజీ విక్రయిస్తుంటుంది. ఇప్పుడీ సంస్థ సహజవాయువు, రవాణా ఇంధనాల విక్రయ వ్యాపారాల్లోకి అడుగుపెడుతుందని ఐఓసీ ఛైర్మన్‌ తెలిపారు. పెట్రోలు పంపులను ఏర్పాటు చేయడంతో పాటు సిటీ గ్యాస్‌ పంపిణీ వ్యాపారాలను కూడా ఇది నిర్వహిస్తుందని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని