ఆంధ్రా సిమెంట్స్‌పై శ్రీ సిమెంట్‌ ఆసక్తి
close

Published : 21/09/2021 04:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆంధ్రా సిమెంట్స్‌పై శ్రీ సిమెంట్‌ ఆసక్తి

 దక్షిణాదికి విస్తరించే ప్రయత్నం

ఇతర సంస్థలతో పోటీపడి దక్కించుకునేందుకు ప్రయత్నాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాజస్థాన్‌లోని అజ్మీర్‌ కేంద్రంగా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యంత క్రియాశీలక సిమెంటు కంపెనీగా ఉన్న శ్రీ సిమెంట్‌, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఉన్న ఆంధ్రా సిమెంట్స్‌ను కొనుగోలు చేయటానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే ఆంధ్రా సిమెంట్స్‌ యూనిట్లను కొనుగోలు చేసేందుకు బిడ్లు దాఖలు చేసినట్లు తెలిసింది. రుణభారం, ఇతర సమస్యలతో ఖాయిలా పడిన ఆంధ్రా సిమెంట్స్‌ యూనిట్లను ఇటీవల ఎడెల్‌వైజ్‌ ఏఆర్‌సీ (అసెట్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ) అమ్మకానికి పెట్టిన విషయం విదితమే. దీనికి అనుగుణంగా ఆసక్తి కల కొనుగోలుదార్ల నుంచి బిడ్లు ఆహ్వానిస్తూ బహిరంగ ప్రకటన జారీ చేశారు. ఈ వ్యవహారాన్ని గ్రాంట్‌ థార్టన్‌ అనే కన్సల్టింగ్‌ సేవల సంస్థ పర్యవేక్షిస్తోంది. ఆంధ్రా సిమెంట్స్‌ గతంలో పలు సార్లు చేతులు మారింది. తొలుత ఈ సంస్థను బెన్నెట్‌ కోల్‌మ్యాన్‌ కంపెనీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత 1994లో బీఐఎఫ్‌ఆర్‌ (బోర్డ్‌ ఫర్‌ ఇండస్ట్రియల్‌ అండ్‌ ఫైనాన్సియల్‌ రీకన్‌స్ట్రక్షన్‌) ద్వారా జీపీ గోయంకా కు చెందిన డ]ంకన్‌ గోయంకా గ్రూపు దీన్ని కొనుగోలు చేసింది. మళ్లీ 2012లో ఇది జేపీ గ్రూపు చేతికి వెళ్లిపోయింది. ఇప్పుడు జేపీ గ్రూపు నుంచి మరో సంస్థ చేతికి వెళ్లే అవకాశం ఏర్పడింది.

2.6 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం

ఆంధ్రా సిమెంట్స్‌కు గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద సమీకృత సిమెంటు ప్లాంటు, సున్నపు రాయి నిల్వలతో పాటు విశాఖపట్నం వద్ద గ్రైండింగ్‌ యూనిట్‌ ఉంది. ఈ యూనిట్లకు 2.6 మిలియన్‌ టన్నుల వార్షిక సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఈ సంస్థకు రుణభారం ఎంతో అధికంగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌, ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంకు (ప్రస్తుతం యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా), కరూర్‌ వైశ్యా బ్యాంకు దీనికి రుణాలు ఇచ్చాయి. 2021 మార్చి 31 నాటికి బ్యాంకులు- ఆర్థిక సంస్థలకు ఆంధ్రా సిమెంట్స్‌ బకాయి పడిన సొమ్ము రూ.960 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. బకాయిలు చెల్లించనందున కొన్ని బ్యాంకులు గత ఏడాది మార్చి 31 నాటికే, ఆంధ్రా సిమెంట్స్‌ రుణ ఖాతాలను నిరర్థక ఆస్తులుగా గుర్తించాయి. ఈ అప్పు వసూలయ్యేట్లు లేదని భావించి, తదుపరి చర్యగా సిమెంటు ప్లాంట్లను అమ్మకానికి పెట్టాయి. ఈ బాధ్యతను ఎడెల్‌వైజ్‌ ఏఆర్‌సీ చేపట్టింది. ఈ ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరినట్లు సమాచారం. శ్రీ సిమెంట్‌తో పాటు అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఏసీసీ, జేకే సిమెంట్‌, జేకే లక్ష్మీ సిమెంట్‌, రాంకో సిమెంట్స్‌ సంస్థలను ఎడెల్‌వైజ్‌ ఏఆర్‌సీ సంప్రదించగా, కొన్ని ముందుకు వచ్చి బిడ్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. కానీ శ్రీ సిమెంట్‌కే దీన్ని దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

80 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యం

శ్రీ సిమెంట్‌ 2030 నాటికి 80 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో కొత్త యూనిట్లను రూ.5,000 కోట్లతో నిర్మిస్తోంది. దేశవ్యాప్తంగా సిమెంటు వినియోగం పెరుగుతోందని, వచ్చే కొన్నేళ్ల పాటు ఏటా 7 శాతం చొప్పున వినియోగం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాదికే పరిమితం కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో అడుగు పెట్టాలనేది శ్రీ సిమెంట్‌ ఆలోచన. దీనికి అనుగుణంగా ఆంధ్రా సిమెంట్స్‌ యూనిట్లను సొంతం చేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. ‘అమ్మకానికి వచ్చిన అన్ని సిమెంటు యూనిట్లనూ పరిశీలిస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రా సిమెంట్స్‌ను కొనుగోలు చేసే యత్నాలు మొదలుపెట్టాం’ అని శ్రీ సిమెంట్స్‌ ఎండీ హెచ్‌ఎం బంగూర్‌ తాజాగా స్పష్టం చేయడం గమనార్హం.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని