బ్యాంకులో ఖాతా లేకున్నా లాకర్‌
close

Published : 19/08/2021 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాంకులో ఖాతా లేకున్నా లాకర్‌

2022 జనవరి 1 నుంచి అమల్లోకి: ఆర్‌బీఐ

ఈనాడు, హైదరాబాద్‌: బ్యాంకులో లాకర్‌ కావాలంటే, ఖాతా ఉన్న బ్యాంకులోనే ప్రారంభించాల్సి వస్తోంది. ఇక నుంచి ఈ చిక్కులూ తొలగనున్నాయి. ఇప్పటి వరకు బ్యాంకుతో ఎలాంటి సంబంధం లేకపోయినా.. బ్యాంకు కోరిన వివరాలు ఇచ్చి, నిబంధనలు పాటించిన వారికి సేఫ్‌ డిపాజిట్‌ లాకర్‌/సేఫ్‌ కస్టడీని అందించాలని ఆదేశిస్తూ, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త మార్గదర్శకాలు 2022 జనవరి1, నుంచి అమల్లోకి వస్తాయి.

ఖాళీల వివరాలు సీబీఎస్‌లో: బ్యాంకులు సొంతంగా కొన్ని నిబంధనలు రూపొందించుకుని, అమలు చేసుకునే వెసులుబాటును ఆర్‌బీఐ కల్పించింది. బ్యాంకులు తమ శాఖల్లో ఖాళీగా ఉన్న లాకర్‌ల సంఖ్య, వేచి ఉన్న వారి వివరాలు కోర్‌ బ్యాంకింగ్‌ సిస్టం (సీబీఎస్‌)లో నమోదు చేయాలి. లాకర్ల జారీలో పూర్తి పారదర్శకత ఉండేందుకు ఇలా చేస్తున్నారు.

సుప్రీంకోర్టు సూచన మేరకు

లాకర్‌కు సంబంధించి ఆరు నెలల్లో కొత్త మార్గదర్శకాలు విడుదల చేయాల్సిందిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఆర్‌బీఐకి సూచించింది. కోల్‌కతాకు చెందిన ఒక ఖాతాదారుడు లాకర్‌లో ఉన్న బంగారు ఆభరణాలను తిరిగి ఇవ్వడం లేదా పరిహారంగా రూ.3లక్షలు ఇవ్వాలని జాతీయ వినియోగదారుల కమిషన్‌లో కేసు దాఖలు చేశారు. అక్కడి నుంచి ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకు ఆర్‌బీఐ ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

అద్దెకు 100 రెట్ల వరకు పరిహారం

బ్యాంకులు తమ దగ్గరున్న లాకర్లను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలి.. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, పిడుగులు పడటం, భూకంపాలు తదితరాలు వచ్చినప్పుడు, లాకర్‌ను అద్దెకు తీసుకున్న వ్యక్తి నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టానికి బ్యాంకు బాధ్యత వహించదు.  అగ్ని ప్రమాదాలు, దొంగతనం, బ్యాంకు ఉద్యోగుల మోసం వల్ల లాకర్‌లోని వస్తువులకు ఏదైనా నష్టం వాటిల్లితే.. దానికి బ్యాంకు కచ్చితంగా బాధ్యత వహించాల్సిందే.. ఇలాంటి సందర్భాల్లో లాకర్‌ అద్దెకు 100 రెట్ల వరకు పరిహారంగా ఇవాలని ఆర్‌బీఐ పేర్కొంది.

లాకర్‌ అద్దెను సకాలంలో రాబట్టుకునేందుకు బ్యాంకులు ఖాతాదారుల నుంచి టర్మ్‌ డిపాజిట్‌  కోరవచ్చు. ఇది మూడేళ్ల అద్దెకు సమానంగా ఉండటంతో పాటు, లాకర్‌ తాళంచెవి పోతే కొత్తది ఏర్పాటు చేసేందుకు అయ్యే ఖర్చు కూడా కలిసి ఉండొచ్చు. అయితే, ఇప్పటికే లాకర్‌ నిర్వహిస్తున్న వారికి ఇది వర్తించదని తెలిపింది. మూడేళ్లపాటు అద్దె చెల్లించని లాకర్‌ను నిబంధనలు, బ్యాంకు విచక్షణ మేరకు స్వాధీనం చేసుకోవచ్చు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని