అమెజాన్‌ న్యాయ సేవల వ్యయం రూ.8,546 కోట్లు
close

Published : 22/09/2021 03:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెజాన్‌ న్యాయ సేవల వ్యయం రూ.8,546 కోట్లు

సీబీఐ దర్యాప్తునకు కెయిట్‌ డిమాండ్‌

దిల్లీ: అమెరికాకు చెందిన ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, భారత్‌లో కార్యకలాపాలు కొనసాగించేందుకు, వ్యాపార అవకాశాలు నిలబెట్టుకునేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 2018-20 మధ్య 120 కోట్ల డాలర్ల (సుమారు రూ.8,546 కోట్లు) మేర న్యాయ సేవల కోసం వెచ్చించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. అమెజాన్‌ న్యాయ ప్రతినిధులు భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారంటూ సోమవారం మార్నింగ్‌ కాన్‌టెక్ట్స్‌ నివేదిక పేర్కొన్న నేపథ్యంలో అమెజాన్‌ తమ న్యాయ ప్రతినిధులపై అంతర్గత దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక వ్యక్తిని దీర్ఘకాలిక సెలవుపై పంపినట్లు సమాచారం. లంచం ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, దీనిపై దర్యాప్తు చేసి సరైన చర్య తీసుకుంటామని, అవినీతిని ప్రోత్సహించే ఉద్దేశం తమ సంస్థకు లేదని అమెజాన్‌ తేల్చిచెప్పింది. దేశీయ వ్యాపారుల సమాఖ్య కాయిట్‌ ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని వాణిజ్య మంత్రి పీయూశ్‌ గోయల్‌కు లేఖ రాసింది. ఫ్యూచర్‌ గ్రూప్‌-రిలయన్స్‌ ఒప్పందంపై అమెజాన్‌ న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. పోటీ చట్టం ఉల్లంఘన, ధరల్లో వ్యత్యాసం, విక్రేతల ప్రిఫరెన్షియల్‌ ఎంపిక తదితర విషయాల్లో కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) దర్యాప్తును కూడా సంస్థ ఎదుర్కొంటోంది.


మహిళా వ్యాపారవేత్తలకు డిజిటల్‌ నైపుణ్యాలపై శిక్షణ

ఈనాడు, హైదరాబాద్‌: మహిళా వ్యాపారవేత్తలకు డిజిటల్‌ నైపుణ్యాలు, ఆర్థిక అక్షరాస్యత తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు నాస్కామ్‌ ఫౌండేషన్‌, డిజిటల్‌ చెల్లింపుల సంస్థ వీసా ఉమ్మడిగా డిజిసాక్షర్‌ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాయి. తెలంగాణ, కర్ణాటకతో పాటు మరో మూడు రాష్ట్రాల్లోని మహిళా వ్యాపారవేత్తలకు ఈ శిక్షణ అందనుంది. కొవిడ్‌-19 కారణంగా 70శాతానికి పైగా మహిళా వ్యాపారవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారికి మద్దతు అందించడంతో పాటు, నైపుణ్యాభివృద్ధికి ఈ కార్యక్రమం దోహదం చేయనుందని నాస్‌కామ్‌ తెలిపింది. వ్యాపారాలను ఆన్‌లైన్‌కు మార్చడం, పన్నుల నిర్వహణ, నగదు రహిత లవాదేవీలను చేయడం, అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనాలు పొందడం తదితర అంశాల్లో శిక్షణ ఉంటుంది. ఎంపిక చేసిన మహిళా వ్యాపారవేత్తలకు ఆన్‌లైన్‌లో జరిగే ఈ శిక్షణకు అవసరమైన మొబైల్‌ ఫోను తదితరాలను అందిస్తారు. డిజిసాక్షర్‌.ఆర్గ్‌ అనే వెబ్‌సైటులో ఈ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని