కనీస నిల్వ ఛార్జీలతోపీఎన్‌బీకి రూ.170 కోట్లు
close

Published : 21/09/2021 04:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కనీస నిల్వ ఛార్జీలతోపీఎన్‌బీకి రూ.170 కోట్లు

దిల్లీ: ఖాతాదారులు తమ ఖాతాలో కనీస నగదు నిల్వ (మినిమమ్‌ బ్యాలెన్స్‌) నిర్వహించని కారణంగా విధించే ఛార్జీల రూపేణ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) సుమారు రూ.170 కోట్లు ఆర్జించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద అడిగిన సమాచారానికి పీఎన్‌బీ పైవిధంగా సమాధానం ఇచ్చింది. 2019-20లో కనీస నిల్వ రుసుము కింద పీఎన్‌బీ రూ.286.24 కోట్లు వసూలు చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో మూడు నెలలకోసారి ఈ తరహా రుసుమును బ్యాంకులు విధిస్తుంటాయి. 2020-21 మొదటి త్రైమాసికంలో క్యూఏబీ (త్రైమాసిక సగటు నిల్వ) నిర్వహించని కారణంగా వసూలు చేసిన రుసుం రూ.35.48 కోట్లుగా (పొదుపు, కరెంటు ఖాతాలపై) ఉంది. రెండో త్రైమాసికంలో ఎలాంటి రుసుమును విధించలేదు. మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా రూ.48.11 కోట్లు, రూ.35.46 కోట్లు చొప్పున వసూలు చేసినట్లు పీఎన్‌బీ తెలిపింది. ఏటీఎం లావాదేవీ ఛార్జీల రూపంలో 2020-21 సంవత్సరానికి రూ.74.28 కోట్లు ఆర్జించినట్లు వివరించింది. 2019-20లో ఇది రూ.114.08 కోట్లుగా ఉంది. ఐబీఏ (ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌), ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 2020-21 మొదటి త్రైమాసికంలో ఏటీఎం లావాదేవీల రుసుమును విధించలేదని పీఎన్‌బీ పేర్కొంది.


కొత్త ఐపీఓలతో అదనంగా 400 బి.డాలర్ల సంపద

5వ అతిపెద్ద మార్కెట్‌గా భారత్‌

గోల్డ్‌మన్‌ శాక్స్‌ నివేదిక

ముంబయి: వచ్చే మూడేళ్లలో తొలి పబ్లిక్‌ ఆఫర్‌ల (ఐపీఓలు) ద్వారా భారత మార్కెట్‌ సంపదకు మరో 400 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.30 లక్షల కోట్లు) జతచేరే అవకాశం ఉందని అమెరికాకు చెందిన బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ నివేదిక అంచనా వేసింది. కొన్ని నెలల్లో భారత్‌లో ఐపీఓ కార్యకలాపాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో సంస్థ తాజా అంచనా వెలువరించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే ప్రాథమిక మార్కెట్‌ నుంచి కంపెనీలు 10 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.75000 కోట్లు) సమీకరించాయి. గత మూడేళ్లతో పోలిస్తే ఈ మొత్తం అధికం కావడం గమనార్హం. వచ్చే 12-24 నెలల్లో ఐపీఓల జోరు కొనసాగవచ్చని, కొత్తగా ఏర్పడుతున్న యూనికార్న్‌లు, నమోదిత సంస్థలపై అంచనాలు ఇందుకు తోడ్పడతాయని గోల్డ్‌మన్‌ శాక్‌ వెల్లడించింది. ఇంటర్నెట్‌ వినియోగం, ప్రైవేట్‌ మూలధన లభ్యత పెరగడం, అనుకూల పరిస్థితులు వంటి అంశాలతో గత కొన్నేళ్లలో భారత్‌లో యూనికార్న్‌ల (100 కోట్ల డాలర్ల విలువ కలిగిన సంస్థలు) సంఖ్య బాగా పెరిగిందని తెలిపింది. ప్రస్తుతం 3.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న భారత మార్కెట్‌ విలువ.. 2024 నాటికి 5 లక్షల కోట్ల డాలర్లకు చేరొచ్చని పేర్కొంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని