టెలికాంలో 100% ఎఫ్‌డీఐ
close

Published : 16/09/2021 03:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టెలికాంలో 100% ఎఫ్‌డీఐ

ఏజీఆర్‌ బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం
టెలికాంయేతర ఆదాయాలకు మినహాయింపు
వొడాఫోన్‌ ఐడియాకు పెద్ద ఊరట
తొమ్మిది నిర్మాణాత్మక సంస్కరణలకు మంత్రివర్గ ఆమోదం

దిల్లీ: ఒత్తిడిలో ఉన్న టెలికాం రంగానికి కేంద్ర మంత్రివర్గం 9 సంస్కరణలతో భారీ ఉద్దీపన పథకాన్ని ప్రకటించింది. ఈ రంగంలోకి నేరుగా (ఆటోమేటిక్‌ మార్గంలో) 100 శాతం విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇప్పటిదాకా 49 శాతం వరకే ఈ అనుమతి ఉంది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాల (ఏజీఆర్‌) బకాయిల చెల్లింపుపై నాలుగేళ్ల మారటోరియం విధించింది. టెలికాం యేతర ఆదాయాలను ఏజీఆర్‌ నుంచి మినహాయించింది. కొరత ఉన్న స్పెక్ట్రమ్‌ను పంచుకోడానికి అనుమతి ఇవ్వడం; సుంకాలు చెల్లించే ఆదాయ నిర్వచనంలో మార్పులనూ బుధవారం నాటి సమావేశంలో ఆమోదించారు. ఇదిలా ఉంటే 5జీ స్పెక్ట్రమ్‌ వేలాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించేందుకు అవకాశం ఉందని టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణా పేర్కొన్నారు. జనవరిలోనే చేసినా ఆశ్చర్యం లేదన్నారు.

ఎందుకీ సంస్కరణలంటే..

దేశంలో బ్రాడ్‌బ్యాండ్‌, టెలికాం అనుసంధానతను పెంచడం కోసం ఈ సంస్కరణలను ప్రభుత్వం ప్రకటించింది. 4జీ నెట్‌వర్క్‌తో పాటు 5జీ నెట్‌వర్క్‌కు తగినన్ని పెట్టుబడులు వచ్చే వాతావరణాన్ని సృష్టించడానికి ఈ చర్యలు తీసుకుంది. టెలికాం రంగంలో ఆరోగ్యకర పోటీ నెలకొల్పి, వినియోగదార్లకు తమకు నచ్చిన టెల్కో సేవల ఎంపికకు వీలు కల్పించడానికి వీటిని ప్రవేశపెట్టామని కేంద్రం చెబుతోంది. ఇందువల్ల ఉద్యోగాలను రక్షించడమే కాకుండా,  కొత్తగా సృష్టించొచ్చని తెలిపింది. పెట్టుబడులకు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు నియంత్రణపరమైన భారాన్ని తగ్గిస్తున్నట్లు పేర్కొంది.

టెల్కోలకు ఇవీ ప్రయోజనాలు

బకాయిలపై మారటోరియం వల్ల వొడాఫోన్‌ ఐడియాకు భారీ ఊరటతో పాటు భారతీ ఎయిర్‌టెల్‌కు ప్రయోజనాలు దక్కొచ్చు. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, ఆర్‌కామ్‌లు లైసెన్సు ఫీజు కింద రూ.92,000 కోట్లు; స్పెక్ట్రమ్‌ వినియోగ ఛార్జీల కింద రూ.41,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. నాలుగేళ్ల మారటోరియం కాలంలో చాలా తక్కువ వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. మారటోరియం ముగింపు కాలంలో వాయిదా వేసిన మొత్తాన్ని ఈక్విటీగా మార్చుకునే వీలు కల్పించారు.
ఏజీఆర్‌ నిర్వచనంలో టెలికాంయేతర ఆదాయాలను మినహాయించడం వల్ల వొడాఫోన్‌ ఐడియా వంటి దివాలా అంచున ఉన్న కంపెనీలకు ఊరట దక్కుతుంది.
భవిష్యత్‌లో చేపట్టబోయే వేలంలో కొనుగోలు చేసే స్పెక్ట్రమ్‌పై వినియోగ ఛార్జీ(ఎస్‌యూసీ)లను రద్దు చేశారు. ఇది మొత్తం టెలికాం రంగానికి ప్రయోజనం కలిగించే అంశం.
బ్యాంకు హామీల కుదింపు; వడ్డీ రేట్ల క్రమబద్ధీకరణ; లైసెన్సు ఫీజుల చెల్లింపులు, ఎస్‌యూసీల ఆలస్యంపై అపరాధ రుసుముల తొలగింపు; భవిష్యత్‌ వేలాలపై బ్యాంకు హామీ తొలగింపు వంటి నిర్మాణాత్మక సంస్కరణల కారణంగా టెలికాం కంపెనీలు ఊపిరి పీల్చుకోనున్నాయి.
స్పెక్ట్రమ్‌ గడువును 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు పెంచడం; 10 ఏళ్ల తర్వాత స్పెక్ట్రమ్‌ను తిరిగి ఇచ్చేందుకు అనుమతి; భవిష్యత్‌ వేలాల్లో ఎస్‌యూసీ రద్దు; స్పెక్ట్రమ్‌ పంచుకుంటే అదనంగా ఎస్‌యూసీ 0.5 శాతం విధించడం నుంచి మినహాయింపు కూడా కంపెనీలకు లబ్ధి చేకూర్చనున్నాయి.
స్వయం కేవైసీ, ఇ-కేవైసీ వంటి విధానపరమైన సంస్కరణల వల్ల వెసులుబాటు కలగనుంది.


వినియోగదార్లకూ మేలే

ప్రీపెయిడ్‌ నుంచి పోస్ట్‌పెయిడ్‌కు లేదా పోస్ట్‌పెయిడ్‌ నుంచి ప్రీపెయిడ్‌కు మారాలంటే తాజా కేవైసీ అక్కర్లేదు. ఇది వినియోగదార్లకు ఊరట కలిగించే అంశమే.


చరిత్రాత్మక పరిణామం

టెలికాం రంగంపై మంత్రివర్గ నిర్ణయాలు చరిత్రాత్మకం. టెలికాం సంస్థలు, వినియోగదార్లకు మేలు చేస్తాయి. ఉద్యోగావకాశాలొస్తాయి. వాహన, డ్రోన్‌ పరిశ్రమకు ప్రోత్సాహకాల వల్ల తయారీ రంగానికి ఊతం లభిస్తుంది.

- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ


డిజిటల్‌ ఇండియా లక్ష్యాలు నెరవేరతాయి

ర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే రంగాల్లో టెలికాం ఒకటి. భారత్‌ను ‘డిజిటల్‌ సొసైటీ’గా మార్చడంలో దీనిది కీలకపాత్ర. ఈ రంగానికి సంస్కరణలు, ఊరట చర్యలను కేంద్రం ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నాం. ఈ చర్యల వల్ల ‘డిజిటల్‌ ఇండియా’ లక్ష్యాలను భారత్‌ చేరుకుంటుంది. ప్రధాని నిర్ణయాలకు కృతజ్ఞతలు.

- రిలయన్స్‌ జియో అధినేత ముకేశ్‌ అంబానీ


పెట్టుబడులకు మేం సిద్ధం

తాజా సంస్కరణల వల్ల పరిశ్రమ భయం లేకుండా పెట్టుబడులు పెట్టడానికి వీలవుతుంది. దేశ వృద్ధి కోసం పెట్టుబడులు పెట్టాలన్న ప్రధాని మోదీ పిలుపునకు మా కంపెనీ స్పందిస్తుంది.

- భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని