వాటాదార్ల సమావేశం నిర్వహించుకోండి
close

Published : 29/09/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాటాదార్ల సమావేశం నిర్వహించుకోండి

 ఫ్యూచర్‌ గ్రూపునకు ఎన్‌సీఎల్‌టీ అనుమతి
 రిలయన్స్‌తో ఒప్పందంపై అనుమతి కోసం

దిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అనుబంధ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌కు ఆస్తులు విక్రయించే ఒప్పందానికి అమనుతి కోసం వాటాదార్లు, రుణసంస్థలతో సమావేశాలు నిర్వహించేందుకు కిశోర్‌ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్‌ గ్రూపునకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని ఫ్యూచర్‌ రిటైల్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఫ్యూచర్‌ గ్రూపు కంపెనీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుచిత్రా కనుపర్తి, చంద్ర భాను సింగ్‌ నేతృత్వంలోని ఎన్‌సీఎల్‌టీ ధర్మాసనం (ముంబయి) తిరస్కరించింది. విలీన ఒప్పందంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అమెజాన్‌ పిటిషన్‌ వేసేందుకు ఇంకా సమయం రాలేదని ఎన్‌సీఎల్‌టీ పేర్కొన్నట్లు సమాచారం. ‘వాటాదార్లు, రుణ సంస్థలు విలీన ప్రతిపాదన అంశంపై చర్చ జరిపి, ఆమోదం తెలిపాక మళ్లీ తుది ఆమోదం కోసం ఎన్‌సీఎల్‌టీకే రావాల్సి ఉంటుంది. అప్పటివరకు అమెజాన్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల వాటాదార్లు, రుణ సంస్థలతో సమావేశం నిర్వహించడంతోనే అంతా అయిపోయినట్లుగా భావించకూడద’ని ఎన్‌సీఎల్‌టీ వెల్లడించింది. ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు అందాక, ఏం చేయాలో నిర్ణయిస్తామని అమెజాన్‌ ప్రతినిధి పేర్కొన్నారు.

న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు:  తాజా ఆదేశాలను వారం రోజుల పాటు వాయిదా వేయాల్సిందిగా ఎన్‌సీఎల్‌టీని అమెజాన్‌ తరపు న్యాయవాది కోరారు. అందుకు ట్రైబ్యునల్‌ తిరస్కరించింది. సాధ్యమైనంత త్వరగా ఆదేశాల కాపీని ఇరుపక్షాలకు పంపిస్తామని, ఒకవేళ దీనిపై మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అనుకుంటే వెళ్లవచ్చని సూచించింది.

ఇదీ జరిగింది: ఫ్యూచర్‌ గ్రూపునకు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌, గిడ్డంగుల వ్యాపారాలను విలీనం చేసి, ఒకే సంస్థగా మార్చి రూ.24,713 కోట్లకు రిలయన్స్‌ రిటైల్‌కు విక్రయించేందుకు ఇరుసంస్థల మధ్య గతేడాది ఆగస్టులో ఒప్పందం కుదిరింది. అయితే 2019 ఆగస్టులో ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన ఫ్యూచర్‌ కూపన్స్‌లో 49 శాతం వాటాను అమెజాన్‌  కొనుగోలు చేసింది. ఫ్యూచర్‌ రిటైల్‌లో 7.3 శాతం వాటా ఫ్యూచర్‌ కూపన్స్‌కు ఉంది. ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటాను 3-10 ఏళ్లలో కొనే హక్కు కూడా ఆ సందర్భంలో అమెజాన్‌కు లభించింది. ఇందుకు భిన్నంగా రిలయన్స్‌తో ఫ్యూచర్‌ గ్రూపు ఒప్పందం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులను అమెజాన్‌ ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఒప్పంద లావాదేవీపై ముందుకు వెళ్లకూడదని ఫ్యూచర్‌ గ్రూపునకు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత భారత న్యాయస్థానాల్లోనూ ఇరు సంస్థలు పిటిషన్‌లు దాఖలు చేశాయి. అమెజాన్‌కు అనుకూలంగా అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చెల్లుబాటు అవుతుందని, భారతీయ చట్టాల ప్రకారం అమలు చేయొచ్చని ఇటీవలే సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని