గరిష్ఠ స్థాయుల్లో లాభాల స్వీకరణ!
close

Published : 20/09/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గరిష్ఠ స్థాయుల్లో లాభాల స్వీకరణ!

సమీక్ష: సానుకూల సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు తాజా జీవనకాల గరిష్ఠాలను అధిరోహించాయి. అయితే చివర్లో లాభాల స్వీకరణతో వెనక్కి వచ్చాయి. వాహన రంగానికి రూ.25,938 కోట్ల పీఎల్‌ఐ పథకం, టెలికాం సంస్థల ఏజీఆర్‌ బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం, బ్యాంకింగ్‌ రంగంలో ఎన్‌పీఏల పరిష్కారానికి బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు వంటి నిర్ణయాలు మదుపర్లను మెప్పించాయి. బ్యారెల్‌ ముడిచమురు 3.3 శాతం పెరిగి 75.4 డాలర్లకు చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ 73.5 వద్ద స్తబ్దుగా ముగిసింది. అంతర్జాతీయంగా చూస్తే.. జపాన్‌ నిక్కీ మినహా ప్రధాన మార్కెట్లన్నీ డీలాపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్‌ వ్యాప్తితో అప్రమత్తత పెరిగింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 1.2 శాతం లాభంతో 59,016 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 1.2 శాతం పెరిగి 17,585 పాయింట్ల దగ్గర స్థిరపడింది. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.6,476 కోట్ల షేర్లను, డీఐఐలు రూ.2,896 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. సెప్టెంబరులో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు ఈక్విటీల్లోకి రూ.11,287 కోట్లు, డెట్‌లోకి రూ.5018 కోట్లు చొప్పించారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 5:9గా నమోదు కావడం..
పెద్ద షేర్లలో లాభాల స్వీకరణను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: సెన్సెక్స్‌ గతవారం 59,737 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసి, లాభాల్లో ముగిసింది. స్వల్పకాలంలో 57,625 పాయింట్ల వద్ద మద్దతుతో సూచీ స్థిరీకరించుకునే అవకాశం ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే లాభాలు కొనసాగవచ్చు.  
ప్రభావిత అంశాలు: వరుసగా నాలుగు వారాల పాటు దూసుకెళ్లిన మార్కెట్‌ స్థిరీకరణకు గురయ్యే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరందుకోవడం, పండుగల సీజన్‌ ప్రారంభంతో ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు పెరగడం సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే సంకేతాలు కూడా ప్రభావం చూపనున్నాయి. అమెరికా ఫెడ్‌ నిర్ణయాలు, వడ్డీ రేట్ల వార్తలు కీలకం కానున్నాయి. దేశీయంగా చూస్తే.. జీఎస్‌టీ మండలి సమావేశ నిర్ణయాలు నేటి మార్కెట్‌పై ప్రభావం చూపొచ్చు. ఈ వారం కీలక పరిణామాలు లేకపోవడంతో షేరు ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించొచ్చు.అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా హౌసింగ్‌ మార్కెట్‌ ఇండెక్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ నిర్ణయాలు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ సమావేశంపై మదుపర్లు దృష్టి పెట్టొచ్చు. కొవిడ్‌-19 కేసుల పెరుగుదలపై ఓ కన్నేయొచ్చు. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, ముడిచమురు ధరలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడుల నుంచి కూడా సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు.

తక్షణ మద్దతు స్థాయులు: 58,214, 57,764, 57,263
తక్షణ నిరోధ స్థాయులు: 59,700, 60,400, 61,000
మార్కెట్‌కు గరిష్ఠ స్థాయుల్లో లాభాల స్వీకరణ ఎదురుకావొచ్చు.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని