జులైలో కొత్తగా జతయిన ఈపీఎఫ్‌ఓ చందాదార్లు 14.65 లక్షలు
close

Published : 21/09/2021 04:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జులైలో కొత్తగా జతయిన ఈపీఎఫ్‌ఓ చందాదార్లు 14.65 లక్షలు

దిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) గత జులైలో కొత్తగా 14.65 లక్షల మంది నికర చందాదార్లను జత చేసుకున్నట్లు వెల్లడించింది. జూన్‌లో 12.83 లక్షల మంది జతయినట్లు గత నెలలో ఈపీఎఫ్‌ఓ పేర్కొనగా, ఇప్పుడు దాన్ని 11.15 లక్షలకు సవరించింది. మేలో 6.57 లక్షల మంది, ఏప్రిల్‌లో 8.9 లక్షల మందిని కొత్తగా నమోదు చేసుకున్నట్లు తెలిపింది. కొవిడ్‌-19 రెండో దశ ఈ ఏడాది ఏప్రిల్‌ మధ్య నుంచి ప్రారంభం కావడంతో కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ పరిమితులు విధించాయని, దీంతో ఉద్యోగాల కల్పన తగ్గిందని, జూన్‌ నుంచి మళ్లీ కొత్త నమోదులు ఊపందుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఈపీఎఫ్‌ఓ వివరించింది.


రాడిసన్‌ మరో 10 హోటళ్లు

దిల్లీ: ఆతిథ్య సేవల దిగ్గజం రాడిసన్‌ హోటల్‌ గ్రూప్‌, ఈ ఏడాది చివరకు దేశంలో మరో 10 కొత్త హోటళ్లు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో రాడిసన్‌ భోపాల్‌ను ప్రారంభించడం ద్వారా భారత్‌లో 100 హోటళ్ల మైలురాయిని సంస్థ అందుకుంది. ఈ ఏడాది 3 రిసార్టులతో పాటు 6 హోటళ్లను ప్రారంభించామని, ఏటా 12- 15 హోటల్‌ ఒప్పందాలు, 10-12 హోటల్‌ ప్రారంభాలతో వృద్ధి దిశగా అడుగులు వేస్తామని రాడిసన్‌ హోటల్‌ గ్రూప్‌ దక్షిణాసియా ఎండీ, ఉపాధ్యక్షుడు జుబిన్‌ సక్సేనా తెలిపారు. ఈ ఏడాది రాడిసన్‌ బ్లూ రిసార్ట్‌ విశాఖపట్నం, రాడిసన్‌ బరేలీ, క్లాసిక్‌ గ్రాండే ఇంఫాల్‌, రాడిసన్‌ బ్లూ రిసార్ట్‌ ధర్మశాల, రాడిసన్‌ రిసార్ట్‌ అండ్‌ స్పా లోనావాలా, రాడిసన్‌ భోపాల్‌ హోటళ్లను ప్రారంభించామని పేర్కొన్నారు. త్వరలో రాడిసన్‌ రెడ్‌ చండీగఢ్‌, మొహాలీతో రాడిసన్‌ రెడ్‌ హోటళ్లను మొదలుపెడుతున్నట్లు వివరించారు.


జంక్‌ ఫుడ్స్‌ నియంత్రణకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రణాళికలు

దిల్లీ: దేశంలో జంక్‌ ఫుడ్‌ అధిక వినియోగంతో యువత, పిల్లల్లో స్థూలకాయం పెరుగుతున్న నేపథ్యంలో వీటి నియంత్రణకు ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రణాళికలు రూపొందించింది. వినియోగదారులు ఆరోగ్యకర ఆహారాన్ని ఎంపికచేసుకునేందుకు వీలుగా ప్యాకేజ్డ్‌ ఆహార వస్తువులపై ఫ్రంట్‌ ఆఫ్‌ ప్యాకేజీ (ఎఫ్‌ఓపీ) లేబులింగ్‌ను పరిచయం చేసే ఆలోచన ఉన్నట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈఓ అరుణ్‌ సింఘాల్‌ పేర్కొన్నారు. వినియోగదారుల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకుని ఎఫ్‌ఓపీ లేబుల్స్‌ సర్వే నిర్వహించాల్సిందిగా ఐఐఎం అహ్మదాబాద్‌ను కోరినట్లు వెల్లడించారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 15వ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. సాధారణంగా పోషకాహార సమాచారం ప్యాకేజీలకు వెనుక లేదా పక్కన ఉంటుంది. ఎఫ్‌ఓపీ లేబుళ్లలో మరింత మెరుగైన స్థానంలో ఈ సమాచారాన్ని అందిస్తారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని