వినియోగ కార్లకు హైదరాబాద్‌లో అధిక గిరాకీ
close

Published : 23/09/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వినియోగ కార్లకు హైదరాబాద్‌లో అధిక గిరాకీ

‘స్పిన్నీ’ పరిశీలనలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: వినియోగ కార్లకు గిరాకీ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఈ ధోరణి కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో ‘హ్యాచ్‌ బ్యాక్‌’ కార్లను వినియోగదార్లు ఇష్టపడుతున్నట్లు సెకండ్‌ హ్యాండ్‌ కార్ల విక్రయ సేవల సంస్థ ‘స్పిన్నీ’ పరిశీలనలో వెల్లడైంది. సగటున నెలకు 2,000 కు పైగా వినియోగ కార్లు చేతులు మారుతున్నట్లు ఈ సంస్థ పేర్కొంది. హైదరాబాద్‌లోని వినియోగదార్లు మారుతీ, హ్యూందాయ్‌ కంపెనీల ‘హ్యాచ్‌బ్యాక్‌’ మోడళ్లను సొంతం చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఎస్‌యూవీల్లో హ్యూందాయ్‌ క్రెటాకు అధిక ఆదరణ ఉంది. సెడాన్‌ కార్లలో హోండా సిటీ, మారుతీ సుజుకీ డిజైర్‌ను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఎక్కువమంది పెట్రోలు కార్లనే కోరుకుంటున్నారు. వినియోగ కార్లను కొనుగోలుచేసే వారిలో 25- 36 సంవత్సరాల వారే ఎక్కువగా ఉంటున్నారు.


హీరో ఎలక్ట్రిక్‌ లుధియానా ప్లాంట్‌ విస్తరణ

దిల్లీ: వచ్చే ఏడాది మార్చికి లూధియానా ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 5 లక్షల ద్విచక్ర వాహనాలకు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు హీరో ఎలక్ట్రిక్‌ వెల్లడించింది. తదుపరి ఏడాదికి 10 లక్షల వాహనాలు తయారు చేసేలా అభివృద్ధి చేస్తారు. విద్యుత్‌ ద్విచక్రవాహనాలకు పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దేశంలో కొవిడ్‌-19 రెండో దశ ఉద్ధృతి తగ్గాక విద్యుత్‌ వాహనాలకు గిరాకీ గణనీయంగా పెరిగిందని వివరించింది. సవరించిన ఫేమ్‌-2 పథకం, రాష్ట్రాల రాయితీలతో కంపెనీ విద్యుత్‌ స్కూటర్లు రూ.53,600 నుంచే లభిస్తున్నట్లు  హీరో ఎలక్ట్రిక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నవీన్‌ ముంజాల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం లుధియానా ప్లాంట్‌ సామర్థ్యం ఏడాదికి లక్ష వాహనాలుగా ఉంది.


విస్కీ ఎక్స్ఛేంజీ యూకే వ్యాపార విక్రయం

లండన్‌: భారత సంతతికి చెందిన లండన్‌ వ్యాపారవేత్తలు, సోదరులైన సుఖిందర్‌ సింగ్‌, రాజ్‌బీర్‌ సింగ్‌లు తమ స్పిరిట్స్‌ రిటైల్‌ వ్యాపారాన్ని ఫ్రెంచ్‌ బెవరేజెస్‌ దిగ్గజం పెర్నాడ్‌ రికార్డ్‌కు విక్రయించాలని నిర్ణయించారు. ఈ సోదరులు విస్కీ ఎక్స్ఛేంజీ పేరుతో స్పిరిట్స్‌ వ్యాపారాన్ని 1999లో ప్రారంభించారు. యూకేలోని అతి పెద్ద ఆన్‌లైన్‌ స్పిరిట్స్‌ రిటైలర్లలో ఈ సంస్థ కూడా ఒకటి. సుమారు 10,000 రకాల విస్కీలు, ఫైన్‌ స్పిరిట్స్‌ ఈ సంస్థ ప్రత్యేకత. ఈ కుటుంబ వ్యాపారానికి లండన్‌లోని కోవెంట్‌ గార్డెన్‌, గ్రేట్‌ పోర్ట్‌ల్యాండ్‌ స్ట్రీట్‌, లండన్‌ బ్రిడ్జి వద్ద 3 దుకాణాలున్నాయి. ‘20 ఏళ్లపాటు విస్కీ ఎక్స్ఛేంజీని నిర్మించాం. ఇప్పుడు పెర్నాడ్‌ రికార్డ్‌తో కలిసి మరింత ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాం. వారితో కలిసి వ్యాపారాన్ని తదుపరి దశకు చేరుస్తామ’ని సోదరులిద్దరూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని