రూ.45,000 కోట్ల సమీకరణ లక్ష్యం
close

Updated : 27/09/2021 04:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.45,000 కోట్ల సమీకరణ లక్ష్యం

 అక్టోబరు-నవంబరులో 30 ఐపీఓలు

దిల్లీ: తొలి పబ్లిక్‌ ఆఫర్ల (ఐపీఓ) ద్వారా వచ్చే 2 నెలల్లో రూ.45,000 కోట్లకు పైగా నిధుల్ని సమీకరించేందుకు కనీసం 30 కంపెనీలు సిద్ధమవుతున్నట్లు మర్చంట్‌ బ్యాంకింగ్‌ వర్గాలు తెలిపాయి. సాంకేతికత (టెక్నాలజీ) ఆధారిత కంపెనీలే ఇందులో అధిక భాగం నిధుల్ని సమీకరించనున్నాయని సమాచారం. ఆహార పదార్థాల డెలివరీ కంపెనీ జొమాటో ఐపీఓకు 38 రెట్లకు పైగా అధిక స్పందన రావడం, కొత్త తరం టెక్‌ కంపెనీలకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఇందువల్లే చాలా కంపెనీలు షేర్ల విక్రయం ద్వారా నిధుల్ని సమీకరించేందుకు సన్నద్ధమవుతున్నాయి.

ఈ సంస్థలన్నీ..

అక్టోబరు-నవంబరులో పబ్లిక్‌ ఇష్యూలకు రాబోతున్న కంపెనీల్లో పాలసీబజార్‌ (రూ.6,017 కోట్లు), ఎమ్‌క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ (రూ.4,500 కోట్లు), నైకా (రూ.4,000 కోట్లు), సీఎంఎస్‌ ఇన్ఫోసిస్టమ్స్‌ (రూ.2,000 కోట్లు), మొబిక్విక్‌ సిస్టమ్స్‌ (రూ.1,900 కోట్లు), నార్తర్న్‌ ఆర్క్‌ క్యాపిటల్‌ (రూ.1,800 కోట్లు), ఇక్సిగో (రూ.1,600 కోట్లు), సఫైర్‌ ఫుడ్స్‌ (రూ.1,500 కోట్లు), ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (రూ.1,330 కోట్లు), స్టెరిలైట్‌ పవర్‌ (రూ.1,250 కోట్లు), రేట్‌గెయిన్‌ ట్రావెల్‌ టెక్నాలజీస్‌ (రూ.1,200 కోట్లు), సుప్రియా లైఫ్‌సైన్స్‌ (రూ.1,200 కోట్లు) తదితర సంస్థలున్నట్లు సమాచారం.

ఈ స్థాయిలో ఎందుకు?

ప్రైవేటు ఈక్విటీ (పీఈ) సంస్థల నుంచి జొమాటో వంటి కంపెనీలు గతంలో నిధుల్ని సమీకరించేవి. అయితే ఐపీఓ ద్వారా నిధుల్ని సమీకరించవచ్చని జొమాటో నిరూపించడం వల్లే, కొత్తతరం టెక్‌   కంపెనీలు ఐపీఓ దారిని ఎంచుకుంటున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి తర్వాత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దాని కంటే మిన్నగా రికవరీ సాధిస్తుండటం, విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు), దేశీయ మదుపర్లు స్టాక్‌ మార్కెట్లలో గత ఏడాదిగా విపరీతంగా నిధులు చొప్పిస్తుండటం వంటి కారణాలూ ఐపీఓలకు వచ్చేందుకు కంపెనీలను ప్రేరేపిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. మార్కెట్‌లో ఇలాగే 1-2 ఏళ్లు బుల్‌ రన్‌ కొనసాగితే మరిన్ని ఐపీఓలు వరుస కట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

40 కంపెనీలు.. రూ.64,217 కోట్లు

ఈ ఏడాది ఇప్పటి వరకు 40 కంపెనీలు ఐపీఓలకు వచ్చి సుమారు రూ.64,217 కోట్లు సమీకరించాయి. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌కు చెందిన మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్‌ పవర్‌గ్రిడ్‌ ఇన్విట్‌ (రూ.7,735 కోట్లు), బ్రూక్‌ఫీల్డ్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్‌ ట్రస్ట్‌లు (రూ.3,800 కోట్లు) కూడా ఐపీఓల ద్వారా నిధుల్ని సమీకరించాయి. 2017లో 36 ఐపీఓల ద్వారా రూ.67,147 కోట్ల నిధుల సమీకరణ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఈ ఏడాదే సమీకరణ జరిగింది. 2020లో 15 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.26,611 కోట్లు సమీకరించాయి. ఈ నెల 29 నుంచి రూ.2,778 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఏఎంసీ పబ్లిక్‌ ఇష్యూకు రాబోతోంది.

ఎల్‌ఐసీ ఐపీఓకు న్యాయ సలహాదారు ఎంపిక

ఎల్‌ఐసీ మెగా ఐపీఓకు న్యాయ సలహాదారుగా సిరిల్‌ అమర్‌చంద్‌ మంగల్‌దాస్‌ను ప్రభుత్వం ఎంపిక చేసినట్లు పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ (దీపమ్‌) విభాగంలోని అధికారి ఒకరు వెల్లడించారు. ఈ నెల 24న 4 న్యాయ సంస్థలు (లా ఫర్మ్స్‌) దీపమ్‌ ఎదుట తమ ప్రజెంటేషన్లు ఇవ్వగా, అందులో సిరిల్‌ అమర్‌చంద్‌ మంగల్‌దాస్‌ను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. 2022 జనవరి-మార్చిలో ఎల్‌ఐసీ ఇష్యూను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని