52000 దిగువకు వెళ్తే డీలా!
close

Published : 02/08/2021 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

52000 దిగువకు వెళ్తే డీలా!

సమీక్ష: ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో గతవారం మన మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. జులై డెరివేటివ్‌ కాంట్రాక్టులకు గడువు తీరిపోనుండటంతో సూచీలు ఒడుదొడుకుల మధ్య చలించాయి. అయితే ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి కంపెనీలు ప్రకటించిన ఫలితాలు ఆకర్షణీయంగా ఉండటంతో మార్కెట్లలో నష్టాలు పరిమితమయ్యాయి. మొత్తం మీద  గత వారం సెన్సెక్స్‌ 0.7 శాతం నష్టంతో 52,587 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 0.6 శాతం తగ్గి 15,763 పాయింట్ల దగ్గర స్థిరపడింది. విద్యుత్‌, చమురు-గ్యాస్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్లు డీలాపడ్డాయి. లోహ, వినియోగ వస్తువులు, ఐటీ రంగాల షేర్లు రాణించాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.10,825 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.8,206 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 5:4గా నమోదు కావడం.. పెద్ద షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకున్నప్పటికీ, కొన్ని చిన్న, మధ్య తరహా షేర్లలో కొనుగోళ్లు జరిగాయనడాన్ని సూచిస్తోంది.

ఈవారంపై అంచనా

వరుసగా ఎనిమిదో వారం 51,600- 53,300 పాయింట్ల శ్రేణిలో సెన్సెక్స్‌ స్థిరీకరణ అయ్యింది. 52000 పాయింట్ల కంటే దిగువకు వస్తేనే సూచీ మరింతగా దిద్దుబాటు అవుతుందని భావించవచ్చు. ఒకవేళ 53000 ఎగువన ముగిస్తే సమీపకాలంలో తిరిగి జీవనకాల గరిష్ఠాలను అందుకునే అవకాశం ఉంటుంది.

ప్రభావిత అంశాలు

ఈవారంలో జరిగే ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షపై మదుపర్లు ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈసారి కూడా వడ్డీ రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచొచ్చనే అంచనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధిని గాడిలో పెట్టేందుకు ఆర్‌బీఐ గవర్నరు ఎలాంటి నిర్ణయాలను ప్రకటిస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది. అలాగే జులై నెలకు వాహన కంపెనీలు మెరుగైన అమ్మకాలను నమోదు చేయడం సానుకూలతను తెచ్చిపెట్టవచ్చు. ఈవారంలో వెల్లడయ్యే కంపెనీల ఫలితాలకు అనుగుణంగా మార్కెట్‌ కదలికలు ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా చూస్తే.. ప్రపంచ మార్కెట్లు ఒడుదొడుకుల మధ్య కదలాడవచ్చు. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, ముడిచమురు ధరలు, ఎఫ్‌ఐఐల పెట్టుబడులపై మదుపర్లు దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. విదేశీ మదుపర్ల అమ్మకాలు ఇలాగే కొనసాగితే మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనపడొచ్చు.

తక్షణ మద్దతు స్థాయులు: 52000, 51450, 51000
తక్షణ నిరోధ స్థాయులు: 53103, 53550, 54050
సెన్సెక్స్‌ 52000 దిగువన ముగిస్తే ప్రతికూల ధోరణి కొనసాగొచ్చు.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని