కేజీ నిక్షేపంలో రెండో బావి నుంచి ఉత్పత్తి ప్రారంభం: ఓఎన్‌జీసీ
close

Published : 25/09/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేజీ నిక్షేపంలో రెండో బావి నుంచి ఉత్పత్తి ప్రారంభం: ఓఎన్‌జీసీ

దిల్లీ: కేజీ బేసిన్‌ నిక్షేపంలో రెండో బావి నుంచి ఉత్పత్తి ప్రారంభించినట్లు ఓఎన్‌జీసీ ఛైర్మన్‌ సుభాశ్‌ కుమార్‌ వెల్లడించారు. బంగాళాఖాతంలో ఉన్న కృష్ణ గోదావరి బేసిన్‌లో 5 బిలియన్‌ డాలర్ల కేజీ- డీడబ్ల్యూఎన్‌- 98/2 ప్రాజెక్టు నుంచి మొదటిసారి గతేడాది జూన్‌లో ఓఎన్‌జీసీ గ్యాస్‌ ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత కొవిడ్‌-19 పరిణామాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ఈ ప్రాజెక్టులో ఉత్పత్తిని పెంచింది. ‘కేజీ- డీడబ్ల్యూఎన్‌-98/2 బ్లాక్‌ కస్టర్‌-2లోని యూ1బీ బావి నుంచి ఆగస్టు 31, 2021న ఉత్పత్తిని ప్రారంభించామ’ని ఓఎన్‌జీసీ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదార్లకు కుమార్‌ తెలియజేశారు. భారత్‌లోనే అతిపెద్ద సబ్‌సీ ప్రాజెక్టుగా భావిస్తున్న బ్లాక్‌ 98/2 గరిష్ఠంగా రోజుకు 16 మిలియన్‌ మెట్రిక్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌, 80000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేయొచ్చని కంపెనీ భావిస్తోంది. ఇందులో మొత్తంగా 34 బావులను తవ్వాలని కంపెనీ యోచన చేస్తుంది. వీటిలో 15 చమురు ఉత్పత్తి బావులు కాగా.. ఎనిమిది గ్యాస్‌ ఉత్పత్తి బావులు. అయితే ఈ ప్రాజెక్టు గరిష్ఠ ఉత్పత్తి స్థాయికి ఎప్పటి వరకు చేరుకుంటుందనే విషయాన్ని కుమార్‌ వెల్లడించలేదు.


స్పెక్ట్రమ్‌ ధర, పరిమాణంపై అభిప్రాయాలు చెప్పండి

ట్రాయ్‌ను కోరిన డాట్‌

దిల్లీ: 5జీ స్పెక్ట్రమ్‌ వేలం కోసం టెలికాం విభాగం (డాట్‌) సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా స్పెక్ట్రమ్‌ ధర, పరిమాణం, పలు బ్యాండ్‌లలో రేడియో తరంగాలకు సంబంధించిన అంశాలపై సిఫారసులు చేయాల్సిందిగా టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ను డాట్‌ కోరింది. ఈ ఏడాది మార్చిలో చేపట్టిన వేలంలో రూ.77800 కోట్ల విలువైన 855.6 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను విక్రయించారు. 5జీ స్పెక్ట్రమ్‌ వేలంపై డాట్‌ నుంచి సూచనలు వచ్చాయని ట్రాయ్‌ కార్యదర్శి వి.రఘునందన్‌ స్పష్టం చేశారు. అయితే వాటిని వెల్లడించేందుకు నిరాకరించారు. పలు రకాల బ్యాండ్‌లకు సంబంధించి సూచనలు వచ్చాయని, ట్రాయ్‌ అవసరమైతే అదనపు సమాచారం కోరుతుందని అన్నారు. అంచనాలు అందుకోవడానికి శాయసక్తులా కృషి చేస్తామని పేర్కొన్నారు. రిజర్వు ధర, బ్లాక్‌ పరిమాణం, బ్యాండ్‌ ప్లాన్‌, వేలం వేయాల్సిన స్పెక్ట్రమ్‌ పరిమాణం వంటి వాటిపై అభిప్రాయాలు కోరినట్లు సంబంధిత వర్గాల సమాచారం.


10000 ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు మాసివ్‌ మొబిలిటీతో హీరో ఎలక్ట్రిక్‌ జట్టు

దిల్లీ: ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 10000 ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు విద్యుత్‌ వాహనాల అంకుర సంస్థ మాసివ్‌ మొబిలిటీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు హీరో ఎలక్ట్రిక్‌ ప్రకటించింది. అన్ని విద్యుత్‌ వాహనాలు వినియోగించుకునేలా ఈ ఛార్జింగ్‌ స్టేషన్‌ల నెట్‌వర్క్‌ ఉంటుందని తెలిపింది. ఈ భాగస్వామ్యం ద్వారా దేశంలో ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాల విస్తరణ, విద్యుత్‌ వాహన వినియోగం పెరిగే విధంగా తోడ్పాటు కలుగుతుందని హీరో ఎలక్ట్రిక్‌ పేర్కొంది. మాసివ్‌ మొబిలిటీతో కలిసి 10000 స్టేషన్లు, వచ్చే ఏడాది చివరికి సొంతంగా మరో 10000 ఛార్జింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేయాలని హీరో ఎలక్ట్రిక్‌ లక్ష్యంగా పెట్టుకుంది. విద్యుత్‌ పరిశ్రమ తదుపరి స్థాయికి వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు దోహదపడతాయని, కంపెనీ కూడా ఇందుకు కృషి చేస్తుందని హీరో ఎలక్ట్రిక్‌ సీఈఓ సొహిందర్‌ గిల్‌ అన్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని