స్వల్పకాలంలో ఒడుదొడుకులు!
close

Published : 27/09/2021 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్వల్పకాలంలో ఒడుదొడుకులు!

సమీక్ష: సానుకూల దేశీయ, అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు రికార్డు గరిష్ఠాలకు చేరాయి.  చైనా స్థిరాస్తి దిగ్గజం ఎవర్‌గ్రాండ్‌ను దివాలా నుంచి తప్పించేందుకు చైనా కేంద్ర బ్యాంక్‌ చర్యలు చేపట్టడంతో మార్కెట్లు కుదుటపడ్డాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లపై స్పష్టత ఇవ్వడం, దేశీయంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరందుకోవడం, కొవిడ్‌ కొత్త కేసులు స్థిరంగా నమోదుకావడం సెంటిమెంట్‌ను బలపరిచింది. రాబోయే పండుగల సీజన్‌లో అమ్మకాలు పెరిగి ఆర్థిక రికవరీ మెరుగవ్వొచ్చన్న అంచనాలు పనిచేశాయి. రుతుపవనాల్లో పురోగతి కలిసొచ్చింది. ఏప్రిల్‌ 1- సెప్టెంబరు 22 మధ్య ప్రత్యక్ష పన్ను వసూళ్లు 74 శాతం పెరిగి రూ.5.70 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. బ్యారెల్‌ ముడిచమురు ధర 3.6 శాతం పెరిగి 2018 ప్రారంభ స్థాయికి చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి స్థిరంగా ముగిసింది. ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 1.75 శాతం లాభంతో 60,048 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 1.52 శాతం పెరిగి 17,853 పాయింట్ల దగ్గర స్థిరపడింది. స్థిరాస్తి, ఐటీ షేర్లు రాణించాయి. లోహ, ఆరోగ్య సంరక్షణ స్క్రిప్‌లు నీరసపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.8 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.3,048 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. సెప్టెంబరులో ఇప్పటివరకు విదేశీ పోర్టుఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐ) నికరంగా రూ.21,875 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఆగస్టులో ఈ మొత్తం రూ.16,459 కోట్లే.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 5:8గా నమోదు కావడం..

పెద్ద షేర్లలో లాభాల స్వీకరణ కొనసాగడాన్ని సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: సెన్సెక్స్‌ గతవారం 60,333 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసి, లాభాల్లో ముగిసింది. స్వల్పకాలంలో 58800- 59000 శ్రేణిలో మద్దతు లభించే అవకాశం ఉంది. ఆ తర్వాత 57900 పాయింట్లు మరో కీలక మద్దతు స్థాయిగా నిలవనుంది. గత వారం సూచీలు భారీగా పెరిగినా పెద్ద షేర్లు నిరాశపరచడం.. ఎంపిక చేసిన షేర్లలో లాభాల స్వీకరణను సూచిస్తోంది.

ప్రభావిత అంశాలు: సెప్టెంబరు డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో దేశీయ మార్కెట్లు కొంత ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చు. ఆర్థిక గణాంకాలపై మదుపర్లు దృష్టి పెట్టొచ్చు. వీటి నుంచి ఆర్థిక రికవరీపై ఒక అంచనాకు రావొచ్చు. దేశీయంగా చూస్తే.. తయారీ పీఎంఐ, సెప్టెంబరు వాహన విక్రయాలు, మౌలిక రంగ గణాంకాలు విడుదల కానున్నాయి.  ద్విచక్రవాహన విక్రయాలు మందకొడిగా, కార్ల అమ్మకాలు మెరుగ్గా ఉండొచ్చని అంటున్నారు. ఈ వారం ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ పబ్లిక్‌ ఇష్యూ ప్రారంభం కానుంది. చైనా ఎవర్‌గ్రాండ్‌ బాండ్‌లకు వడ్డీ చెల్లింపు 29న చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన వార్తలు, పరిణామాలు కీలకం కానున్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థ నీరసపడితే.. దేశీయ లోహ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అమెరికా బాండు రాబడులు కోలుకోవడంపై దృష్టి పెట్టొచ్చు. చైనా తయారీ, ఐరోపా ఆర్థిక గణాంకాలపై కన్నేయొచ్చు. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, రుతుపవనాల పురోగతి, ముడిచమురు ధరలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడుల నుంచి కూడా సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. చమురు ధరలు మరింత పెరిగితే దేశీయ సూచీల్లో లాభాల స్వీకరణకు దారితీయొచ్చు.

తక్షణ మద్దతు స్థాయులు: 59,243, 58,878, 58,232

తక్షణ నిరోధ స్థాయులు: 60,400, 61,000, 61,600

స్వల్పకాలంలో మార్కెట్‌ ఒడుదొడుకులు పెరిగే అవకాశం ఉంది.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని