ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వాటాకు రూ.645 కోట్లు
close

Published : 23/09/2021 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వాటాకు రూ.645 కోట్లు

గంగవరం పోర్టు కొనుగోలు ప్రక్రియ పూర్తి

అదానీ పోర్ట్స్‌లో విలీనం

ఈనాడు, హైదరాబాద్‌: గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటాను రూ.645 కోట్లకు సొంతం చేసుకున్నట్లు అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. దీంతో గంగవరం పోర్టును పూర్తిగా సొంతం చేసుకున్నట్లు అవుతోందని బుధవారం ఒక ప్రకటనలో అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ తెలియజేసింది. గంగవరం పోర్టును అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌లో విలీనం చేయనున్నారు. ఈ ప్రతిపాదనకు రెండు కంపెనీల డైరెక్టర్ల బోర్డులు ఆమోదముద్ర వేశాయి. దీని ప్రకారం గంగవరం పోర్టు వాటాదార్లకు ప్రతి 1,000 షేర్లకు, 159 అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ షేర్లను కేటాయిస్తారు. గంగవరం పోర్టులో ప్రమోటర్లు అయిన డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబానికి 58.1 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే. ఈ విలీనం ఫలితంగా ఇదే నిష్పత్తిలో డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబానికి అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ షేర్లు కేటాయిస్తారు. దీని ప్రకారం డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబానికి 4.8 కోట్ల షేర్లు (అదానీ పోర్ట్స్‌లో 2.2% వాటా) లభిస్తాయి. అదానీ పోర్ట్‌ షేరు ధర ప్రస్తుతం స్టాక్‌మార్కెట్లో రూ.758 ధర పలుకుతోంది. ఇదే ధర ప్రకారం లెక్కిస్తే 4.8 కోట్ల షేర్ల విలువ రూ.3,604 కోట్ల వరకు ఉంటుంది. గంగవరం పోర్ట్‌లో వార్‌బర్గ్‌ పింకస్‌ సంస్థకు 31.5 శాతం వాటాను ఇంతకుముందే అదానీ పోర్ట్స్‌ కొనుగోలు చేసిన సంగతి విదితమే. ఈ లావాదేవీల ప్రకారం గంగవరం పోర్టుకు రూ.6200 కోట్ల విలువ లభించినట్లు అయ్యింది. దేశానికి తూర్పు తీరంలో విస్తరించడానికి గంగవరం పోర్టు ద్వారా తమకు అవకాశం దక్కిందని అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ సీఈఓ కరణ్‌ అదానీ అన్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని