రాణించిన ఎస్‌బీఐ
close

Published : 05/08/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాణించిన ఎస్‌బీఐ

నికర లాభంలో 55% వృద్ధి

మొండి బాకీలు తగ్గడమే కారణం

2008 తర్వాత అత్యధిక త్రైమాసిక లాభం

దిల్లీ: ఆర్థిక ఫలితాల్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్ధతిన బ్యాంకు నికర లాభం 55 శాతం వృద్ధితో   రూ.6,504 కోట్లకు పెరిగింది. మొండి బకాయిలు తగ్గడం ఇందుకు ఉపకరించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో లాభం రూ.4,189.34 కోట్లే.

అన్ని విభాగాల్లోనూ రాణింపు

బ్యాంకు ఏకీకృత నికర లాభం రూ.5203.49 కోట్ల నుంచి 55 శాతం వృద్ధితో రూ.7539.22 కోట్లకు పెరిగింది. ‘దాదాపు అన్ని అంశాల్లో బ్యాంకు మంచి పనితీరు ప్రదర్శించింది. 2008 తర్వాత అత్యధిక త్రైమాసిక లాభాన్ని నమోదు చేసింది. ఆస్తుల నాణ్యత విషయంలోనూ నేను సంతృప్తిగా ఉన్నా’ అని ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ ఖరా పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌లతో ఒత్తిడిలోకి

బ్యాంకు నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 3.74% వృద్ధితో రూ.27,638 కోట్లకు చేరుకుంది. వడ్డీయేతర ఆదాయం 24.28% పెరిగి రూ.11,803 కోట్లకు చేరుకుంది. దేశీయ వడ్డీ ఆదాయ మార్జిన్‌ 3.24 శాతం నుంచి 3.15 శాతానికి పరిమితమైంది. బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ) 5.44  శాతం నుంచి 5.32 శాతానికి, నికర ఎన్‌పీఏలు 1.8% నుంచి 1.7 శాతానికి తగ్గాయి. ‘తాజాగా రూ.15,666 కోట్లు ఒత్తిడిలోకి వెళ్లాయి. లాక్‌డౌన్‌ల కారణంగా ఇవి నమోదయ్యాయి. ఒక్కసారి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడితే అవి వసూలవుతాయి. ఎస్‌ఎమ్‌ఈ, గృహ విభాగాల రుణాలు ఒత్తిడిలోకి వెళ్లినట్లు’ దినేశ్‌ పేర్కొన్నారు. సమీక్షిస్తున్న త్రైమాసికంలో 52,052 రుణ ఖాతాలకు సంబంధించిన రూ.5,246 కోట్ల రుణాలను బ్యాంకు పునః వ్యస్థీకరించింది.

కింగ్‌ఫిషర్‌ నుంచి రూ.1692 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.14,000-15,000 కోట్ల బకాయిలను రాబట్టుకుంటామని బ్యాంకు అంచనా వేస్తోంది. తొలి త్రైమాసికంలో కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ నుంచి రూ.1692 కోట్లను వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. మరో వైపు బ్యాంకు మొత్తం కేటాయింపులు 5.88% తగ్గి రూ.12,471 కోట్లకు చేరాయి. ఏడాది వ్యవధిలో మొండి బకాయిల కోసం కేటాయింపులు     రూ.9,420.46 కోట్ల నుంచి 46.61% తగ్గి రూ.5,029.79 కోట్లకు పరిమితం అయ్యాయి. రుణ వృద్ధి 5.64%గా నమోదైంది. వ్యక్తిగత రుణాలు 16.47%, వ్యవసాయ(2.48%), ఎస్‌ఎమ్‌ఈ(2.01%) కూడా రాణించాయి. 

బీఎస్‌ఈలో షేరు 2.37% లాభంతో రూ.457.05 వద్ద ముగిసింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని