ఉద్యోగ నైపుణ్యాలపై ఉచిత శిక్షణ: టీసీఎస్‌
close

Published : 28/09/2021 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉద్యోగ నైపుణ్యాలపై ఉచిత శిక్షణ: టీసీఎస్‌

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఉద్యోగార్థుల కోసం 15 రోజుల ఉచిత ఆన్‌లైన్‌ నైపుణ్య శిక్షణ కోర్సు ‘టీసీఎస్‌ అయాన్‌ కెరీర్‌ ఎడ్జ్‌’ను ప్రారంభించింది. ప్రవర్తన, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, అకౌంటింగ్‌, ఐటీ, కృత్రిమ మేధలో ప్రాథమిక నైపుణ్యాలు ఈ కోర్సులో అందించనున్నట్లు తెలిపింది. అండర్‌ గ్రాడ్యుయేట్లు, పట్టభద్రులు, పోస్ట్‌గ్రాడ్యుయేట్లు, ఫ్రెషర్లు ఎవరైనా సరే ఈ ఆన్‌లైన్‌ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ కోర్సులో 14 మాడ్యుల్స్‌ ఉంటాయని, ఒక్కో మాడ్యుల్‌ 1-2 గంటలు ఉంటుందని తెలిపింది. ఇందులో తమ నిపుణులు చేసిన వీడియోలు, ప్రజెంటేషన్లు, పఠన సామగ్రి, రికార్డు చేసిన వెబినార్లు తదితరాలు ఉంటాయని పేర్కొంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి వ్యక్తిగత ధ్రువీకరణ పత్రం (సర్టిఫికెట్‌) అందజేస్తామని తెలిపింది. అలాగే కోర్సు పూర్తయిన తర్వాత కూడా వారికి మోడరేటెడ్‌ డిజిటల్‌ చర్చా గదికి యాక్సెస్‌ ఉంటుందని, ఇక్కడ వారు తమ సందేహాలు పోస్ట్‌ చేయవచ్చని, అలాగే సలహాలు కూడా ఇవ్వవచ్చని తెలిపింది.


పారాదీప్‌ ఫాస్ఫేట్స్‌ ఐపీఓకు సెబీ ఆమోదం

దిల్లీ: ప్రముఖ ఎరువుల కంపెనీ పారాదీప్‌ ఫాస్ఫేట్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ప్రతిపాదనకు సెబీ ఆమోదం లభించింది. ఇష్యూలో భాగంగా రూ.1,255 కోట్ల విలువైన తాజా షేర్లను కంపెనీ విక్రయించనుంది.  ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా జువారి మారోక్‌ ఫాస్ఫేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (జెడ్‌ఎంపీపీఎల్‌) 75,46,800 షేర్లను, భారత ప్రభుత్వం 11,24,89,000 షేర్లను కూడా విక్రయించనున్నారు. ప్రస్తుతం పారాదీప్‌ ఫాస్ఫేట్స్‌లో ప్రభుత్వానికి 19.55 శాతం ఉండగా.. జెడ్‌ఎంపీపీఎల్‌కు 80.45 శాతం వాటా ఉంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను గోవాలోని ఎరువుల తయారీ కంపెనీని కొనుగోలు చేసేందుకు, రుణాల చెల్లింపునకు, ఇతర కార్పొరేట్‌ అవసరాల కోసం కంపెనీ వినియోగించనుంది. డై అమ్మోనియమ్‌ ఫాస్ఫేట్‌, ఎన్‌పీకే ఫెర్టిలైజర్స్‌ లాంటి కాంప్లెక్స్‌ ఎరువుల తయారీ, విక్రయం, పంపిణీని పారాదాప్‌ ఫాస్ఫేట్స్‌ నిర్వహిస్తోంది. ఎరువులను జై కిసాన్‌- నవరత్న, నవరత్న బ్రాండులపై విక్రయిస్తోంది. ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూకు యాక్సిస్‌ కేపిటల్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, జేఎం ఫైనాన్షియల్‌, ఎస్‌బీఐ కేపిటల్‌ మార్కెట్స్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.

పబ్లిక్‌ ఇష్యూకు సీపీఆర్‌ గ్రీన్‌ టెక్‌ దరఖాస్తు: లోహ రీసైక్లింగ్‌ కంపెనీ సీఎంఆర్‌ గ్రీన్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించేందుకు ఆమోదం కోరుతూ సెబీకి దరఖాస్తు పత్రాలను సమర్పించింది. ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూలో రూ.300 కోట్ల విలువైన కొత్త షేర్లను కంపెనీ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రమోటర్లు, వాటాదార్లకు చెందిన 3,34,14,138 షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో విక్రయించనున్నట్లు పేర్కొంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపునకు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కంపెనీ ఉపయోగించనుంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని