60000
close

Updated : 25/09/2021 08:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

60000

సరికొత్త శిఖరాన సెన్సెక్స్‌
2021-22లో ప్రధాన షేర్లలో 35 శాతం వృద్ధి
మరో 2-3 ఏళ్లు పరుగేనంటున్న విశ్లేషకులు
దిద్దుబాటుకూ అవకాశం ఉంటుందని హెచ్చరిక

చినుకులు కాస్తా జడివాన అయినట్లు..
ఒక్క అడుగు కాస్తా వేల మైళ్లు అయినట్లు..
రూపాయి కాస్తా లక్షల కోట్లు అయినట్లు..
మన ‘బుల్‌’ అబ్బాయి సెన్సెక్స్‌ పయనం కూడా నెమ్మదిగా మొదలై.. శరవేగాన్ని పుంజుకుంటోంది.
బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1000 పాయింట్ల నుంచి 30,000 పాయింట్లకు చేరడానికి పాతికేళ్ల సమయం పడితే.. అక్కడి నుంచి మరో 30,000 పాయింట్ల సాధించడానికి కేవలం ఆరేళ్లే పట్టింది.
మదుపర్ల సంపద 20 ఏళ్లలో రూ.6 లక్షల కోట్ల నుంచి రూ.261.18 లక్షల కోట్లకు చేరింది.

సెన్సెక్స్‌ 50,000 పాయింట్ల నుంచి 60,000 పాయింట్లకు చేరేందుకు 166 ట్రేడింగ్‌ రోజులు మాత్రమే పట్టాయి. సూచీ అత్యంత వేగంగా 10,000 పాయింట్లను అధిగమించిన కాలమిది. ఇంతకుముందు సగటున 931 ట్రేడింగ్‌ రోజులు పట్టింది.

సెన్సెక్స్‌ 50 వేల పాయింట్ల నుంచి 60 వేలకు చేరడంలో ఇన్ఫోసిస్‌ (30 శాతం), రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (19 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్‌ (30 శాతం), భారతీ ఎయిర్‌టెల్‌ (25 శాతం) ప్రధాన పాత్ర పోషించాయి.

2020 మార్చి నాటి కనిష్ఠ స్థాయి 25638 పాయింట్లతో పోలిస్తే, ఇప్పటికి సెన్సెక్స్‌ 135 శాతం పెరిగింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్‌ షేర్లు 35 శాతానికి పైగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 శాతానికి పైగా వృద్ధి చెందుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

2022 జూన్‌కు సెన్సెక్స్‌ 70,000 పాయింట్లకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

దుపర్లకు ఈ ఏడాది దీపావళి పండగ ముందే వచ్చింది. చరిత్రలోనే తొలిసారిగా సెన్సెక్స్‌ 60,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించడంతో ఆనంద టపాసులు గట్టిగా పేలాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నా.. స్టాక్స్‌ విలువలు ఇప్పటికే గరిష్ఠానికి చేరాయని పేర్కొంటున్నా, అవేవీ ‘బుల్‌’ పరుగును ఆపలేకపోయాయి.

31 ఏళ్ల పయనమిలా
1990 జులై 25న 1000 పాయింట్లకు చేరిన సెన్సెక్స్‌ ఆ తర్వాత 10 వేలు, 20 వేలు.. ఇలా మైలురాళ్లనూ దాటుకుంటూ 60,000 పాయింట్లకు చేరడానికి 31 ఏళ్లకు పైగా సమయం పట్టింది.  2020 మార్చిలో కొవిడ్‌ ప్రబలి భారీ ఎదురు దెబ్బ తగిలినా, కరోనా ఛాయలు ఇంకా పూర్తిగా తొలగిపోకపోయినా.. సెన్సెక్స్‌ తాజా రికార్డులు సృష్టించగలిగింది. గత 18 నెలల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన మన స్టాక్‌మార్కెట్‌ మదుపర్లకు  ఉత్సాహాన్ని నింపింది.

ఇవి అడ్డుకోలేకపోయాయ్‌..
1000 పాయింట్ల నుంచి 60,000 పాయింట్ల పయనంలో మార్కెట్‌ ఎన్నో సంక్షోభాలను తట్టుకుని నిలబడింది. హర్షద్‌ మెహతా కుంభకోణం(1992), ముంబయి, బీఎస్‌ఈ భవనాల్లో పేలుళ్లు(1993), కార్గిల్‌ యుద్ధం(1999), అమెరికా, భారత పార్లమెంటుపై ఉగ్రదాడులు(2001), సత్యం కుంభకోణం, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, పెద్ద నోట్ల రద్దు, పీఎన్‌బీ కుంభకోణం.. ఇలా చిన్నాపెద్దా అడ్డంకులను ఎన్నో ఎదుర్కొంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో కమొడిటీ బూమ్‌, అంతర్జాతీయ ద్రవ్య లభ్యత, కరోనా టీకాలకు అనుమతులు వేగంగా రావడం వంటివన్నీ మార్కెట్‌ను రక్షించాయి.


ఇది ఆరంభమే

చ్చే అయిదేళ్లలో సెన్సెక్స్‌ 60000 పాయింట్లకు చేరొచ్చని 2019 మేలోనే అంచనా వేశాం. కానీ అయిదేళ్లకు బదులు రెండున్నరేళ్లలోనే సెన్సెక్స్‌ చరిత్ర సృష్టించింది. అయితే 60000 పాయింట్లకు చేరడం ముగింపు కాదు.. ఆరంభం మాత్రమే. భారత స్టాక్‌ మార్కెట్‌ గాలి బుడగ అని గత 42 ఏళ్లుగా చెబుతున్నారు. ఇది వాస్తవం కాదని ఇప్పుడు తేలిపోయింది.

- బీఎస్‌ఈ సీఈఓ ఆశిష్‌ చౌహాన్‌


ప్రారంభం లోనే రికార్డు..

శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 60,158.76 స్థాయికి చేరింది. ఒక దశలో 60,333 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్నాహ్నం తర్వాత 60,000కు దిగువగా వచ్చినా.. చివరకు మాత్రం 60,048.47 వద్ద ముగిసింది. అంతక్రితం ముగింపుతో పోలిస్తే 163.11 పాయింట్ల లాభాన్ని ఇచ్చింది.  నిఫ్టీ సైతం 30.25 పాయింట్ల లాభంతో 17,853.20 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ షేర్లలో 12 రాణించగా..14 నష్టాల పాలయ్యాయి. సన్సేరా ఇంజినీరింగ్‌ నమోదు రోజున ఇష్యూ ధర రూ.744తో పోలిస్తే బీఎస్‌ఈలో 9% అధికంగా రూ.811.35 వద్ద నమోదైనా,10.04% లాభంతో రూ.818.70 వద్ద ముగిసింది.


ఇక నిఫ్టీ రికార్డుపై దృష్టి

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 60,000 పాయింట్లను అధిగమించడంతో, ఇక మదుపరుల దృష్టి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మీద పడింది. నిఫ్టీ ప్రస్తుతం 17853 పాయింట్ల వద్ద ఉంది. త్వరలో ఇది 18000 పాయింట్ల మార్కును అధిగమిస్తుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిఫ్టీ 18200 పాయింట్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నాయి. కానీ సెన్సెక్స్‌ సరికొత్త రికార్డు సాధించిన నేపథ్యంలో మదుపరులు ముందు జాగ్రత్తగా కొంతమేరకు లాభాల స్వీకరణకు మొగ్గుచూపే అవకాశం ఉంది. అందువల్ల స్వల్పకాలంలో సూచీలు ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది.

సమీప భవిష్యత్తులో స్టాక్‌మార్కెట్‌పై ప్రభావం చూపే అంశాల్లో...

* అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయాలతో పాటు ద్రవ్యోల్బణం, చైనా ప్రభుత్వ నిర్ణయాలు, వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల విషయంలో తీసుకునే వైఖరి ప్రధానమైనవి.

* ఈ ఏడాది నవంబరు నుంచి బాండ్ల కొనుగోలు తగ్గించనున్నట్లు, వచ్చే ఏడాది నుంచి వడ్డీ రేట్లు పెంచనున్నట్లు యూఎస్‌ఫెడ్‌ తాజాగా స్పష్టం చేసింది. దీనికి స్పందనగా యూఎస్‌లో బాండ్ల రేట్లు స్వల్పంగా పెరిగాయి. కానీ స్టాక్‌మార్కెట్లు పెద్దగా స్పందించలేదు. వాస్తవానికి ఇది  మార్కెట్లను ఒత్తిడికి గురిచేసే ప్రతిపాదనలు. 

* చైనాలో రెండో అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ- ఎవర్‌గ్రాండ్‌ అప్పుల పాలు కావడాన్ని మార్కెట్‌ పెద్దగా పట్టించుకోలేదు. దాన్ని చైనా వరకూ పరిమితమైన అంశంగా భావించారు. పెట్టుబడుల ప్రవాహం అధికంగా ఉన్నందున స్టాక్‌మార్కెట్లు ప్రస్తుతానికి స్పందించలేదని, కానీ వచ్చే రెండు మూడు నెలల్లో యూఎస్‌ఫెడ్‌ నిర్ణయం మార్కెట్‌పై ప్రభావం చూపుతుందనేది ఎక్కువ మంది విశ్లేషణ.

* ‘కరోనా’ మూడో దశ ముప్పు తలెత్తుతుందనే భయాలు నిన్నమొన్నటి వరకూ అధికంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ ముప్పు చాలా వరకు తప్పిపోయిందనే విశ్వాసం ఏర్పడింది. కానీ అనుకోకుండా మళ్లీ కొవిడ్‌ మహమ్మారి విస్తరిస్తే స్టాక్‌మార్కెట్లపై ఒత్తిడి పెరగడం ఖాయం.

* మనదేశానికి సంబంధించినంత వరకూ ప్రభుత్వ చర్యలు, కమొడిటీస్‌ (ముడి చమురు, ఇనుము, ఇతర లోహాలు, ఆహార పదార్థాలు) ధరలు, వృద్ధి గణాంకాలు, లోటు, పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ, ఆర్‌బీఐ నిర్ణయాలు మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయి.

* 2003-07 తరహా బుల్‌ మార్కెట్‌లో ఉన్నామని.. ఇది మరో 2-3 ఏళ్లు కొనసాగొచ్చని విశ్లేషకులు  అంటున్నారు. అయితే ఊగిసలాటలుంటాయని అంచనా వేస్తున్నారు.

- ఈనాడు, హైదరాబాద్‌.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని