Gold Price: బంగారం ధరలు తగ్గొచ్చు! - Gold price may come down
close

Updated : 17/08/2021 09:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Gold Price: బంగారం ధరలు తగ్గొచ్చు!

దిల్లీ: రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గొచ్చని అంతర్జాతీయ సంస్థ యూబీఎస్‌ గ్రూప్‌ ఏజీ భావిస్తోంది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు పునరుత్తేజితం అవుతున్నందున, సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై పెట్టుబడులు తగ్గే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాలకు మించి నమోదు కాగా, ఫెడరల్‌ రిజర్వు త్వరలోనే తన భారీ ఉద్దీపనలను క్రమంగా వెనక్కి తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గొచ్చని, కమొడిటీ మదుపర్లు నష్టాలు పెరగకముందే బయటకు రావడం మంచిదని యూబీఎస్‌ గ్రూప్‌ ఏజీ సూచిస్తోంది. పసిడి ఔన్సు (31.10 గ్రాములు) ధర 1600 డాలర్లకు; వెండి 22 డాలర్లు అంతకంటే తక్కువగా దిగిరావొచ్చని యూబీఎస్‌ అంచనా వేస్తోంది.

2000 డాలర్లకు: గోల్డ్‌మన్‌ శాక్స్‌

వినియోగదారులతో పాటు కేంద్రీయ బ్యాంకులు కొనుగోలు చేసే వీలున్నందున, ఈ ఏడాది చివరకు ఔన్సు బంగారం ధర 2000 డాలర్లకు చేరొచ్చని గోల్డ్‌మన్‌ శాక్స్‌ వంటి సంస్థలు పేర్కొంటున్నాయి. కమొడిటీ మదుపర్లు, ట్రేడర్లు జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఔన్సు పసిడి 1785 డాలర్లు, వెండి 23.80 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

ఆభరణాల ఎగుమతులు మెరిశాయ్‌  

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జులైలో రత్నాభరణాల ఎగుమతులు 12.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.94,000 కోట్ల)కు చేరినట్లు రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ఛైర్మన్‌ కొలిన్‌ షా వెల్లడించారు. కొవిడ్‌ ముందు ఆర్థిక సంవత్సరమైన 2019-20 ఇదే కాల ఎగుమతులు 11.8 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.88,500 కోట్ల)తో పోలిస్తే, ఈసారి 6.04 శాతం అధికమని తెలిపారు. 2020-21 ఏప్రిల్‌-జులైలో ఎగుమతులు 3.87 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.29,000 కోట్ల)కు పరిమితమయ్యాయి.  వజ్రాల ఎగుమతులు 6.7 బి.డా. నుంచి 8.52 బి.డా.కు పెరిగితే, పసిడి ఆభరణాల ఎగుమతులు 38.5 శాతం తగ్గి 2.41 బి.డా.కు పరిమితమయ్యాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని