నిఫ్టీ 16వ సహస్రంలోకి
close

Updated : 04/08/2021 06:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిఫ్టీ 16వ సహస్రంలోకి

 16 నెలల్లోనే రెట్టింపు స్థాయికి

సెన్సెక్స్‌కు 873 పాయింట్ల లాభం

 రూ.2.30 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద

ఆర్థిక వ్యవస్థ పురోగతిపై ఆశలతో కొనుగోళ్లు 

అదరగొట్టిన హెచ్‌డీఎఫ్‌సీ

3 ఏప్రిల్‌ 2020... 8083
3 ఆగస్టు 2021.. 16131

రిగ్గా 16 నెలల్లో నిఫ్టీ కదలాడిన తీరు ఇది. ఈ వ్యవధిలోనే మదుపర్లకు ఈ సూచీ రెట్టింపు ప్రతిఫలాన్ని పంచింది. కొవిడ్‌-19 తొలిదశ ప్రారంభంతో 2020 మార్చి చివరిలో తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన నిఫ్టీ, ఏప్రిల్‌లో 8000 పాయింట్లకు దిగివచ్చింది. అదే ఏడాది జూన్‌ నుంచి పుంజుకున్న సూచీ తిరిగి వెనక్కి చూసుకోకుండా చకచకా దూసుకెళ్లింది. ఒక్కో మైలురాయిని అధిగమించుకుంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో 15000 స్థాయినీ అందుకుంది. ఆ దశలో కొవిడ్‌-19 రెండో దశ పరిణామాలు చోటుచేసుకోవడంతో సూచీ జోరు కాస్త నెమ్మదించింది. ఆ ప్రభావం నుంచి శరవేగంగా కోలుకుని, మంగళవారం 16000 మైలురాయిని అందుకుంది. నిఫ్టీ 15000 నుంచి 16000 పాయింట్లను చేరడానికి  120 ట్రేడింగ్‌ రోజులు పట్టింది. మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 873 పాయింట్లు లాభపడటంతో, మదుపర్ల సంపదగా పేర్కొనే నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ   రూ.2.30 లక్షల కోట్లు అధికమై, తాజా జీవన కాల గరిష్ఠమైన రూ.2,40,04,664.28 కోట్లకు చేరింది.

ఆరంభం నుంచి దూకుడే 

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ మంగళవారం ఆరంభం నుంచే దూకుడు కనబర్చింది. ఉదయం సూచీ  15,951.55 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అప్పటినుంచి ఎక్కడా తగ్గకుండా క్రమంగా పెరుగుకుంటూ వెళ్లి ట్రేడింగ్‌ ముగియడానికి ముందు 16,146.90 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరింది. చివరకు 245.60 పాయింట్ల లాభంతో 16,130.75 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ కూడా 872.73 పాయింట్ల లాభంతో 53,823.36 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌, నిఫ్టీకి ముగింపు పరంగా ఇవే తాజా జీవన కాల గరిష్ఠ స్థాయులు.

ఉత్సాహం అందుకే..

సెన్సెక్స్‌, నిఫ్టీ భారీ లాభాల్లో కదలాడటానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. సూచీ కదలికలను ప్రభావితం చేసే హెచ్‌డీఎఫ్‌సీ షేరు దూకుడు. ఈ సంస్థ ప్రకటించిన ఆర్థిక ఫలితాల ప్రభావంతో మంగళవారం షేరు 3.72 శాతం పెరిగింది. సూచీల రాణింపునకు ఇది తోడ్పడింది. జులై జీఎస్‌టీ వసూళ్లు తిరిగి రూ.లక్ష కోట్లను మించడం, ఎగుమతులు పెరగడం, వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి, తయారీ రంగం పుంజుకోవడం, కంపెనీల ఆర్థిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉండటం లాంటివీ మదుపర్లలో ఉత్సాహాన్ని నింపాయి. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోందనే భావనతో వాళ్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు కొత్త శిఖరాలను అధిరోహించాయి.

ఆ మూడే డీలా..

సెన్సెక్స్‌ 30 షేర్లలో 27 రాణించగా 3 కంపెనీల షేర్లు మాత్రం స్వల్పంగా నష్టపోయాయి. ఎన్‌టీపీసీ (0.17%), టాటా స్టీల్‌  (0.20%), బజాజ్‌ ఆటో (0.33%) షేర్లు డీలాపడ్డాయి. అత్యధికంగా టైటాన్‌ షేరు 3.89 శాతం పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ తర్వాత లాభపడిన వాటిల్లో ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌ (3.39%), నెస్లే ఇండియా(3.27%), అల్ట్రాటెక్‌ సిమెంట్‌ (2.73%), ఎయిర్‌టెల్‌ (2.68%) షేర్లు ఉన్నాయి. 

* స్టాక్‌ మార్కెట్ల జోరు ప్రభావంతో డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 6 పైసలు పెరిగి 74.28 వద్ద ముగిసింది.

* వొడాఫోన్‌ ఐడియా కార్యకలాపాలు కొనసాగేందుకు, తన వాటాను ప్రభుత్వ సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమని ఆదిత్య బిర్లా గ్రూపు ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా ప్రకటించడంతో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో ఈ సంస్థ షేరు మంగళవారం 10.30 శాతం క్షీణించి రూ.7.40 వద్ద ముగిసింది. ఒకదశలో 13.09 శాతం క్షీణించి రూ.7.17కు వచ్చింది. ఇది 52 వారాల కనిష్ఠ స్థాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని