రూ.300 కోట్లతో ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ విస్తరణ
close

Published : 03/08/2021 02:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.300 కోట్లతో ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ విస్తరణ

విశాఖపట్టణం వద్ద కొత్తగా గ్రైండింగ్‌ యూనిట్‌
మట్టంపల్లి యూనిట్లో రోలర్‌ మిల్లుల ఆధునికీకరణ
‘ఈనాడు’తో కంపెనీ ఎండీ కె.రవి
ఈనాడు - హైదరాబాద్‌

‘నాగార్జున’ బ్రాండు సిమెంటు విక్రయ సంస్థ అయిన ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ దాదాపు రూ.300 కోట్లతో విస్తరణ చేపట్టింది. ఇందులో భాగంగా కొత్తగా విశాఖపట్టణం వద్ద గ్రైండింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని, మట్టంపల్లి యూనిట్లో రోలర్‌ మిల్లుల ఆధునికీకరణ చేపట్టాలని నిర్ణయించింది. దీని కోసం రుణం తీసుకోవటంతో పాటు కొంతమేరకు సొంత నిధులు వెచ్చిస్తామని ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ కె.రవి ‘ఈనాడు’కు వెల్లడించారు. విశాఖపట్టణంలో గ్రైండింగ్‌ మిల్లు కోసం రూ.150 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని వివరించారు. ఈ యూనిట్‌ను విశాఖ దగ్గర్లోని అచ్యుతాపురం వద్ద నెలకొల్పనున్నామని, ఇప్పటికే స్థలాన్ని గుర్తించడంతో పాటు పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేశామని అన్నారు. అక్కడ స్టీలు ప్లాంటు నుంచి ఐరన్‌ స్లాగ్‌, ఎన్‌టీపీసీ యూనిట్‌ నుంచి ఫ్లైయాష్‌ లభించే సౌకర్యం ఉందని తెలిపారు. అందువల్ల ఇక్కడ స్లాగ్‌ సిమెంటు, ఫ్లైయాష్‌ సిమెంటు ఉత్పత్తి చేస్తామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా మట్టంపల్లిలోని తమ సిమెంటు యూనిట్‌లో ఉన్న పాత యంత్రాలను తొలగించి, వాటి స్థానంలో అత్యాధునిక వర్టికల్‌ రోలర్‌మిల్లులు, ప్యాకింగ్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే రెండేళ్ల వ్యవధిలో ఈ విస్తరణను పూర్తి చేయాలనేది తమ ఆలోచనగా వివరించారు. ఇప్పటికే మట్టంపల్లి యూనిట్లో రూ.100 కోట్లతో ‘వేస్ట్‌-హీట్‌-రికవరీ’ తో విద్యుదుత్పత్తి చేసే ప్లాంటును నెలకొల్పినట్లు వెల్లడించారు. దీనివల్ల తమ వ్యయాలు తగ్గి ఆదాయాలు పెరిగినట్లు చెప్పారు. ఇదేకాకుండా సౌర విద్యుత్తు ప్యానెళ్ల తయారీ యూనిట్‌ను 8 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నట్లు, భాగస్వామ్య పద్ధతిలో ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు వివరించారు.

జల విద్యుత్‌ నుంచి అధికాదాయం
ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ గత ఆర్థిక సంవత్సరంలో ఎంతో ఆకర్షణీయమైన పనితీరు కనబరచినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా కె.రవి వివరించారు. రూ.1,935 కోట్ల టర్నోవర్‌, రూ.147 కోట్ల నికరలాభాన్ని ఆర్జించినట్లు, కంపెనీ ఏర్పాటు చేసిన నాలుగు దశాబ్దాల్లో ఇదే అత్యధిక వార్షిక ఆదాయంగా ఆయన పేర్కొన్నారు. దీనివల్ల రుణభారాన్ని బాగా తగ్గించుకునే అవకాశం కూడా కంపెనీకి వచ్చిందని వెల్లడించారు. సిమెంటు ధర, అమ్మకాలు మెరుగ్గా ఉండటం దీనికి వీలు కల్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన విస్తరణ- ఆధునికీకరణ వల్ల వచ్చే రెండేళ్లలో ఆదాయాలు, లాభాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. తమ జల విద్యుత్తు యూనిట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో అధిక ఆదాయాన్ని నమోదు చేయగలవని తెలిపారు. రిజర్వాయర్లలో నిండుగా నీరు ఉండటం దీనికి వీలుకల్పిస్తుందన్నారు.

ఏపీ ప్రభుత్వం నుంచి రూ.1863 కోట్ల కాంట్రాక్టు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి రూ.1863 కోట్ల విలువైన భవన నిర్మాణ సామగ్రి సరఫరా కాంట్రాక్టులు ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ కన్సార్షియం దక్కించుకుంది. ఈ కన్సార్షియంలో ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌,  ఎన్‌సీఎల్‌ బిల్డ్‌టెక్‌ ఉన్నాయి. ఇందులో రూ.461 కోట్ల విలువైన స్టీలు డోర్‌ ఫ్రేముల కాంట్రాక్టు,  రూ.1403 కోట్ల విలువైన స్టీలు కిటికీల కాంట్రాక్టు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సారథ్యంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పథకానికి ఈ సామగ్రిని ఏడాది పాటు సరఫరా చేయాల్సి ఉంటుంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టులో ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ పాల్గొని, ఈ పనులు సొంతం చేసుకుంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని