సంక్షిప్త వార్తలు
close

Updated : 22/09/2021 05:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్త వార్తలు

పీఎఫ్‌సీకి మహారత్న హోదా!

ఈనాడు, దిల్లీ: నవరత్న సంస్థల్లోని పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ)కు కేంద్ర ప్రభుత్వం మహారత్న హోదా కట్టబెట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు కేంద్ర అంతర్‌మంత్రిత్వశాఖల బృందం పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఈ హోదా అమల్లోకి వస్తే ఈ సంస్థ ఇక ముందు ఒక్క ప్రాజెక్టులో రూ.5000 కోట్లు కానీ, తన నికర విలువలో 15 శాతానికి సమానమైన మొత్తాన్ని కానీ పెట్టుబడి పెట్టడానికి వీలవుతుంది. ఇతర సంస్థల విలీనం, స్వాధీనం లాంటి ప్రక్రియ చేపట్టడానికి మార్గం సుగమం అవుతుంది. దేశంలో అతిపెద్ద బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)గా గుర్తింపుపొందిన పీఎఫ్‌సీకి మహారత్న హోదా కట్టబెట్టడానికి అంతర్‌మంత్రిత్వశాఖల బృందం ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో, ఆ అంశాన్ని అధికారికంగా ప్రకటిస్తూ 10 రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదలయ్యే సూచనలున్నాయి. ఇప్పటివరకు దేశంలో భెల్‌, కోల్‌ ఇండియా, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌కార్పొరేషన్‌, సెయిల్‌, గెయిల్‌, ఇండియన్‌ఆయిల్‌ కార్పొరేషన్లకు మాత్రమే మహారత్న హోదా ఉంది. పీఎఫ్‌సీకి ఆ హోదా కట్టబెడితే అది 11వ సంస్థ అవుతుంది.


టీఎం ఫోరంలో చేరిన సైయెంట్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ సేవల సంస్థ సైయెంట్‌ అంతర్జాతీయ డిజిటల్‌ వ్యాపార సంస్థల సమాఖ్య టీఎం ఫోరంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫలితంగా సైయెంట్‌ అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు వీలు ఏర్పడనుంది. అధునాతన సాంకేతికతలైన ఫ్యూచర్‌-ఫిట్‌ కనెక్టివిటీ, అటానమస్‌ ఆపరేషన్స్‌ తదితరాలకు సంబంధించి సైయెంట్‌ తన అనుభవాన్ని జోడించి, ఇతర సంస్థలకు సేవలు అందించే వీలు ఏర్పడుతుందని సంస్థ గ్లోబల్‌ హెడ్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రభాకర్‌ అల్ట తెలిపారు.


వాణిజ్య వాహనాలు 2% ప్రియం
1 నుంచి అమల్లోకి: టాటా మోటార్స్‌

దిల్లీ: వాణిజ్య వాహన ధరలను అక్టోబరు 1 నుంచి 2 శాతం మేర పెంచబోతున్నట్లు టాటా మోటార్స్‌ మంగళవారం వెల్లడించింది. ఉక్కు, విలువైన లోహాల ధరలు పెరుగుతుండటంతో లాభదాయకతపై ఆ ప్రభావం పడుతోందని, అందుకే వాహన ధరలు పెంచుతున్నామని టాటా మోటార్స్‌ వివరించింది. మోడల్‌, వాహనం ఆధారంగా ధరల పెంపు ఉంటుంది. ట్రక్కులు, బస్సులు, తేలికపాటి వాణిజ్య వాహనాలను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) కూడా ఈ నెల ప్రారంభం నుంచి సెలెరియో మినహా మిగతా అన్ని వాహనాలపై 1.9 శాతం వరకు ధరలు పెంచిన సంగతి తెలిసిందే. ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్‌ ఈ ఏడాదిలో 3 సార్లు ఉత్పత్తుల ధరలు పెంచింది.


హెచ్‌డీఎఫ్‌సీ గృహరుణ వడ్డీ రేటు 6.7%

దిల్లీ: గృహరుణ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీ రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పండగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని, ఇప్పటికే ఎస్‌బీఐ సహా పలు బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. ఈ కోవలోనే హెచ్‌డీఎఫ్‌సీ కూడా వడ్డీ రేటును తగ్గించి, 6.7శాతానికి రుణాన్ని అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ రేటుకు రుణం రావాలంటే.. క్రెడిట్‌ స్కోరు కనీసం 800 పాయింట్లు ఉండాలి. కొంతకాలంగా ఇళ్ల ధరలు అందుబాటులోకి వచ్చాయని, గృహరుణ రేట్లు తక్కువగా ఉండటం కలిసి వస్తోందని  హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రేణు సూద్‌ కర్నాడ్‌ పేర్కొన్నారు.  


ఇంటికే మొబైల్‌ సిమ్‌ కార్డులు
ఆధార్‌, డిజిలాకర్‌ సహకారం

దిల్లీ: వినియోగదారులు ఆన్‌లైన్‌లో కొత్త మొబైల్‌ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకుని, ఇంటికే సిమ్‌ కార్డు పొందే సౌలభ్యాన్ని కల్పిస్తూ టెలికమ్యూనికేషన్ల విభాగం (డాట్‌) మంగళవారం ఆదేశాలు జారీచేసింది.  ఇందుకు ఆధార్‌ లేదా డిజిలాకర్‌లో భద్రపరిచిన పత్రాల ద్వారా ధ్రువీకరణ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 15న కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన టెలికాం సంస్కరణల్లో భాగంగా డాట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధల ప్రకారం.. మొబైల్‌ కనెక్షన్‌ పొందేందుకు అవసరమైన ఆధార్‌ ఆధారిత ఇ-కేవైసీ ధ్రువీకరణ ప్రక్రియకు వినియోగదారులు రూ.1 చెల్లించాలి. ఆధార్‌ ఇ-కేవైసీ ప్రక్రియను మళ్లీ తెచ్చేందుకు 2019 జులైలో భారత టెలికాం చట్టం 1885ను ప్రభుత్వం సవరించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని