4-5 పెద్ద బ్యాంకులు అవసరం
close

Published : 27/09/2021 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

4-5 పెద్ద బ్యాంకులు అవసరం

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

ముంబయి: దేశీయంగా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్‌ స్థాయిని పెంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు. కొవిడ్‌ పరిణామాల అనంతరం ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజితం అవుతోందని, ఈ తరుణంలో దేశానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తరహాలో 4-5 పెద్ద బ్యాంకుల ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) 74వ వార్షిక సమావేశంలో (ఏజీఎం) ఆర్థిక మంత్రి ప్రసంగించారు. పరిశ్రమల అవసరాలు తీర్చేలా, అన్ని ఆర్థిక కేంద్రాలకు అందుబాటులో ఉండేలా బ్యాంకు శాఖలు లేదా డిజిటల్‌ బ్యాంకింగ్‌ సదుపాయాలు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీ) విలీనం ద్వారా పెద్దబ్యాంకుల ఏర్పాటు సాకారమవుతుందని వివరించారు. 2019లో బలహీనంగా ఉన్న 6 పీఎస్‌బీలను విలీనం చేసి 4 పెద్ద బ్యాంకులుగా ప్రభుత్వం మార్చిన సంగతి విదితమే. ఫలితంగా 2017లో 27 పీఎస్‌బీలుండగా, ఇప్పుడు 7 పెద్ద, 5 చిన్న పీఎస్‌బీలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్‌ డాలర్లు, 2030 నాటికి 2 లక్షల కోట్ల డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు మంచి వ్యాపార నమూనాలను అభివృద్ధి చేయాలని ఆమె సూచించారు. మౌలిక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తరఫున ఒక అభివృద్ధి ఆర్థిక సంస్థను (డీఎఫ్‌ఐ) ఏర్పాటు చేయబోతున్నామని, త్వరలో విధి విధానాలు రూపొందిస్తామని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థకు బ్యాంకులు వెన్నెముక లాంటివని, మంచి ఆర్థిక సేవలు అందించడం ద్వారా దేశ ప్రగతికి తోడ్పాటు అందించాలని ఆమె కోరారు.

చాలా జిల్లాల్లో బ్యాంకు శాఖల కొరత: ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నా, దేశంలోని చాలా జిల్లాల్లో ఇంకా బ్యాంకు శాఖల కొరత ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. అవసరమైన ప్రాంతాల్లో పూర్తిస్థాయి శాఖలను ప్రారంభించాలని బ్యాంకులకు సూచించారు. గత దశాబ్దం నుంచి 2,000 మందికి పైగా జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ బ్యాంకింగ్‌ ఉనికి ఉండేలా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ‘అయినా కూడా ఇప్పటికీ చాలా జిల్లాల్లోని పెద్ద పంచాయతీల్లోనూ బ్యాంకు శాఖలు లేవ’ని వివరించారు. ఐబీఏ సభ్యులు అన్ని జిల్లాలను పరిశీలించి, వ్యవసాయ దిగుబడుల ట్రేడింగ్‌, టోకు వ్యాపారం అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడ బ్యాంకు శాఖలను ప్రారంభించేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు.  శాఖలు ఏర్పాటు చేయలేని ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ సేవలను డిజిటల్‌ రూపంలో అందించవచ్చని విశ్లేషించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని