వెనకటి తేదీ నుంచి పన్నుండదు!
close

Published : 06/08/2021 04:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెనకటి తేదీ నుంచి పన్నుండదు!

గతంలో ఇచ్చిన నోటీసుల ఉపసంహరణకు బిల్లు
లోక్‌సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం
మొత్తం రూ.8100 కోట్లు తిరిగి చెల్లింపు
కెయిర్న్‌, వొడాఫోన్‌లకు ప్రయోజనం

దిల్లీ: వొడాఫోన్‌, కెయిర్న్‌ ఎనర్జీల విషయంలో ఎదురుదెబ్బలు తగలడంతో కేంద్ర ప్రభుత్వం ‘వెనకటి తేదీ నుంచి పన్ను చెల్లించాలనే నోటీసులకు’ స్వస్తి పలకాలని భావించింది. అందుకోసం ఆదాయపు పన్ను చట్టానికి సవరణలు చేయనుంది. ఇందు కోసమే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం లోక్‌సభలో ‘ద టాక్సేషన్‌ లాస్‌(అమెండ్‌మెంట్‌) బిల్‌, 2021’ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా 2012 మే 28 కి ముందు జరిగిన భారత ఆస్తుల పరోక్ష బదిలీ లావాదేవీలపై జారీ చేసిన పన్ను నోటీసులను వెనక్కి తీసుకోవచ్చు. ఈ కేసుల్లో ఏవైనా రిఫండ్‌ మొత్తాలున్నా, వాటిని వడ్డీలేకుండా చెల్లించడానికి సైతం ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ తరహాలో వసూలు చేసిన రూ.8100 కోట్లను తిరిగి చెలిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది.

భవిష్యత్‌లోనూ ఉండవు

ఈ బిల్లు ఆమోదం పొందితే, 2012  మే ముందు జరిగిన భారత ఆస్తుల పరోక్ష బదిలీలపై విధించిన పన్ను కాస్తా నిర్దిష్ట షరతులకు లోబడి ‘సున్నా’గా మారుతుంది. ఇందుకు సంబంధించి ఏవైనా చట్టబద్ధ వివాదాలున్నా వాటిని ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. ‘ఐటీ చట్టంలో సవరణకు బిల్లు ప్రతిపాదించాం. తద్వారా భవిష్యత్‌లో 2012 మేకు ముందు జరిగిన లావాదేవీలపై వెనకటి తేదీ ఆధారంగా ఎటువంటి పన్ను నోటీసులు జారీ చేయమ’ని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నిర్ణయం ఎందుకంటే

‘గత కొన్నేళ్లుగా ఆర్థిక, మౌలిక రంగాల్లో ప్రధాన సంస్కరణలను ప్రవేశపెట్టాం. దేశంలో పెట్టుబడులకు  సానుకూల వాతావరణాన్ని సృష్టించగలిగాం. అయితే వెనకటి తేదీ నుంచి పన్ను చెల్లించాలంటూ నోటీసులు ఇస్తుండటం పెట్టుబడుదార్లకు ఇబ్బందిగా మారింది. కరోనా అనంతరం ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకోవాల్సిన తరుణమిది. వేగవంతమైన వృద్ధికి, ఉపాధికి విదేశీ పెట్టుబడులు అత్యంత కీలకం. అందుకే ఈ బిల్లు ప్రవేశ పెడుతున్నట్లు’ ప్రభుత్వం తెలిపింది.

ఇదీ మూలం

2007లో హచిసన్‌తో జరిగిన లావాదేవీ విషయంలో తాము ఎటువంటి పన్ను కట్టక్కర్లేదంటూ ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనలను వొడాఫోన్‌ గ్రూప్‌ ఉటంకించడం సబబేనని 2012లో సుప్రీం కోర్టు ఆదేశాలు పేర్కొంది. అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఆర్థిక చట్టానికి సవరణ చేస్తూ ‘వెనకటి తేదీ ఒప్పందాలకు కూడా పన్ను విధించే అధికారాన్ని’ ఆదాయపు పన్ను విభాగానికి కట్టబెట్టారు. ఆ చట్టం అదే ఏడాది పార్లమెంటులో ఆమోదం పొందింది. దీంతో వొడాఫోన్‌కు 2013లో రూ.14,200 కోట్ల పన్ను నోటీసులు(రూ.7990 కోట్ల అసలు, మిగతా వడ్డీ) జారీ చేశారు. 2016 ఫిబ్రవరికి ఇది రూ.22,100 కోట్లకు చేరింది. కెయిర్న్‌ ఎనర్జీ పీఎల్‌సీ 2006-07లో భారత వ్యాపారాల పునర్‌ వ్యవస్థీకరణ సందర్భంగా చేసిన షేర్ల బదిలీకీ ఇదే చట్టాన్ని వినియోగించారు. 2014 జనవరిలో రూ.10,247 కోట్ల పన్ను నోటీసు ఆ సంస్థకు ఇచ్చారు. అపరాధ రుసుములతో కలిపి అది రూ.20,495 కోట్లకు చేరింది. అయితే ఈ రెండు కేసుల్లోనూ, ఆయా సంస్థలు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు (ఆర్బిట్రేషన్‌)ల్లో భారత్‌పై గెలిచాయి. 2011లో కెయిర్న్‌ ఇండియా వ్యాపారాన్ని కొనుగోలు చేసిన వేదాంతాపైనా పన్ను విధించారు. అయితే ఇంకా కేసు విషయంలో మధ్యవర్తిత్వ తీర్పు వెలువడలేదు.  


మొత్తం ఎన్ని కేసులంటే..

వెనకటి తేదీ నుంచి పన్ను విధించే చట్ట పరిధిలో మొత్తం 17 కంపెనీలకు రూ.1.1 లక్షల కోట్ల విలువైన పన్ను నోటీసులను ఐటీ విభాగం గతంలో జారీ చేసింది. ఇందులో ఎక్కువ రికవరీ కెయిర్న్‌ నుంచే జరిగింది.


వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది 

‘పరిణామాలను పరిశీలిస్తున్నాం. తదుపరి నిర్ణయాలుంటే చెబుతామ’ని కెయిర్న్‌ పేర్కొంది. ‘భారత పన్ను విధానాల స్థిరత్వంపై పెట్టుబడుదార్లలో ఈ పరిణామం విశ్వాసం నింపుతుంద’ని రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ అభిప్రాయపడ్డారు. పెట్టుబడిదార్లకు విశ్వాసం కలిగించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.


భారత్‌లో అంచనాలకు అనుగుణంగా ఉండే పన్ను విధానం ఉందని అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడిదార్లకు చెప్పినట్లు అయ్యింది.

- ఆర్థిక కార్యదర్శి టి.వి. సోమనాథన్‌


భారత ఆర్థిక వ్యవస్థపై విదేశీ పెట్టుబడిదార్ల విశ్వాసాన్ని ఇది పెంచుతుంది. పన్ను అంశాల్లో ‘సమాన’ న్యాయాన్ని అందిస్తామనే సందేశం పంపినట్లయింది.

- సీబీడీటీ ఛైర్మన్‌ జె.బి. మొహపాత్ర


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని