ఒకే జట్టుగా టెలికాం!
close

Published : 17/09/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకే జట్టుగా టెలికాం!

వొడాఫోన్‌ నిక్‌ రీడ్‌తో మాట్లాడా.. ముకేశ్‌తోనూ చర్చిస్తా
భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌ ప్రతిన

దిల్లీ: నిర్వహణ వ్యయాలు తగ్గించుకునేందుకు మౌలిక వసతులను పంచుకోవడం వంటి అంశాల్లో దేశీయ టెలికాం సంస్థలన్నీ జట్టుగా ఉండేందుకు ప్రయత్నిస్తానని భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌ పేర్కొన్నారు. ఒత్తిడిలో ఉన్న టెలికాం రంగం కోసం ప్రభుత్వం బుధవారం పలు సంస్కరణలను ప్రకటించిన మరుసటి రోజే మిత్తల్‌ పై విధంగా స్పందించారు. బుధవారమే వొడాఫోన్‌ అధిపతి నిక్‌ రీడ్‌తో మాట్లాడానని.. త్వరలోనే రిలయన్స్‌ జియో ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీతోనూ చర్చిస్తానని పేర్కొన్నారు. దేశంలోని ఇతర మౌలిక కంపెనీలకు టెలికాం సంస్థలు ఆదర్శంగా నిలిచేలా చేస్తామని గురువారం జరిగిన దృశ్యమాధ్యమ సమావేశంలో పేర్కొన్నారు. ఇలా ఉన్నంతమాత్రాన కంపెనీలు కుమ్మక్కయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు. జియో తీసుకురాబోయే అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా హ్యాండ్‌సెట్‌ తయారీదార్లతో భారతీ ఎయిర్‌టెల్‌ ఒప్పందాలు కుదుర్చుకుంటుందన్న వార్తలపై స్పందిస్తూ..‘అందుబాటు ధరలో స్మార్ట్‌ఫోన్‌ తీసుకురావాల్సిన అవసరం వస్తే అందుకు తాము సిద్ధంగానే ఉన్న’ట్లు తెలిపారు.

టెలికాం రంగం బాగుండటమే ధ్యేయం

‘టెలికాం పరిశ్రమ ఆర్థికస్థితి మెరుగుపడేలా చర్చలు జరుపుతాం. పంపిణీ వ్యవస్థపై మాట్లాడుకుంటాం. అంతేకానీ టారిఫ్‌లపై కాదు. వేరే కంపెనీ కంటే మా మార్కెట్‌ వాటా ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నపుడు, టారిఫ్‌లపై చర్చ ఎలా జరుపుతాం. వినియోగదార్లకు సేవలందించడంలో మా మధ్య పోటీ కొనసాగుతుంద’ని అన్నారు.

వొడాఫోన్‌ ఐడియాకు గొప్ప అవకాశం

‘ప్రభుత్వం ప్రకటించిన ఆఫర్‌ వొడాఫోన్‌ ఐడియాకు లభించిన జీవితకాల అవకాశం. విపణిలో పటిష్ఠంగా నిలబడేందుకు గొప్ప అవకాశం దక్కింది. వొడాఫోన్‌ గ్రూప్‌, కుమార మంగళం బిర్లాలు కలిసి వొడాఫోన్‌ ఐడియా త్వరగా పుంజుకునేందుకు కృషి చేయాలి. నేను కనుక వారి స్థానంలో ఉంటే.. భారీ ఎత్తున పెట్టిన పెట్టుబడులను వసూలు చేసుకునేందుకు దక్కిన అవకాశంగా భావిస్తా. వొడాఫోన్‌ 2000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. బిర్లా కూడా వందల కోట్ల డాలర్లను ఖర్చు చేశార’ని  సునీల్‌ మిత్తల్‌ వివరించారు. అంబానీతోనూ మాట్లాడాక చర్చల ఫలితం ఏమవుతుందో చూడాలని అన్నారు. ప్రభుత్వం కల్పించిన మారటోరియం సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటామని స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని