సులభతర వాణిజ్య ర్యాంకులను ఇవ్వం
close

Published : 18/09/2021 02:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సులభతర వాణిజ్య ర్యాంకులను ఇవ్వం

 ప్రపంచ బ్యాంకు స్పష్టీకరణ

చైనా గణాంకాల్లో అవకతవకల నేపథ్యం

దిల్లీ: ప్రపంచంలో సులభతర వాణిజ్యానికి మెరుగైన వాతావరణం ఉన్న దేశాల జాబితాను ఇక ప్రచురించరాదని ప్రపంచ బ్యాంక్‌ గ్రూప్‌ నిర్ణయించింది. ఇందుకు కారణం చైనా ర్యాంకుల విషయంలో పలు అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడమే. 2017లో చైనా ర్యాంకును మెరుగుపరచడం కోసం ప్రపంచ బ్యాంకులోని కొంత మంది అత్యున్నతాధికారుల ఒత్తిడి కారణంగా గణాంకాల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోంది. కాగా, ‘డూయింగ్‌ బిజినెస్‌’పై ఉన్న మొత్తం సమాచారాన్ని(పాత సమీక్షలు, ఆడిట్‌లు తదితరాలు) సమీక్షించిన అనంతరం ఇకపై డూయింగ్‌ బిజినెస్‌ నివేదికను ఆపేయాలని బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు, ప్రపంచ బ్యాంకు గ్రూప్‌ యాజమాన్యం నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో ప్రపంచ బ్యాంకు పేర్కొంది.

కొత్త పద్ధతిపై దృష్టి

‘వ్యాపారం, పెట్టుబడుల వాతావరణాన్ని మదింపు చేసేందుకు రాబోయే రోజుల్లో కొత్త పద్ధతిని కనిపెటేందుకు పనిచేస్తాం. వ్యాపార వాతావరణ అజెండాపై అహర్నిశలూ పనిచేసిన సిబ్బందికి కృతజ్ఞతలు. కొత్త మార్గాల విషయంలోనూ వారి సేవలు, సామర్థ్యాలను వినియోగించుకోదగలచామ’ని ప్రపంచబ్యాంక్‌ వివరించింది. ‘డూయింగ్‌ బిజినెస్‌ 2018, డూయింగ్‌ బిజినెస్‌ 2020’లలో డేటా అవకతవకలు జరిగినట్లు జూన్‌ 2020న అంతర్గత నివేదికలు అందాయి. ఈ నేపథ్యంలోనే తదుపరి ‘డూయింగ్‌ బిజినెస్‌’ నివేదికను ఇవ్వరాదని నిర్ణయించినట్లు తెలిపింది. నైతిక అంశాలపై అంతర్గత నివేదికలు ప్రశ్నలు లేవనెత్తాయని వివరించింది. ‘డూయింగ్‌ బిజినెస్‌ 2020’ నివేదిక ప్రకారం.. సులభతర వాణిజ్యం విషయంలో భారత్‌ 14 ర్యాంకులు మెరుగుపరచుకుని 63వ స్థానానికి చేరింది. అయిదేళ్ల(2014-19)లో భారత్‌ మొత్తం 79 స్థానాలను ఎగబాకింది.
భారత్‌కే మేలు : ప్రపంచ బ్యాంకు నిర్ణయం చైనా మోసాన్ని బట్టబయలు చేసిందని.. దీని వల్ల పలు కంపెనీలు తమ తయారీ కేంద్రాలను భారత్‌కు బదిలీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ‘భారత గణాంకాల్లో ఎటువంటి అవకతవకలు లేవు. ప్రపంచానికి పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్‌ కొనసాగుతుంది. చైనా తన ఆకర్షణను కోల్పోతుండగా.. భారత్‌ ఒక విశ్వసనీయ గమ్యస్థానంగా ఉంటోంద’ని ఆ వర్గాలు పేర్కొన్నాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని