చేతులు మారనున్న కేకేఆర్‌ వాటా?
close

Published : 23/09/2021 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చేతులు మారనున్న కేకేఆర్‌ వాటా?

రాంకీ ఎన్విరో ఇంజనీర్స్‌ కొత్త యజమానులుగా తమసేక్‌ హోల్డింగ్స్‌, బ్రూక్‌ఫీల్డ్‌

ఈనాడు, హైదరాబాద్‌: వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టుల రూపకల్పనలో నిమగ్నమైన హైదరాబాదీ సంస్థ రాంకీ ఎన్విరో ఇంజనీర్స్‌లో కేకేఆర్‌ హోల్డింగ్స్‌ నుంచి మెజార్టీ వాటాను సింగపూర్‌కు చెందిన తమసేక్‌ హోల్డింగ్స్‌, కెనడా సంస్థ అయిన బ్రూక్‌ఫీల్డ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కొనుగోలు చేయబోతున్నాయని తెలిసింది. దాదాపు 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.7500 కోట్ల) సంస్థాగత విలువ ప్రకారం ఈ లావాదేవీ జరగనుందనే చర్చ మార్కెట్‌ వర్గాల్లో  జరుగుతోంది. రాంకీ గ్రూపు వ్యవస్థాపకుడైన ఎ.అయోధ్య రామిరెడ్డి నుంచి రెండేళ్ల క్రితం రాంకీ ఎన్విరో ఇంజనీర్స్‌లో 60 శాతం వాటాను అమెరికాకు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ- కేకేఆర్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాంకీ ఎన్విరో వ్యాపార కార్యకలాపాలు బాగా విస్తరించాయి. ఈ నేపథ్యంలో పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) చేపట్టి, కొంతమేరకు తన వాటా విక్రయించాలని ఇటీవల కేకేఆర్‌ భావించింది. అందుకు తగిన సన్నాహాలు కూడా చేపట్టింది. కానీ తాజాగా తన ఆలోచన మార్చుకుని, తన వాటా మొత్తాన్ని ఇతర ప్రైవేట్‌ ఈక్విటీ పెట్టుబడి సంస్థలకు ఇచ్చి, సంస్థ నుంచి బయటకు వెళ్లిపోయే యత్నాల్లో నిమగ్నమైనట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కేకేఆర్‌ వాటాను కొనుగోలు చేసేందుకు తమసేక్‌ హోల్డింగ్స్‌, బ్రూక్‌ఫీల్డ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ ముందుకు వచ్చినట్లు, ఈ సంస్థలు కేకేఆర్‌తో సంప్రదింపుల్లో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని పెట్టుబడి సంస్థలు సైతం రాంకీ ఎన్విరో ఇంజనీర్స్‌లో వాటా కొనుగోలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. త్వరలో ఈ లావాదేవీ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. రాంకీ ఎన్విరో ఇంజనీర్స్‌ మనదేశంతో పాటు యూఏఈ, సింగపూర్‌, సౌదీ అరేబియా, ఖతార్‌, కువైట్‌, ఒమన్‌, టాంజానియా... తదితర దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని