డీలిస్టింగ్‌ నిబంధనల సవరణ: సెబీ
close

Published : 29/09/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డీలిస్టింగ్‌ నిబంధనల సవరణ: సెబీ

 ఓపెన్‌ ఆఫర్‌కు వచ్చే కంపెనీల కోసం

ముంబయి: విలీనాలు-కొనుగోళ్ల(ఎం అండ్‌ ఏ) కోసం జరిగే ఓపెన్‌ ఆఫర్‌ అనంతరం జరిగే షేర్ల డీలిస్టింగ్‌ నిబంధనలను సవరించాలని మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ నిర్ణయించింది.  ఆయా లావాదేవీలు మరింత హేతుబద్ధంగా, సౌకర్యవంతంగా సాగాలన్నదే సెబీ ఉద్దేశం. టేకోవర్‌ రెగ్యులేషన్స్‌ కింద జరిగే ఓపెన్‌ ఆఫర్ల విషయంలో మాత్రమే కొత్త మార్గదర్శకాలు అమలు చేయనున్నామని మంగళవారమిక్కడ జరిగిన బోర్డు సమావేశానంతరం సెబీ పేర్కొంది. లక్ష్యిత కంపెనీని సొంతంగా లేదా సంయుక్తంగా నియంత్రణలోకి తీసుకునే కొనుగోలుదారు విషయంలో ఈ సవరణలు వర్తిస్తాయి.

ప్రస్తుత నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

ప్రస్తుత టేకోవర్‌ నిబంధనల కింద ఓపెన్‌ ఆఫర్‌ చేయాల్సి వస్తే కొనుగోలుదారు వాటా 75 శాతానికి పైకి ఒక్కోసారి 90 శాతానికి సైతం చేరుతుంది. షేర్ల డీలిస్టింగ్‌ చేయాలంటే మాత్రం ఆ వాటాను 75 శాతం కిందకు తీసుకురావాల్సి వస్తుంది. ఈ పరస్పర విరద్ధ లావాదేవీల వల్ల నమోదిత కంపెనీల టేకోవర్‌ సంక్లిష్టంగా మారిందని సెబీ అభిప్రాయపడింది.

కొత్త నిబంధనలొస్తే..

* ఓపెన్‌ ఆఫర్‌ అనంతరం కొనుగోలుదారు వాటా 90 శాతానికి చేరితే.. షేర్లు విక్రయించే అందరు వాటాదార్లకు ఒకే డీలిస్టింగ్‌ ధరను చెల్లించాలి.

* ఒక వేళ ఓపెన్‌ ఆఫర్‌ తర్వాత 90 శాతానికి వాటా చేరకపోతే షేర్లను విక్రయించాలనుకునే అందరు వాటాదార్లకు టేకోవర్‌ ధరను చెల్లించాలి.

* ఓపెన్‌ ఆఫర్‌ తర్వాత 75 శాతం వాటా కంటే ఎక్కువగా ఉన్నా, ఏదైనా కంపెనీ డీలిస్టింగ్‌ కాకపోతే.. కొత్త నిబంధనల కింద డీలిస్టింగ్‌ కావడానికి 12 నెలల సమయం ఇస్తారు. ఒక వేళ అప్పటికీ కాకుంటే.. కనీస ప్రజల వాటా నిబంధనను ఆ గడువులోగా పాటించాల్సి ఉంటుంది.

* ఒక వేళ లిస్టింగ్‌ కంపెనీగానే కొనసాగాలని ఓపెన్‌ ఆఫర్‌ సమయంలోనే కొనుగోలుదారు చెబితే మాత్రం కొనుగోలు ఒప్పందం; ఓపెన్‌ ఆఫర్‌ కింద చేసే కొనుగోళ్లను తగ్గించుకోవాల్సి ఉంటుంది.


ఫోర్డ్‌లో 10,800 కొత్త ఉద్యోగాలు

గ్లెండేల్‌ (అమెరికా): 2025 నాటికి మూడు పెద్ద విద్యుత్‌ వాహన బ్యాటరీ ప్లాంట్లు, ఒక వాహన అసెంబ్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఫోర్డ్‌, భాగస్వామ్య కంపెనీ ప్రకటించాయి. విద్యుత్‌ వాహన టెక్నాలజీపై పెట్టుబడుల్లో భాగంగా కొత్త 10,800 ఉద్యోగాలను సృష్టించనున్నట్లు తెలిపాయి. కెంటకీ, టెనెన్సీల్లో ఈ కర్మాగారాలను నెలకొల్పనున్నారు. ఉత్తర అమెరికాలో ఉత్పత్తి చేసే కొత్త తరం ఫోర్డ్‌, లింకన్‌ విద్యుత్‌ వాహనాలకు ఇక్కడి బ్యాటరీలను వినియోగిస్తారు. మొత్తం దాదాపు 11.3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడుల్లో ఫోర్డ్‌ 8 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.60,000 కోట్లు) పెట్టనుంది. కంపెనీ పెడుతున్న భారీ పెట్టుబడుల్లో ఇది ఒకటి కావడం గమనార్హం.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని