వొడాఫోన్‌ ఐడియా బాధ్యతల నుంచి వైదొలగిన బిర్లా
close

Published : 05/08/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వొడాఫోన్‌ ఐడియా బాధ్యతల నుంచి వైదొలగిన బిర్లా

దిల్లీ: వొడాఫోన్‌ ఐడియా (వీఐఎల్‌) నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బాధ్యతల నుంచి కుమార మంగళం బిర్లా బుధవారం తప్పుకున్నారు. ఆయన స్థానంలో హిమాన్షు కపానియాను నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఆదిత్య బిర్లా గ్రూప్‌ నియమించింది. ఆర్థికంగా వీఐఎల్‌ తీవ్రంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ మార్పులు చోటుచేసుకోవడం గమనార్హం. ‘నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బాధ్యతల నుంచి వైదొలగేందుకు అనుమతించాలన్న కుమార మంగళం బిర్లా అభ్యర్థనను బుధవారం సమావేశమైన వీఐఎల్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. ఈనెల 4వ తేదీ పనిగంటలు ముగిసినప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది’ అని స్టాక్‌ఎక్స్ఛేంజీలకు సంస్థ సమాచారం ఇచ్చింది. ప్రస్తుత నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా ఉన్న హిమాన్షు కపానియాను నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా బోర్డు ఎన్నుకుంది. కపానియాకు టెలికాం రంగంలో 25 సంవత్సరాల అనుభవం ఉంది. అంతర్జాతీయ టెలికాం సంస్థల బోర్డుల్లో కూడా ఆయన అనుభవం ఉంది. సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాయ్‌) ఛైర్మన్‌గా, గ్లోబల్‌ జీఎస్‌ఎంఏ బోర్డు ఛైర్మన్‌గా చెరి రెండేళ్లు ఆయన బాధ్యతలు నిర్వర్తించారు కూడా. ఆదిత్య బిర్లా గ్రూప్‌ తరఫున వీఐఎల్‌ బోర్డులో అదనపు డైరెక్టరుగా సుశీల్‌ అగర్వాల్‌ను నియమించారు. సవరించిన స్థూల బకాయిల (ఏజీఆర్‌) కింద వీఐఎల్‌ రూ.58,254 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.7854.37 కోట్లు మాత్రమే జమచేసింది. ఇంకా రూ.50,399.63 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది.

బ్యాంకుల సంప్రదింపులు: రుణ సంక్షోభంలో చిక్కుకున్న వీఐఎల్‌ విషయంలో ఏం చేయాలనే విషయమై బ్యాంకర్లు చర్చించనున్నారు. బిర్లా నిర్ణయం నేపథ్యంలో ఇతర బ్యాంకర్లతోనూ సంప్రదింపులు జరుపుతామని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఎండీ ఎస్‌.ఎస్‌.మల్లికార్జున రావు తెలిపారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని