అదానీకే గంగవరం పోర్ట్‌లో 100శాతం వాటా
close

Published : 26/08/2021 05:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదానీకే గంగవరం పోర్ట్‌లో 100శాతం వాటా

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ 10.4 శాతం వాటా రూ.644.78 కోట్లకు విక్రయించాలని నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: గంగవరం పోర్ట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటా కూడా అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ లిమిటెడ్‌ సొంతమవుతోంది. ఈ వాటాను రూ.644.78 కోట్లకు తమకు విక్రయించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ నెల 23న అనుమతి ఇచ్చినట్లు అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ వెల్లడించింది. ఈ లావాదేవీ ఒక నెలలో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.  గంగవరం పోర్ట్‌ లిమిటెడ్‌లో ఆ సంస్థ ప్రమోటర్‌ అయిన డీవీఎస్‌ రాజు నుంచి 58.1 శాతం వాటాను కొంతకాలం క్రితం అదానీ గ్రూపు కొనుగోలు చేసిన విషయం విదితమే. అంతకు ముందే ఈ కంపెనీలో 31.5 శాతం వాటాను వార్‌బర్గ్‌ పింకస్‌కు చెందిన విండీ లేక్‌సైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అనే సంస్థ నుంచి కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వద్ద ఉన్న 10.4 శాతం వాటా కూడా దక్కడంతో ,గంగవరం పోర్ట్‌లో నూరుశాతం వాటా అదానీ చేతికి వచ్చినట్లు అవుతుంది. విశాఖపట్నం సమీపంలో ఉన్న గంగవరం పోర్ట్‌ గత దశాబ్దకాలంలో దేశానికి తూర్పుతీరంలో ఉన్న అత్యంత ముఖ్యమైన పోర్టుల్లో ఒకటిగా ఎదిగింది. ఈ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో 32.81 మిలియన్‌ టన్నుల సరకు రవాణా నమోదు చేసింది. తద్వారా రూ.1,057 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఏటా 64 మిలియన్‌ టన్నుల కార్గోను రవాణా చేయగల సామర్థ్యం ఈ పోర్టుకు ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని