2022 మార్చి 31 వరకు ప్రస్తుత విదేశీ వాణిజ్య విధానమే
close

Published : 28/09/2021 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2022 మార్చి 31 వరకు ప్రస్తుత విదేశీ వాణిజ్య విధానమే

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

దిల్లీ: వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రస్తుత విదేశీ వాణిజ్య విధానాన్నే (ఎఫ్‌టీపీ) కొనసాగించనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. కొవిడ్‌-19 పరిణామాల రీత్యా ఎఫ్‌టీపీ 2015-20 గడువును ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. 2022 మార్చి 31 వరకు దీనిని పొడిగించనున్నామని మంత్రి సోమవారం చెప్పారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేస్తామన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. అప్పటికి కొవిడ్‌-19 సంబంధిత ఆందోళనలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపారు. ‘కొవిడ్‌-19 పరిణామాల నుంచి ఇప్పటికీ బయటపడలేదు. కొత్త విధానంపై చాలా సంప్రదింపులు చేయాల్సిన అవసరం రావొచ్చ’ని వాణిజ్య మంత్రిత్వ శాఖ, భారత ఎగుమతిదార్ల సమాఖ్య (ఫియో) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి చెప్పారు. 2021లో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు 21 వరకు దేశీయ ఎగుమతులు 185 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయని మంత్రి వెల్లడించారు. ఇదే ధోరణి కొనసాగితే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని భారత్‌ అందుకునే అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు. రానున్న సంవత్సరాల్లో వస్తువులు, సేవల్లో విడివిడిగా లక్ష కోట్ల డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధిస్తామనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. వాణిజ్య లోటు స్థాయి నుంచి వాణిజ్య మిగులుకు మనదేశం చేరాల్సిన అవసరం ఉందన్నారు. అక్టోబరు 1 నుంచి ప్రారంభం కానున్న దుబాయ్‌ ఎక్స్‌పోను రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈజ్‌ ఆఫ్‌ లాజిస్టిక్స్‌ పోర్టల్‌ను కూడా  మంత్రి ప్రారంభించారు.


జీడీపీ 9 శాతం!
8.5% నుంచి పెంచిన ఇక్రా

ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు(జీడీపీ) అంచనాను 8.5 శాతం నుంచి 9 శాతానికి రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా సవరించింది. కరోనా టీకా కార్యక్రమంలో వేగం; ఖరీఫ్‌(వేసవి) పంట దిగుబడులపై మెరుగైన అంచనాలు; ప్రభుత్వ వ్యయాలు పెరుగుతుండటాన్ని దృష్టిలో పెట్టుకుని జీడీపీ అంచనాలను పెంచినట్లు ఇక్రా సోమవారం తెలిపింది. 2020-21లో ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం క్షీణించింది. ఈ తక్కువ ప్రాతిపదిక కారణంగా 2021-22లో అధిక వృద్ధి అంచనాలకు అవకాశం ఏర్పడింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రారంభంలో కరోనా రెండో దశ విజృంభించడంతో విశ్లేషకులు ఆచితూచి వ్యవహరించాల్సి వచ్చింది. ఆర్‌బీఐ మాత్రం ఆర్థిక వ్యవస్థ 9.5 శాతం వృద్ధిని ప్రదర్శిస్తుందని అంచనా వేసింది. కొవిడ్‌ మూడో దశ, ఒకవేళ కొత్త వేరియంట్లు ప్రబలితే తాజా అంచనాలపై ప్రభావం పడుతుందని ఇక్రా వివరించింది.

ఏడాది చివరికల్లా 75% మందికి రెండు డోసుల టీకా

* సెప్టెంబరు 1-26 తేదీల్లో నమోదైన రోజువారీ సగటు 79 లక్షల డోసులు కొనసాగితే ఈ ఏడాది చివరకు నాలుగింట మూడొంతుల (75%) భారతీయులకు కొవిడ్‌ టీకా రెండు డోసులు అందుతాయని ఇక్రా అంచనా వేసింది.

* ఆలస్యంగా విత్తనాలను నాటడంతో ఖరీఫ్‌ విస్తీర్ణం గతేడాది రికార్డు స్థాయికి చేరువైంది. ఈ నేపథ్యంలో 2021-22 పంట దిగుబడులు బలంగా నమోదువుతాయన్న అంచనాలు ఉన్నాయి.

* రుతుపవనాలు అంతటా ఒకేలా లేకపోవడం; వరదల కారణంగా నూనె గింజలు, తృణ ధాన్యాల దిగుబడి మాత్రం కాస్త తగ్గొచ్చు. రెండు, మూడు త్రైమాసికాల్లో వ్యవసాయం, అటవీ, మత్య్సరంగాల వృద్ధి (జీవీఏ) 3 శాతం చొప్పున నమోదు కావొచ్చు. అంతక్రితం అంచనా 2 శాతంగానే ఉంది.

* 2021 ఏప్రిల్‌-జులైలో కేంద్ర వ్యయాలు 4.7% తగ్గాయి. 2021-22 బడ్జెట్‌ అంచనాల్లో 28.8 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో ద్వితీయార్థంలో ప్రభుత్వం మరిన్ని వ్యయాలు చేసే అవకాశం ఉంది.

* సెప్టెంబరు 2021లో పరిశ్రమ రంగ ధోరణులు స్తబ్దుగా కనిపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా విద్యుత్‌ గిరాకీ, గనుల, నిర్మాణ పనులు తగ్గొచ్చు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని