సోనీ.. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ విలీనం
close

Published : 23/09/2021 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోనీ.. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ విలీనం

ఆమోదం తెలిపిన జీ బోర్డు

కొత్త సంస్థకు పునిత్‌ గోయెంకా సారథ్యం

సోనీ చేతిలోనే అధిక వాటా, మెజార్టీ బోర్డు సభ్యుల నియామకం

దిల్లీ: సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా (ఎస్‌పీఎన్‌ఐ), జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌  (జెడ్‌ఈఈఎల్‌)లు విలీనం కానున్నాయి. ఇందుకు సంబంధించిన విలీన ఒప్పందానికి జీ డైరెక్టర్ల బోర్డు సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు సంస్థల లీనియర్‌ నెట్‌వర్క్‌లు, డిజిటల్‌ ఆస్తులు, ప్రొడక్షన్‌ కార్యకలాపాలు, ప్రోగ్రామ్‌ లైబ్రరీలు ఒకే గొడుకు కిందకు రానున్నాయి. విలీనానంతరం ఏర్పడే సంస్థ దేశంలోనే అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్‌గా అవతరించే అవకాశం ఉందని చెబుతున్నారు. విలీన సంస్థకు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ పునిత్‌ గోయెంకా సారథ్యం వహించనున్నారు. దేశంలోని రెండు ప్రముఖ మీడియా వ్యాపారాల కలయికతో దేశవ్యాప్తంగా వినియోగదారులకు సినిమాల నుంచి క్రీడల వరకు కంటెంట్‌పరంగా ఎంతో ప్రయోజనం కలగనుందని ఎస్‌పీఎన్‌ఐ తెలిపింది.

ఏ సంస్థకు ఎంతెంత వాటా..

జెడ్‌ఈఈఎల్‌, ఎస్‌పీఎన్‌ఐకి సంబంధించి ప్రస్తుతమున్న ఈక్విటీ విలువ ప్రకారం.. విలీన నిష్పత్తి జెడ్‌ఈఈఎల్‌కు అనుకూలంగా 61.25% ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఒప్పందంలో భాగంగా ఎస్‌పీఎన్‌ఐ మాతృసంస్థ సోనీ పిక్చర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పెట్టుబడులు పెడుతుండటంతో.. ఎస్‌పీఎన్‌ఐ వద్ద 1.575 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.11,165 కోట్లు) నగదు నిల్వలు ఉండనున్నాయి. దీంతో ఈ పెట్టుబడుల అనంతరం కొత్త సంస్థలో మెజార్టీ వాటా ఎస్‌పీఎన్‌ఐకు దక్కనుంది. ఎస్‌పీఎన్‌ఐ వాటాదార్లకు విలీన నిష్పత్తి 52.93 శాతం, జెడ్‌ఈఈఎల్‌ వాటాదార్లకు 47.07 శాతంగా ఉంటుందని జెడ్‌ఈఈఎల్‌ తెలిపింది. జెడ్‌ఈఈఎల్‌ ఎండీ, సీఈఓ పునిత్‌ గోయెంకాను ఆ పదవుల నుంచి తొలగించాలని ఈ సంస్థలో ప్రధాన వాటాదార్లైన ఇన్వెస్కో, ఓఎఫ్‌ఐ గ్లోబల్‌ ఫండ్‌ ఎల్‌ఎల్‌సీలు ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ పదవుల నుంచి వైదొలిగి విలీనానంతర సంస్థ పగ్గాలను చేపట్టనున్నారు. విలీన సంస్థలోని బోర్డులో అధిక సభ్యులను నియమించే హక్కు సోనీకి రానుంది.

విలీనానంతర సంస్థ ఇలా..

* విలీనానంతర సంస్థకు 75 టీవీ ఛానళ్లు, 2 వీడియో స్ట్రీమింగ్‌ సేవలు (జీ5, సోని లివ్‌), రెండు ఫిల్మ్‌ స్టూడియోలు (జీ స్టూడియోస్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా), డిజిటల్‌ కంటెంట్‌ స్టూడియో (స్టూడియో నెక్ట్స్‌) ఉంటాయి. తద్వారా భారత్‌లోనే అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్‌ సంస్థగా ఇది అవతరిస్తుంది. ఈ విషయంలో స్టార్‌ అండ్‌ డిస్నీ ఇండియాను కూడా ఇది వెనక్కి నెట్టనుందని చెబుతున్నారు. ఉద్యోగుల సంఖ్య సుమారు 4,000 వరకు ఉండనుంది.


జీ షేర్లపై వారంలోనే ఝున్‌ఝున్‌వాలాకు 50% ప్రతిఫలం

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లను కొనుగోలు చేయడం ద్వారా వారం రోజుల్లోనే రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా 50 శాతం ప్రతిఫలం పొందారని ఓ ఆంగ్లపత్రిక పేర్కొంది. ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడుల సంస్థ రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ గత వారం జీ షేర్లను ఒక్కోటి రూ.220.40 చొప్పున 50 లక్షల షేర్లను రూ.110.20 కోట్లకు కొనుగోలు చేశారని పేర్కొంది. బుధవారం షేరు గరిష్ఠ ధరైన రూ.332.30ను పరిగణనలోకి తీసుకుంటే ఆయన పెట్టుబడి విలువ సుమారు 50 శాతం వరకు పెరిగి రూ.166.15 కోట్లకు చేరిందని వెల్లడించింది.Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని