సంక్షిప్త వార్తలు
close

Published : 25/09/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్త వార్తలు

టీకా ఔషధ పదార్థాల ఉత్పత్తి పెంపులో ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘కొవాగ్జిన్‌’ టీకాలో వినియోగించే ఔషధ పదార్థాలను ఈ సంవత్సరాంతం నుంచి ఎంతో అధికంగా ఉత్పత్తి చేయనున్నట్లు ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) వెల్లడించింది. ఈ ఔషధ పదార్థాలను భారత్‌ బయోటెక్‌కు ఈ సంస్థ అందిస్తోంది. ‘ఈ ఏడాది డిసెంబరు నుంచి ప్రతి నెలా ఒక కోటి డోసుల టీకాకు సరిపడా ఔషధ పదార్థాలను ఉత్పత్తి చేస్తాం’ అని ఐఐఎల్‌ పేర్కొంది. ప్రస్తుతం నెలకు 30 లక్షల టీకాకు అవసరమైన ఔషధ పదార్థాలను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. రికార్డు సమయంలో ఇంత పెద్దఎత్తున కొవాగ్జిన్‌ టీకా ఔషధ పదార్థాలను అందించడం ద్వారా ఐఐఎల్‌ తన సత్తా రుజువు చేసుకున్నట్లు అవుతోందని ఆ సంస్థ ఎండీ డాక్టర్‌ కె.ఆనంద్‌ కుమార్‌ వివరించారు.  తాము సొంతంగా కొవిడ్‌ టీకా అభివృద్ధి చేస్తున్నామని, దీన్ని వచ్చే ఏడాదిలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు.


జైకోవ్‌-డి టీకా ఔషధ పదార్థాల ఉత్పత్తికి శిల్ప మెడికేర్‌తో క్యాడిలా ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: క్యాడిలా హెల్త్‌కేర్‌కు చెందిన కరోనా టీకా ‘జైకోవ్‌-డి’ లో వినియోగించే ఔషధ పదార్థాలను హైదరాబాద్‌కు చెందిన శిల్ప మెడికేర్‌ ఉత్పత్తి చేయనుంది. దీని కోసం శిల్ప మెడికేర్‌ అనుబంధ కంపెనీ అయిన శిల్ప బయోలాజికల్స్‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని క్యాడిలా హెల్త్‌కేర్‌ బదిలీ చేస్తుంది. టీకా ఫిల్లింగ్‌/ ప్యాకింగ్‌/ పంపిణీ/ మార్కెటింగ్‌ బాధ్యతలను క్యాడిలా హెల్త్‌కేర్‌ నిర్వహిస్తుంది. డీఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానంతో  ‘జైకోవ్‌-డి’ టీకాను క్యాడిలా హెల్త్‌కేర్‌ ఆవిష్కరించింది. దీనికి గత నెలలో భారత  ఔషధ నియంత్రణ మండలి అత్యవసర అనుమతి మంజూరు చేసింది.


ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5.70 లక్షల కోట్లు

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు (ఏప్రిల్‌ 1- సెప్టెంబరు 22) ప్రత్యక్ష పన్ను వసూళ్లు 74 శాతం పెరిగి రూ.5.70 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ముందస్తు పన్ను, టీడీఎస్‌ చెల్లింపులు పెరగడం ఇందుకు దోహదపడింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లలోకి వ్యక్తిగత ఆదాయ, కార్పొరేట్‌ పన్నులు వస్తాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో పన్ను వసూళ్లు రూ.3.27 లక్షల కోట్లు, 2019-20లో రూ.4.48 లక్షల కోట్లుగా ఉన్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.6.45 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో నమోదైన రూ.4.39 లక్షల కోట్లతో పోలిస్తే ఇందులో 47 శాతం వృద్ధి కనిపించింది.

* ముందస్తు పన్ను ద్వారా రూ.2.53 లక్షల కోట్లు, మూలం వద్ద పన్ను (టీడీఎస్‌)తో రూ.3.19 లక్షల కోట్లు వసూలయ్యాయి. స్వీయ మదింపు పన్ను కింద రూ.41,739 కోట్లు, సాధారణ మదింపు పన్ను కింద రూ.25,558 కోట్లు, డివిడెండ్‌ పంపిణీ పన్ను కింద రూ.4406 కోట్లు, ఇతర పన్నులతో రూ.1383 కోట్లు ఖజానాకు చేరాయి.


ఐపీఓకి ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఏఎంసీ
సమీకరణ లక్ష్యం రూ.2,768 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: మ్యూచువల్‌ ఫండ్లను నిర్వహించే ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఏఎంసీ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి రానుంది. ఆదిత్య గ్రూపు, కెనడాకు చెందిన సన్‌ లైఫ్‌ ఏఎంసీ ఉమ్మడి భాగస్వామ్య సంస్థ ఇది. ఈ ఐపీఓ ద్వారా సంస్థ మొత్తం రూ.2,768.3 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 1 వరకు జరగనున్న ఐపీఓలో షేర్ల ధరల శ్రేణిని రూ.695 - రూ.712గా నిర్ణయించింది. కనీసం 20 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం షేర్లు 3.88 కోట్లు ఉండగా.. ఇవన్నీ ఆఫర్‌ ఫర్‌ సేల్‌గానే ఉండనున్నాయి. ఆదిత్య బిర్లా క్యాపిటల్‌కు చెందిన 28.51 లక్షల ఈక్విటీ షేర్లు, సన్‌ లైఫ్‌ ఏఎంసీకి చెందిన 3.6 కోట్లు ఇందులో ఉండనున్నాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని