నిఫ్టీ 18000 ఖాయమే!
close

Updated : 27/09/2021 05:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిఫ్టీ 18000 ఖాయమే!

మదుపర్లలో ఉత్సాహం కొనసాగొచ్చు

అధిక స్థాయుల్లో లాభాల స్వీకరణ మేలు

జాగ్రత్తగా ట్రేడింగ్‌ చేయాలి

అంతర్జాతీయ పరిణామాలు కీలకం

విశ్లేషకుల అంచనాలు

సెన్సెక్స్‌ 60,000 పాయింట్ల శిఖరాన్ని తాకిన నేపథ్యంలో నిఫ్టీ కూడా ఈ వారం 18,000 పాయింట్ల మైలురాయిని పరీక్షించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబరు డెరివేటివ్స్‌ సిరీస్‌ గడువుకు ముందు మదుపర్లలో ఉత్సాహం కొనసాగే అవకాశం ఉందంటున్నారు. దేశీయ తయారీ పీఎంఐ గణాంకాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఇప్పటికే షేర్ల విలువలు అధిక స్థాయుల్లో ఉన్నందున జాగ్రత్తగా ట్రేడింగ్‌ చేయాలని, పై స్థాయుల్లో లాభాల స్వీకరణ చేయొచ్చని సాంకేతిక నిపుణులు సిఫారసు చేస్తున్నారు. దేశీయంగా కీలక పరిణామాలు లేనందున, అంతర్జాతీయ వార్తల ఆధారంగా.. ముఖ్యంగా చైనాలో ఎవర్‌గ్రాండ్‌ రుణ సంక్షోభ పరిణామాలను బట్టి మార్కెట్‌ కదలికలు ఉండొచ్చు.  వివిధ రంగాలపై విశ్లేషకుల అంచనాలు ఎలా ఉన్నాయంటే..

* ఔషధ కంపెనీల షేర్లు స్తబ్దుగా ౖకదలాడొచ్చు. అమెరికా వంటి కీలక మార్కెట్లలో కొత్త అనుమతులు ఆలస్యమవుతుండడం; ధరలు తగ్గుతుండడం ప్రభావం చూపించొచ్చు.

*చమురు కంపెనీల షేర్లు చాలా తక్కువ శ్రేణికి లోబడి కదలాడొచ్చు. రిఫైనరీ కంపెనీలతో పోలిస్తే అప్‌స్ట్రీమ్‌ కంపెనీలు బలంగా కనిపిస్తున్నాయి.

​​​​​​​* బ్యాంకు షేర్లు ఒక శ్రేణికి లోబడి కదలాడొచ్చు. అధిక విలువ గల షేర్లు మదుపర్ల ఉత్సాహాన్ని కొంత దెబ్బతీయొచ్చు. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు సానుకూల ధోరణిలో చలించొచ్చు.

​​​​​​​*యంత్ర పరికరాల షేర్లు కీలక సూచీలతో పాటే కదలాడొచ్చు. ఆర్థిక వృద్ధి కొవిడ్‌ ముందు స్థాయులకు చేరువగా వెళుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయని బ్రోకరేజీలు భావిస్తున్నాయి. పెరిగిన వినియోగ గిరాకీ, కరోనా కేసుల వేగంలో తగ్గుదల, టీకాల వేగం, ఆర్డర్ల పూర్తి తదితరాల వల్ల ఈ షేర్లు రాణించవచ్చు.

​​​​​​​* ఎంపిక చేసిన వాహన షేర్లలో కదలికలు ఉండొచ్చు. అక్టోబరు 1న వెలువడే ‘సెప్టెంబరు టోకు విక్రయ గణాంకాల’ నుంచి మదుపర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. చిప్‌ల కొరత కారణంగా వాహన విక్రయ గణాంకాలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ అంచనా వేస్తోంది. పండుగ సీజనులోగా సరఫరా సమస్యలను పరిష్కరించుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి.

​​​​​​​* చైనా ఎవర్‌గ్రాండ్‌ సంక్షోభం ఆందోళనల మధ్య లోహ, గనుల కంపెనీల షేర్లు కీలక సూచీలతో పోలిస్తే తక్కువ పనితీరునే ప్రదర్శించవచ్చు. ఉక్కు కంపెనీ షేర్లపైనా అదనపు ఒత్తిడి కనిపించొచ్చు.

​​​​​​​*సిమెంటు కంపెనీల షేర్లు బలహీనతలను నమోదు చేయవచ్చు. లాభాల స్వీకరణ కొనసాగొచ్చు.  

​​​​​​​* ఎటువంటి కీలక వార్తలూ లేనందున ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు చాలా తక్కువ శ్రేణిలో చలించొచ్చు. గిరాకీలో రికవరీపై హిందుస్థాన్‌ యునిలీవర్‌ జాగ్రత్తతో కూడిన ఆశావహ దృక్పథంతో ఉంది.

​​​​​​​* ఐటీ కంపెనీల షేర్లు ఈ వారమూ లాభాలు అందుకోవచ్చు. తాజా త్రైమాసిక ఫలితాల్లో అసెంచర్‌ మెరుగైన అంచనాలను నమోదు చేయడం కలిసి రావొచ్చు. అక్టోబరు 8 నుంచి జులై-సెప్టెంబరు ఫలితాలను ఐటీ కంపెనీలు ప్రారంభించనున్నాయి.
​​​​​​​
* ఎంపిక చేసిన టెలికాం షేర్లలో ట్రేడింగ్‌ బాగా జరగొచ్చు. నిధుల సమీకరణ, టారిఫ్‌ పెంపు అంచనాలు, సంస్కరణల నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్‌కు సానుకూలతలు కొనసాగొచ్చు. వొడాఫోన్‌ ఐడియా నిధుల సమీకరణ కార్యకలాపాలను మదుపర్లు సునిశితంగా గమనించొచ్చు.

​​​​​​​


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని