బయోలాజికల్‌ విప్లవం మొదలైంది
close

Published : 18/09/2021 02:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బయోలాజికల్‌ విప్లవం మొదలైంది

 రూ.11.25 లక్షల కోట్ల అవకాశాలు: కెర్నీ- సీఐఐ నివేదిక

 500 కోట్ల డాలర్లకు టీకాల ఉత్పత్తి

ఈనాడు - హైదరాబాద్‌

నదేశంలో బయో ఫార్మాస్యూటికల్స్‌ పరిశ్రమ 2025 నాటికి 150 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.11.25 లక్షల కోట్ల)స్థాయికి చేరుకునే అవకాశం ఉందని కన్సల్టింగ్‌ సేవల సంస్థ కెర్నీతో కలిసి భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) రూపొందించిన నివేదిక అభిప్రాయపడింది. ‘టేకింగ్‌ ఇండియాస్‌ లైఫ్‌ సైన్స్‌ టు ద గ్లోబల్‌ స్టేజ్‌’ పేరుతో రూపొందించిన ఈ నివేదికను సీఐఐ నిర్వహించిన జీవశాస్త్రాల సదస్సులో ఆవిష్కరించారు. మనదేశంలో ఉత్పత్తి అయ్యే బయోసిమిలర్‌ ఔషధాలు, టీకాలు ప్రపంచ వ్యాప్తంగా సరఫరా అయ్యే అవకాశం ఉందని ఈ నివేదిక విశ్లేషించింది. బయోసిమిలర్‌ ఔషధాల మార్కెట్‌ ప్రస్తుత 550 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4100 కోట్ల) నుంచి 5- 6 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.37,500-45,000 కోట్ల) స్థాయికి విస్తరించే అవకాశం ఉందని, టీకాల ఉత్పత్తిని 200  కోట్ల డాలర్ల (సుమారు రూ.15,000 కోట్ల) నుంచి 400- 500 కోట్ల డాలర్ల (సుమారు రూ.30,000-37,500 కోట్ల)కు పెంచుకోవచ్చని వివరించింది. ఇది సాధ్యం కావాలంటే, పరిశోధనలకు పెద్దపీట వేయాలని, బయోటెక్‌ రంగంలో అంకుర సంస్థలను ప్రోత్సహించాలని, దీనికి అనువుగా ప్రభుత్వ విధానాలను రూపొందించాలని సూచించింది. దేశవ్యాప్తంగా బయో-క్లస్టర్లను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక భాగస్వామ్యాలు కుదుర్చుకోవాలని ఈ నివేదిక అభిప్రాయపడింది.


ప్రపంచంలో 2/3 వంతు పిల్లలకు మన టీకాలే: కృష్ణ ఎల్లా

సదస్సులో భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌  కృష్ణ ఎల్ల మాట్లాడుతూ మనదేశం రసాయన విప్లవాన్ని సాధించిందని, బయోలాజికల్‌ విప్లవం మొదలైందని పేర్కొన్నారు. భారత టీకాల పరిశ్రమ అనూహ్య ప్రగతి సాధించిందని, ప్రపంచ వ్యాప్తంగా మూడింట రెండొంతుల మంది పిల్లలకు భారతదేశంలో ఉత్పత్తి అయిన టీకాలనే వినియోగిస్తున్నారని తెలిపారు. మనదేశంలోని టీకా సంస్థలు చిన్న పిల్లల టీకాలను అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయని ఇకపై పెద్దవాళ్లకు ఇచ్చే టీకాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని  వివరించారు. ఈ పరిశ్రమను ప్రోత్సహించటానికి దేశవ్యాప్తంగా క్లినికల్‌ పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికా, ల్యాటిన్‌ అమెరికా దేశాలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవాలని అభిప్రాయపడ్డారు.


భవిష్యత్తు బయోటెక్‌దే
కిరణ్‌ మజుందార్‌ షా

యోటెక్‌ రంగంలో సత్వర అభివృద్ధి సాధించాలంటే... ఈ పరిశ్రమకు అవసరమైన అన్ని విభాగాల్లో మనం శక్తియుక్తులు సమకూర్చుకోవాలని బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా  తెలిపారు. రీ-యూజబుల్స్‌, రీ-ఏజెంట్స్‌ సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తు అంతా బయోటెక్‌, బయోసైన్స్‌, బయోఫార్మా రంగాలదేనని, ఈ విభాగాలపై ఇప్పటి నుంచే మనం పెట్టుబడులు పెట్టాలని అన్నారు.


5 ఏళ్లలో 10,000 అంకురాల లక్ష్యం
బయోటెక్నాలజీ కార్యదర్శి డాక్టర్‌ రేణు స్వరూప్‌

నదేశం 2025 నాటికి 150 బిలియన్‌ డాలర్ల విలువైన బయోటెక్‌ పరిశ్రమను సాధించటానికి అవసరమైన వ్యూహపత్రం సిద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వ  బయోటెక్నాలజీ కార్యదర్శి డాక్టర్‌ రేణు స్వరూప్‌ తెలిపారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు పరిశ్రమ- విద్యాసంస్థల మధ్య భాగస్వామ్య ఒప్పందాలు కుదరాలని సూచించారు. బయో ఆవిష్కరణల కోసం వచ్చే అయిదేళ్లలో కనీసం 10,000 అంకుర సంస్థలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. మనదేశంలో ప్రస్తుతం ‘రిస్క్‌ కేపిటల్‌’ కు కొరత లేదని కేంద్ర ప్రభుత్వ  ప్రధాన శాస్త్ర సలహాదారుడు ప్రొఫెసర్‌ కె.విజయ్‌ రాఘవన్‌ అన్నారు. సీఐఐ- నేషనల్‌ బయోటెక్నాలజీ కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ రాజేష్‌ జైన్‌, సీఐఐ నేషనల్‌ కమిటీ ఆన్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఉపాధ్యక్షుడు వివేక్‌ కామత్‌ తదితరులు ఈ సదస్సులో మాట్లాడారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని