ఫలితాలు.. వాహనాలు.. వ్యాఖ్యలు
close

Published : 02/08/2021 04:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫలితాలు.. వాహనాలు.. వ్యాఖ్యలు

 మార్కెట్‌కు దిశానిర్దేశం చేసేదివే

ఐటీ షేర్లకు సానుకూలతలు

విశ్లేషకుల అంచనాలు

స్టాక్‌ మార్కెట్‌

ఈ వారం

కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు, జులై నెల వాహన విక్రయ గణాంకాల కారణంగా ఈ వారం మార్కెట్లో ఎంపిక చేసిన షేర్లలో కదలికలు కనిపించొచ్చు. వరుసగా రెండో వారమూ నష్టాల పాలైన దేశీయ సూచీలు లాభాలందుకోవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. వాహన షేర్లు అధికంగా అమ్మకాలకు గురయ్యాయి కాబట్టి టాటా మోటార్స్‌, మారుతీ సుజుకీ, మదర్‌సన్‌ సుమీ, హీరో మోటోకార్ప్‌లు కాస్త పుంజుకునే అవకాశం ఉందని సాంకేతికత నిపుణులు అంటున్నారు. జులై విక్రయాల్లో రెండంకెల వృద్ధి కూడా కలిసిరావొచ్చు. నిఫ్టీ 15,550-15,950 శ్రేణిలో కదలాడవచ్చని బ్రోకరేజీల అంచనా. శుక్రవారం వెలువడే ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలనూ మదుపర్లు సునిశితంగా పరిశీలించవచ్చు.  వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

* ఐటీ షేర్లు సానుకూలంగా చలించవచ్చు. చాలా వరకు కంపెనీలు గిరాకీపై భారీ అంచనాలతో ఉండడమే ఇందుకు నేపథ్యం. ఈ రంగానికి సంబంధించి ఇప్పటికే జూన్‌ త్రైమాసిక ఫలితాలు ఎక్కువ భాగం వెలువడిన నేపథ్యంలో ఎంపిక చేసిన షేర్లలో కదలికలు ఉండవచ్చు.

* లోహ, గనుల కంపెనీలు సానుకూల ధోరణిలో ట్రేడింగ్‌ను కొనసాగించవచ్చు. ఉక్కు గిరాకీ పెరగవచ్చని యార్సెలర్‌ మిత్తల్‌ అంచనా వేయడం గమనార్హం. హిందాల్కో శుక్రవారం వెలువరించే ఫలితాలూ కీలకం కానున్నాయి.

* శుక్రవారం వెలువడ్డ బ్రిటానియా ఫలితాలు, మంగళవారం వచ్చే డాబర్‌ ఇండియా ఫలితాల నుంచి ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లకు సంకేతాలందుకోవచ్చు. 2021-22 (ఏప్రిల్‌-మార్చి) ఎఫ్‌ఎమ్‌సీజీ ఆదాయ వృద్ధి 5-6% నుంచి 10-12 శాతానికి చేరొచ్చని క్రిసిల్‌ అంచనా వేసింది.

* ఆస్తుల నాణ్యత, రుణ వృద్ధిపై కరోనా మలి దశ ప్రభావం చూపడంతో బ్యాంకు షేర్లు స్తబ్దుగా ఉండొచ్చు. బుధవారం ఫలితాలు వెల్లడించే ఎస్‌బీఐపై మదుపర్లు దృష్టి సారించవచ్చు.

* సైక్లికల్‌ షేర్లపై దృష్టి ఉండడంతో ఫార్మా షేర్లు పెద్దగా రాణించకపోవచ్చు. ఈ వారం ఫలితాలు వెల్లడించే సిప్లా, ఇప్కాలు వెలుగులోకి రావొచ్చు. ఫార్మా రంగంలో మరిన్ని ఐపీఓలు వచ్చే అవకాశం ఉంది. విండ్లాస్‌ బయోటెక్‌ ఈ వారం బిడ్‌లను ఆహ్వానం పలికిన విషయం తెలిసిందే.

* సిమెంటు కంపెనీల షేర్లు చాలా తక్కువ శ్రేణికి లోబడి కదలాడవచ్చు. వర్షాకాలం కారణంగా సమీప భవిష్యత్‌లో సిమెంటు ధరలు తగ్గే అవకాశం ఉండడం ప్రతికూలగా పనిచేయవచ్చు. సోమవారం ఓరియంట్‌ సిమెంట్‌ ఫలితాలను ప్రకటించనుంది.

* చమురు కంపెనీల షేర్లు స్థిరీకరణకు గురికావొచ్చు. హెచ్‌పీసీఎల్‌ బుధవారం ఫలితాలను వెల్లడించనుంది. శుక్రవారం మెరుగైన ఫలితాలను ప్రకటించిన ఐఓసీ షేర్లూ వెలుగులోకి రావొచ్చు.

* ఎంపిక చేసిన టెలికాం కంపెనీల్లో కదలికలు ఉండొచ్చు. భారతీ ఎయిర్‌టెల్‌(మంగళ), టాటా కమ్యూనికేషన్స్‌(బుధ)ల ఫలితాల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. భారతీ ఏకీకృత నికర లాభం 24.5% తగ్గి రూ.574 కోట్లకు చేరొచ్చని అంచనా. 

* వాహన కంపెనీల షేర్లు జులై నెల గణాంకాల ఆధారంగా చలించొచ్చు. చాలా వరకు సంస్థలు రెండంకెల వృద్ధిని నమోదు చేయడం సానుకూలాంశం.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని